డయ్యూ, డామన్ మ్యాచ్‌లో బరిలోకి దిగుతున్న అచ్యుతరావు (ఎడమనుంచి రెండు) , బర్ల అచ్యుతరావు
కడియం (రాజమహేంద్రవరం రూరల్): కడియం పరిసర ప్రాంతాల్లోని నర్సరీ రంగం అనేక మంది వలస కూలీలకు ఉపాధి కల్పిస్తోంది. అందుకోసం జిల్లాలు దాటి ఇక్కడికి వేలాది మంది వచ్చి స్థిరపడుతుంటారు. అలా స్థిరపడిన కుటుంబం నుంచి వచ్చిన బర్ల అచ్యుతరావు క్రికెట్‌లో తన నైపుణ్యంతో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్నాడు. అండర్–19 విభాగంలో బంగ్లాదేశ్‌లోని ఢాకాలో ఏప్రిల్ 10వ తేదీ నుంచి 14 వరకు జరిగే మ్యాచ్‌కు 15 మంది ప్రాబబుల్స్‌లో ఎంపికయ్యారు. ఫస్ట్ ఆల్ రౌండర్‌గా ఎంపిక కావడంతో తుది జట్టులో తాను తప్పకుండా ఉంటానని ఆత్మస్థైర్యంతో చెబుతున్నాడీ పిడుగు.
అచ్యుతరావు నేపథ్యమిదీ..
విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన బర్ల సాంబయ్య, పోలమ్మల కుమారుడు అచ్యుతరావు. పార్వతీపురం ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి వరకు ప్రాథమిక విద్యను అభ్యసించాడు. అనంతరం ఉపాధి నిమిత్తం తల్లిదండ్రులు కడియం మండలం బుర్రిలంక చేరుకుని ఇక్కడే నర్సరీల్లో పని చేస్తున్నారు. 6వ తరగతి నుంచి కడియపులంక హైస్కూల్‌లో చదువుకున్నాడు. ప్రస్తుతం రాజీవ్‌గాంధీ కళాశాలలో డిగ్రీ బీఎస్సీ (ఎంపీసీ) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పార్వతీపురంలో రాజశేఖర్ అనే కోచ్ అచ్యుతరావులోని క్రికెట్ ఆసక్తిని గమనించి ప్రోత్సహించగా, కడియపులంకలో పీఈటీ జయకుమార్ స్వయంగా టోర్నమెంట్‌లకు తీసుకువెళ్లి తనలో ఉన్న ప్రతిభను వెలికితీశారని అచ్యుతరావు తెలిపారు. రాజీవ్‌గాంధీ కళాశాలలో మహేంద్ర, రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల కోచ్ ఎం.రాజశేఖర్‌లు తన ఆటకు మరింత మెరుగులు దిద్దారన్నారు.
దాతల సాయం కోసం
అచ్యుతరావుది క్రికెట్‌లో ఆల్ రౌండ్ ప్రతిభ అని, అతడికి మంచి భవిష్యత్తు ఉంటుందని కోచ్‌లు చెబుతున్నారు. గుంటూరులో జరిగిన స్టేట్ లెవెల్ సెలక్షన్స్‌లో ఫస్ట్ ఆల్ రౌండర్‌గానే తుదిజట్టుకు ఎంపిక చేశారు. అనంతరం డయ్యూ, డామన్‌లో నిర్వహించిన నేషనల్స్‌లో అచ్యుతరావు చూపిన ప్రతిభ ఆధారంగా అండర్–19 ప్రాబబుల్స్‌లో నిలిచాడు. బంగ్లాదేశ్ వెళ్లేందుకు సుమారు ఎనభైవేల రూపాయలు అవసరం కానున్న నేపథ్యంలో దాతలు సాయం అందిస్తే మరింత ముందుకు వెళ్లగలనని అచ్యుతరావు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment