ఎన్నికలకు ముందే.. రెండు రాష్ట్రాలకు సీఎంలు
తెలంగాణకు జైపాల్‌రెడ్డి.. ఆంధ్రప్రదేశ్‌కు కన్నా?
కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ అధిష్టానం
గెజిట్ నోటిఫికేషన్ వచ్చేవరకు రాష్ట్రపతి పాలన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియలో చివరి అంకాన్ని కూడా గట్టెక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ఇపుడు రెండు ప్రాంతాల్లో పార్టీ ప్రయోజనాలను పరిరక్షించుకొనే పనిలో పడింది. ఎన్నికలకు ముందే రెండు రాష్ట్రాలు ఏర్పాటయ్యే దిశగా వడివడిగా అడుగులు వేస్తూనే రాజకీయంగా లబ్దిచేకూరే మార్గాలపై ఆ పార్టీ అగ్రనేతలు దృష్టి సారించారు. రాష్ట్ర విభజనతో ఇరుప్రాంతాల్లో ఏర్పడిన పరిణామాలను సమర్థంగా ఎదుర్కొని ఇబ్బందులనుంచి గట్టెక్కించే వారికి పగ్గాలు అప్పగించడంపై ఆలోచనలు చేస్తున్నారు. పార్టీ హైకమాండ్ పెద్దలు ఇప్పటికే దీనిపై స్థూలంగా ఒక అభిప్రాయానికి వచ్చారని తెలుస్తోంది.
రాష్ట్ర విభజన బిల్లుకు రాజ్యసభ కూడా ఆమోదం తెలపడంతో బిల్లు రాష్ట్రపతికి వెళ్లడం, ఆ తరువాత నోటిఫికేషన్‌లో వచ్చే ‘అపాయింటెడ్ డే’తో రాష్ట్రం అధికారికంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా విడివడనుంది. తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి ఈనెలాఖరులోగానే ఆమోదముద్రవేయవచ్చని భావిస్తున్నారు. రాష్ట్ర విభజనకు నిరసనగా కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం సీఎం పదవికి రాజీనామా సమర్పించడం తెలిసిందే. గెజిట్ నోటిఫికేషన్ వచ్చి రెండు రాష్ట్రాలు అధికారికంగా ఏర్పాటు అయ్యేవరకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించవచ్చని తెలుస్తోంది. అప్పటివరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచి, గెజిట్ నోటిఫికేషన్‌లో వచ్చే తెలంగాణ ఏర్పాటు తేదీ అనంతరం రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తారు.
అప్పుడు రాష్ట్రం అధికారికంగా రెండుగా విడివడి రెండు అసెంబ్లీలు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుత అసెంబ్లీలోని సభ్యులను తెలంగాణ సీమాంధ్ర ప్రాంతాల వారీగా రెండు రాష్ట్రాల అసెంబ్లీలకు కేటాయించనున్నారు. ప్రస్తుత అసెంబ్లీలోని 294 స్థానాల్లో 175 సీమాంధ్ర ప్రాంతంలో, 119 తెలంగాణాలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 175 స్థానాల్లో 15 స్థానాలు ఖాళీగా ఉండడంతో 160 మంది సభ్యులతో ఏర్పాటు అవుతుంది. తెలంగాణ ప్రాంతంలో ఖాళీలు లేనందున అసెంబ్లీకి సభ్యుల సంఖ్య యధాతథంగా ఉంటుంది. రెండు రాష్ట్రాల అసెంబ్లీలు ఏర్పాటయ్యాక కాంగ్రెస్ పార్టీకే ఆధిక్యమున్నందున రెండు చోట్లా ఆపార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుంది. తెలంగాణలో 119 స్థానాల్లో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 49. టీఆర్‌ఎస్‌కు 17 మంది ఉన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో టీఆర్‌ఎస్ మద్దతు పూర్తిగా కాంగ్రెస్‌కే ఉంటుంది కనుక ఇక అక్కడ ప్రభుత్వ ఏర్పాటు కాంగ్రెస్‌కు సునాయాసమే అవుతుంది. సీమాంధ్రలో కూడా కాంగ్రెస్‌కే పగ్గాలు దక్కుతాయి. ప్రస్తుతం సీమాంధ్రలోని 160 స్థానాల్లో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య సాంకేతికంగా 97. రాష్ట్ర విభజన పరిణామాల వల్ల ఇందులో కొంతమంది కాంగ్రెస్‌ను వీడి వెళ్లినా అసెంబ్లీలో ఏకైక పెద్దపార్టీగా కాంగ్రెస్సే ఉంది. రెండు చోట్లా ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్లడానికి, వివిధ పథకాలను అమలు, ప్రచారాలు చేయడం ద్వారా ఓట్లు సాధించడానికి వీలుంటుందని భావిస్తున్నారు. వీటన్నిటికన్నా ముందుగా రాష్ట్ర విభజన కారణంగా సీమాంధ్రలో కాంగ్రెస్ నుంచి భారీగా ప్రారంభమైన వలసలను నిరోధించడానికి అవకాశముంటుందని తలపోస్తున్నారు. ప్రభుత్వం ద్వారా ఏదో ఒకటి చేయడానికి వీలుంటుందన్న ఉద్దేశంతో పార్టీనుంచి ఎమ్మెల్యేలు వలసపోకుండా ఉంటారని అంచనా వేస్తున్నారు.
ఎవరికి పగ్గాలు: రెండు ప్రాంతాల్లోనూ కాంగ్రెస్‌పార్టీయే ప్రభుత్వాలు ఏర్పాటుచేసే వీలున్నందున ఇరుప్రాంతాల్లోనూ ఎవరికి ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగిస్తారన్నది ఇపుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. సీఎం పీఠం కోసం ఇరుప్రాంతాల కాంగ్రెస్ నేతల్లో పలువురు ఆశావహులు పెద్ద ఎత్తున లాబీయింగ్ కూడా చేస్తున్నారు. సీమాంధ్రలో కాపు సామాజికవర్గాన్ని దగ్గర చేసుకోవడంలో భాగంగా ఆ సామాజికవర్గ నేతకు పగ్గాలు అప్పగించవచ్చన్న ప్రచారం సాగుతోంది. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డిల పేర్ల ప్రచారంలో ఉన్నా పార్టీ అధిష్టానం కన్నా లక్ష్మీనారాయణవైపు మొగ్గుచూపుతున్నట్లు చెబుతున్నారు. ఇక తెలంగాణాలో కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డికి ప్రభుత్వ పగ్గాలు అప్పగిస్తారని తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు జానారెడ్డి, డి.శ్రీనివాస్, పొన్నాల లక్ష్మయ్య, మర్రిశశిధర్‌రెడ్డిల పేర్లు ఇంతకు ముందు వినిపించాయి.