అనంతపురం క్రైం, న్యూస్‌లైన్ : బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న ఉమ్మర్ ట్రావెల్స్‌కు చెందిన మూడు బస్సులపై అందులో ప్రయాణిస్తున్న వారు శుక్రవారం ఉదయం అనంతపురంలో దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. ప్రైవేట్ బస్సులు పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళుతున్నాయనే సమాచారం మేరకు శుక్రవారం ఉదయం 6 గంటలకు అనంతపురంలో రవాణా శాఖ ఉప కమిషనర్ ప్రతాప్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉమ్మర్ ట్రావెల్స్ బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికులు ఉండటంతో ఆర్టీఏ అధికారులు జాతీయ రహదారిపై బస్సులను పక్కన ఆపేశారు. ఒక బస్సు డ్రైవర్‌కు లెసైన్స్ లేకపోవడం, ఓవర్ లోడింగ్ కారణంతో బస్సులను సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మార్గం మధ్యలో దించేయడంతో తమకు వేరే బస్సులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు బస్సు సిబ్బందిని కోరారు.
వోల్వో పేరుతో టికెట్‌కు రూ.2 వేలు వసూలు చేసి సాధారణ బస్సు పంపించడమేకాక మధ్యలో ఇలా వదిలేస్తే ఎలా అని బస్సు సిబ్బందిని నిలదీశారు. బెంగళూరులో గురువారం రాత్రి 11 గంటలకు బయలు దేరిన బస్సులు టోల్‌గేట్లు తప్పించుకునేందుకు అడ్డదారుల్లో తీసుకొచ్చి చాలా ఆలస్యం చేశారని మండిపడ్డారు. సీజ్ చేసిన బస్సులను ఆర్టీఏ అధికారులు ఆర్టీసీ బస్టాండ్‌కు తీసుకొచ్చారు.
తమ టికెట్ డబ్బు వాపసు ఇస్తే ఆర్టీసీ బస్సుల్లో వెళ్లిపోతామని కోరగా.. అప్పటికే యాజమాన్యంతో మాట్లాడిన ప్రైవేట్ బస్సుల సిబ్బంది అందుకు సమ్మతించలేదు. తమ తప్పేం లేదని, బస్సులను వదిలిపెడితే త్వరగా గమ్యస్థానానికి చేరుస్తామని, ఇలాగే ఆలస్యం చేస్తే మహబూబ్‌నగర్ నగర్ తరహాలో వదిలిపెడతామని వారు వ్యాఖ్యానించడంతో ప్రయాణికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో సీజ్ చేసిన బస్సులపై రాళ్లు రువ్వి అద్దాలను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న త్రీటౌన్ సీఐ దేవానంద్, ఎస్‌ఐ జీటీ నాయుడులు అక్కడికి చేరుకుని ప్రయాణికులు శివరాం (నల్గొండ), పురుషోత్తం (హైదరాబాద్), భరత్‌రావు (బెంగళూరు), బెనర్జీ (హైదరాబాద్), శ్రీ నారాయణ (బెంగళూరు), వికాస్ కక్కర్ (పాట్నా)లను అదుపులోకి తీసుకున్నారు. ఆనంతరం వారిని న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా జరిమానా విధించి వదిలిపెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడుపుతున్నందుకు యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.
ఉమ్మర్ బస్సులపై ప్రయాణికుల దాడి
Published Sat, Nov 2 2013 5:45 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement