
ఉదయ్ కిరణ్ అంత్యక్రియలు పూర్తి
అయినవారు, అభిమానుల అశ్రు నయనాల మధ్య సినీనటుడు ఉదయ్ కిరణ్ అంత్యక్రియలు ఎర్రగడ్డ స్మశాన వాటికలో జరిగాయి.
హైదరాబాద్ : అయినవారు, అభిమానుల అశ్రు నయనాల మధ్య సినీనటుడు ఉదయ్ కిరణ్ అంత్యక్రియలు ఎర్రగడ్డ స్మశాన వాటికలో జరిగాయి. ఉదయ్ కిరణ్ తండ్రి మూర్తి చితికి నిప్పు అంటించారు. అంత్యక్రియల కార్యక్రమంలో అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తమ అభిమాన నటుడికి కడసారిగా కన్నీటితో వీడ్కోలు పలికారు.
అంతకు ముందు ఫిల్మ్‌చాంబర్ నుంచి ఉదయ్ కిరణ్ పార్దీవశరీరాన్ని ఓపెన్ టాప్ వాహనంలో ర్యాలీగా స్మశాన వాటికకు తీసుకొచ్చారు. హీరో శ్రీకాంత్ ఆ వ్యాన్‌తో పాటే స్మశాన వాటికకు చేరుకున్నారు. ఉదయ్ కిరణ్ కుటుంబ సభ్యలతో పాటు యువ హీరోలు కొంత మంది దహన సంస్కారాల్లో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో అభిమానులు కూడా తరలిరావడంతో ఎర్రగడ్డ స్మశాన వాటిక కిక్కిరిసిపోయింది.
గత కొంత కాలంగా సినిమా అవకాశాలు లేక సతమతం అవుతున్న ఉదయ్ కిరణ్....ఆదివారం రాత్రి శ్రీనగర్ కాలనీనలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అతను ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులు, తన కెరీర్ ఆశాజనకంగా లేక పోవడమే కారణమని తెలుస్తోంది.