జీవచ్ఛవాలుగా.. | two days in coma with accident | Sakshi
Sakshi News home page

జీవచ్ఛవాలుగా..

Published Mon, Jan 13 2014 5:42 AM | Last Updated on Mon, Aug 20 2018 7:28 PM

two days in coma with accident

సాక్షి, మంచిర్యాల/మందమర్రి : అది కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ మండలం రొంపికుంట. ఆ గ్రామంలో మంచి వైద్యుడు ఉన్నాడు. అతడే కుందారపు శ్రీనివాస్. ఇతనికి పదకొండేళ్ల క్రితం ఆదిలాబాద్ జిల్లా మందమర్రికి చెందిన శ్రీలతతో వివాహం జరిగింది. వీరికి కుమారుడు అభిరామ్, కూతురు దీక్షిత జన్మించారు. కలతలు, కలహాలు లేకుండా హాయిగా జీవిస్తున్నా రు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు మందమర్రిలోని తన తోడల్లుడు హేమంత్‌కుమార్ నానమ్మ దశ దినకర్మకు వెళ్లారు. తోడళ్లుళ్లు, అక్కా చెల్లెళ్లు, అమ్మమ్మ, పిన్నిలతో శ్రీనివాస్ కుటుంబం హాయిగా గడిపి గురువారం సాయంత్రం 4 గంటలకు బెల్లంపల్లిలోని సెకండ్‌జోన్‌లో ఉన్న తమ బంధువుల ఇంటికి వెళ్లారు.

వారి ఇంట్లో ఏడు గంటల వరకు గడిపి ఇంటికి బయలు దేరారు. అప్పటికే రాత్రయింది! ‘గింత చీకటైంది. పొద్దున్నె వెళ్లండి బిడ్డా.. అని శ్రీలత తల్లి లక్ష్మి అన్నది. మనమరాలు దీక్షిత నా చేయి పట్టుకుని వదల్లేదు. వచ్చింది కర్మకు కాబట్టి ఉండద్దనే ఉద్దేశంతో వెళ్లింది నాబిడ్డా. చీకట్లో జాగ్రత్తగా పొమ్మని చెప్పాను. అయినా పండుగ దగ్గర్లోనే ఉంది. రాత్రి 8.30 వరకు చేరుకుంటుం. ఎప్పుడు పోతలేమానె. చేరుకున్న తర్వాత ఫోన్ చేస్తా’ అని చెప్పి శ్రీలత, శ్రీనివాస్ పిల్లలు ద్విచక్ర వాహనంపై బయలు దేరారు అని రోదించుకుంటూ చెప్పింది శ్రీలత తల్లి లక్ష్మి.

 ఇంతలోనే ఘోరం..
 రాత్రి 7.30 గంటలకు శ్రీనివాస్, శ్రీలత, పిల్లలు కమాన్‌పూర్‌కు బయలు దేరారు. మందమర్రి దగ్గరలోని పాలవాగు కల్వర్టు వద్ద పాము అడ్డు వచ్చింది. శ్రీనివాస్ బైక్ నడుపుతుండగా ముందు కూర్చున్న దీక్షిత డాడీ పాము అనగానే శ్రీనివాస్ బయపడి కంగారుపడ్డాడు. ఇంతలోనే బైక్ కల్వర్టుకు ఢీకొని లోయలో పడింది. కింద పదునైన బండలు ఉన్నాయి. బండలపై పడటంతో శ్రీనివాస్, దీక్షిత తలలకు తీవ్రంగా దెబ్బతాకింది. పడటంతోనే శ్రీనివాస్ చనిపోయాడు. దీక్షితకు బలమైన దెబ్బలు తాకడంతో మంచినీళ్లు.. మంచినీళ్లు అని అరిచింది.. అరిచి అరిచి రెండు గంటల తర్వాత మృతిచెందింది.

 అభిరామ్ పడటంతోనే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతని చేయి విరిగింది. వెనుక కూర్చున్న శ్రీలతకు కూడా నడుంపై దెబ్బలు తాకాయి. కదల్లేని పరిస్థితి. చుట్టూ చీకటి ఉండటంతో ఎవరూ కనిపించ లేదు. ఎవండి.. ఎవండి.. అరేయ్ బాబు, అమ్మాయి ఎక్కడున్నారు.. అని అన్నా ఎవరి నుంచి మాటలు వినబడ లేదు. కాపాడండి.. కాపాడండి అని అరిచింది.. ఎవరు రాకపోవడంతో ఆమె కూడా అపస్మారక స్థితి లోకి వెళ్లింది. రాత్రి 11 గంటల వరకు కొడుకు అభిరామ్‌కు మెలుకువ వచ్చింది.

 మేలకువ వచ్చి..
 చుట్టూ కటిక చీకటి.. చెట్లు.. చిమ్మట పురుగుల గోల.. ముళ్ల కంపలు.. రాళ్లు రప్పలపై రక్తపు మడుగులో తండ్రి, చెల్లెలు మృతదేహాలు.. మరోవైపు అపస్మారక స్థితిలోకి వెళ్లిన తల్లి. భయానకం కొలిపే దృశ్యాలు. ఎటూ చూసినా కటిక చీకటి. పామును చూసిన భయంతో ఎటు నుంచి వస్తుందోనని బాలుడి భయం.. బాలుడు కూడా కాపాడండని కేకలు వేశాడు. ఇంతలోనే బాలుడు కూడా అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గురువారం రాత్రి గడిచింది.. శుక్రవారం  వాహనాలు ఆ కల్వర్టు పై నుంచి వెళ్లాయి. కల్వర్టు లోతుగా ఉండటం.. ముళ్లపొదలు అధికంగా ఉండటంతో వీరిని ఎవరు గమనించలేదు.

