సమైక్య వాదుల సహనం కట్టలు తెంచుకుంది. దాదాపు 60 రోజులకు పైగానే అత్యంత శాంతియుతంగా ఉద్యమం సాగించిన సమైక్య వాదులు.. రాష్ట్ర విభజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేయడం, వెనువెంటనే మంత్రుల కమిటీని ఏర్పాటుచేయడం లాంటి చర్యలతో తీవ్ర ఆగ్రహావేశాలకు గురయ్యారు. ఇన్నాళ్లూ ఒక్క హింసాత్మక సంఘటనకు కూడా పాల్పడకుండా, తమ జీతాలు వదులుకుని, కడుపులు ఎండబెట్టుకుని, పిల్లల చదువులను సైతం త్యాగం చేసిన సమైక్యవాదులు.. క్రమంగా హింసాత్మక సంఘటనలకు పాల్పడుతున్నారు. గుండె లోతుల్లోంచి తన్నుకొచ్చిన ఆవేదన.. ఆగ్రహంగా మారి ఆవేశం రూపంలో బయటకు వచ్చింది.
రాష్ట్ర విభజన జరిగినా పర్వాలేదు, తెలుగు మాట్లాడేవాళ్లకు రెండు రాష్ట్రాలుంటే తప్పేంటంటూ ముందునుంచి వాదించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మీద ముందుగా సమైక్యవాదులు తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. అసలు విభజనకు కారకుడు బొత్సేనంటూ మండిపడ్డారు. విజయనగరం జిల్లాలో మినీ సామ్రాజ్యం ఏర్పాటుచేసుకున్న బొత్సపై విరుచుకుపడ్డారు. ఆయన ఇల్లు, కాలేజి, లాడ్జి, స్టోన్ క్రషర్.. ఇలా ప్రతి ఒక్క ప్రాంతంలోనూ దాడులు చేశారు. భారీ సంఖ్యలో పోలీసులను మోహరించినా, టియర్ గ్యాస్ ప్రయోగించినా, గాల్లోకి కాల్పులు జరిపినా ఏమాత్రం వెనకడుగు వేయలేదు. బొత్స ఇంటిని ముట్టడించేందుకు పదేపదే ప్రయత్నించారు. అడ్డుకున్న పోలీసులను సైతం తోసేసి, వాళ్ల ఇంట్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు.
మరోవైపు విజయనగరం జిల్లాకే చెందిన మరో మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, తూర్పుగోదావరి జిల్లాలో కేంద్ర మంత్రి పళ్లంరాజు, పశ్చిమగోదావరి జిల్లాలో మరో కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు కూడా సమైక్యవాదుల ఆగ్రహావేశాలకు గురయ్యారు. వాళ్లందరి ఇళ్లపైనా సమైక్యవాదులు విరుచుకుపడ్డారు. రాజమండ్రిలో ఎంపీ జీవీ హర్షకుమార్కు చెందిన కళాశాలను ముట్టడించగా, అది ఉద్రిక్తతకు దారితీసింది. హర్షకుమార్ కుమారులు సమైక్యవాదులపై ఎదురుదాడికి దిగడం లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. చివరకు హర్షకుమార్ సమైక్యవాదులకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. విశాఖ జిల్లాలో మంత్రి గంటా శ్రీనివాసరావు కార్యాలయంపై సమైక్యవాదులు దాడిచేసి అక్కడున్న ఫర్నిచర్ ధ్వంసం చేసి ఫ్లెక్సీలు చించేశారు. మరోవైపు తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాయలంలో వాహనాలకు నిప్పుపెట్టారు. దాంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది.
శాంతికాముకులైన కోస్తా ప్రాంత ప్రజలను తీవ్రంగా రెచ్చగొట్టి, విధ్వంసాలకు పాల్పడేలా చేసింది కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ నాయకులేనని సమైక్యవాదులు ఆరోపించారు. రెండు నెలల పాటు ఒక్క హింసాత్మక సంఘటన కూడా లేకుండా తమను తాము శిక్షించుకుంటూ ఆందోళన చేస్తుంటే అదేమీ పట్టకుండా నియంతృత్వ ధోరణితో రాష్ట్రాన్ని విభజించారని మండిపడ్డారు. ఇక ముందు కూడా నాయకులకు ఇలాంటి శాస్తి తప్పదని హెచ్చరించారు.
కట్టలు తెంచుకున్న సమైక్యాగ్రహం
Published Sat, Oct 5 2013 1:55 PM | Last Updated on Fri, Sep 1 2017 11:22 PM
Advertisement
Advertisement