జనాగ్రహం
సాక్షి, అనంతపురం : రాష్ట్ర విభజనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై జిల్లాలో జనాగ్రహం పెల్లుబుకుతోంది. యూపీఏ సర్కారు నిరంకుశ వైఖరిపై జిల్లా ప్రజలు ఆగ్రహోదగ్రులవుతున్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణే ధ్యేయంగా వైఎస్సార్‌సీపీ సాగిస్తున్న పోరాటానికి అన్ని వర్గాల ప్రజలు బాసటగా నిలుస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఆ పార్టీ విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో జిల్లాలో ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు.
సోనియా డౌన్‌డౌన్..
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ అనంతపురంలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సోనియా డౌన్ డౌన్ అంటూ విద్యార్థులు నినాదాలు చేస్తూ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన ర్యాలీ టవర్‌క్లాక్ వరకు సాగింది. వీరికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలపడంతో నగరం సమైక్య నినాదాలతో మార్మోగింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కన్వీనర్ శంకర్‌నారాయణ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనతో విద్యార్థుల భవిష్యత్ అంధకారమవుతుందని అన్నారు.
విద్యార్థుల భవిష్యత్ హైదరాబాద్‌పైనే ఆధారపడి ఉందన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు విద్యార్థులు ముందుండి పోరాడాలన్నారు. అనంతరం విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు జాతి కోసం పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగాన్ని సీమాంధ్ర కేంద్ర మంత్రులు, టీడీపీ, బీజేపీ విస్మరించాయన్నారు. తెలుగు ప్రజల మనోభావాలను తెలుసుకోకుండా కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు. కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఓట్లు సీట్ల కోసం ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పొట్టి శ్రీరాములు విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఐద్వా మహిళలు, ఎంఐఎం నాయకులు కూడా నగరంలో ర్యాలీలు నిర్వహించారు.
సమైక్య ద్రోహి... ఎంపీ ‘అనంత’
ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి సమైక్య ద్రోహి అని ఆరోపిస్తూ వైఎస్సార్ సీపీ నాయకులు, ఎస్కేయూ విద్యార్థులు ఆయన ఇంటిని ముట్టడించారు. ఎంపీ డౌన్ డౌన్... సమైక్య ద్రోహి అంటూ నినాదాలు చేశారు. ఈసందర్భంగా వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి, ఎస్కేయూ జేఏసీ నాయకుడు ప్రొఫెసర్ సదాశివరెడ్డి మాట్లాడుతూ.. సమైక్య వాదినని చెప్పుకుంటూ ఎంపీ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. అవిశ్వాసానికి మద్దతుగా నిలబడకపోతే చరిత్ర హీనుడుగా నిలిచిపోతారన్నారు. ఎంపీ ఇంటి ఎదుట బైఠాయించడంతో టూటౌన్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. విభజన బిల్లు రాష్ట్ర ప్రజల పాలిట శాపం అని నినదిస్తూ రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వివిధ కళాశాలల విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. ఉరవకొండ, కదిరి, శెట్టూరు, రొళ్ల, రాప్తాడు, తాడిపత్రిలో ర్యాలీలు చేశారు. కాగా.. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ చేసి, అనంతరం మంత్రి జైరాం రమేష్ దిష్టిబొమ్మను దహనం చేశారు. సమైక్యాంధ్ర కోసం తాడిపత్రి పోలీసుస్టేషన్ సర్కిల్‌లో ఇంజనీరింగ్ విద్యార్థులు చేపట్టిన రిలే దీక్షలు మంగళవారానికి వంద రోజులు పూర్తి చేసుకున్నాయి.