ఆ రోజు కూడా గడిచింది. నిమిషాలు గంటలు.. గంటలు రోజుల్లా గడిచాయి.. ఇలా 48 గంటలు తల్లీ, కొడుకు జీవచ్ఛవాల్లా ఉన్నారు. శనివారం ఉదయం సృ్పహకోల్పోయిన శ్రీలత మేలుకువ వచ్చింది. కదులుదామంటే కదలలేని స్థితి. తన వద్ద ఉన్న సెల్‌ఫోన్ తీసి చూసే సరికి వందల కొద్ది మిస్‌డ్ కాల్స్ ఉన్నాయి. వెంటనే కుటుంబ సభ్యులకు తెలియజేయాలని తాపత్రయ పడింది. కమాన్‌పూర్‌లోని తన బంధువులకు ఫోన్ చేసి తమకు ప్రమాదం జరిగిందని.. గోదావరిఖనిలోని రాజేశ్ టాకీస్ దగ్గర ఉన్నామని చెప్పి మళ్లీ సృ్పహ కోల్పోయింది.

 ఉదయం నుంచి వెతుకగా..
 ఇటు కమాన్‌పూర్, మందమర్రిలోని కుటుంబ సభ్యులు ఉదయం నుంచి రహదారి వెంట వెతికారు. పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. ఇటు పోలీసులు, ఆటూ కుటుంబ సభ్యులు వెతికినా ప్రయోజనం లేదు. ఇరువురు అప్పటి నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఫోన్ రింగవుతుంది కాని ఎవరూ లేపి మాట్లాడలేని పరిస్థితి. ఈ రింగ్ కల్వర్టు పై నుంచి పోయే వారికి వినిపించని పరిస్థితి. అంతలోనే మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో మేలుకొవ వచ్చిన అభిరామ్ ఫోన్ శబ్దం విని మాట్లాడాడు. ‘పిన్ని దాహం అవుతుంది.. ఆకలవుతుంది..’ అంటూ ఏడ్చారు.

 అదే సమయంలో పోలీసులు సిగ్నల్ ఆధారంగా వారున్న ప్రాంతాన్ని గుర్తించారు. వెంటనే బాధిత కుటుంబసభ్యులతో కలిసి మందమర్రి-రామకృష్ణాపూర్ మధ్యలో ఉన్న కల్వర్టుల వద్ద గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు కల్వర్లు కింద శనివారం రాత్రి పది గంటలకు గుర్తించారు. అపస్మారక స్థితిలో ఉన్న అభిరామ్‌ను, శ్రీలతను మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు..

 స్పృహలోకి రాని శ్రీలత
 మందమర్రి ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కుందారపు శ్రీలత, అభిరామ్‌రాం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రాణపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు.  ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్రీలత స్పృహలోకి సరిగా రావడం లేదని అమె బంధువులు తెలిపారు. శ్రీలత ఎడమ చేయి విరగడంతో దానికి ఆపరేషన్ నిర్వహించారు. అభిరామ్ రాంలకు కూడా శరీరం లోపలి భాగాల్లో గాయాలు కావడంతో బాలుడిని కూడా ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ఇంకా తన భర్త, కుమార్తె మృతి చెందిన విషయం ఇంకా శ్రీలతకు తెలియదని, వారు మరో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు మాత్రమే తెలుసు అని బంధువుల తెలిపారు. దీంతో వచ్చిన వారికి వారి మరణవార్త శ్రీలతకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మానసికంగా తీవ్రంగా గాయపడిందని, ఇంకా ప్రమాదం షాక్‌లోనే ఉందని వారు తెలిపారు. నేడు అయితే పూర్తిస్థాయిలో వారి ఆరోగ్య పరిస్థితి తెలిసే అవకాశం ఉంది.

 బాబాయ్ డాడీ, మమ్మీ, చెల్లి ఏక్కడ..
 బాబాయ్ డాడీ, మమ్మీ, చెల్లి ఎక్కడ ఇంకా నాన్న నిద్రపోయి లేవలేదా.. ఎందుకు ఇంత మంది ఉన్నారు. నాకు మమ్మీ, డాడీ, చెల్లిని చూపించండి అంటూ శ్రీనివాస్ కుమారుడు అభిరామ్ అనడంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు బోరున విలపించారు. ప్రమాదంలో గాయపడి మంచిర్యాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అభిరామ్‌ను తన తండ్రికి దహన సంస్కారాలు చేసేందును రొంపికుంట గ్రామానికి తీసుకువచ్చారు. శ్రీనివాస్ తండ్రి రాజేశం మనవడు అభిరామ్‌తో కలిసి తలకొరివిపెట్టారు.

 కమాన్‌పూర్‌లో అంత్యక్రియలు
 మంచిర్యాలలో శ్రీనివాస్, దీక్షిత మృతదేహాలకు ఆదివారం పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కమాన్‌పూర్‌కు తరలించారు. ఆదివారం తండ్రీకూతురు అంత్యక్రియలు జరిగాయి. శ్రీలతకు తీవ్రగాయాలు కాగాకరీంనగర్‌లోని ఓ ఓ ప్రవేటు ఆస్పతిలో చికిత్స పొందుతుంది. ఆమె భర్త, కూతురు కడారి సారి చూపున నోచుకోలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement