హైదరాబాద్ : తెలంగాణ బిల్లును ప్రాధాన్యతగా తీసుకుని అసెంబ్లీలో చర్చను చేపట్టాలని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, మంత్రి డీకె అరుణ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంత నేతలు గురువారం గండ్ర నివాసంలో భేటీ అయ్యారు. విభజన బిల్లు నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై వారు చర్చ జరిపారు.
భేటీ అనంతరం గండ్ర, డీకె అరుణ మీడియాతో మాట్లాడుతూ 2009 నుంచి తెలంగాణ తీర్మానం కోసం తాము పోరాడుతున్నామని, అయితే ప్రభుత్వం ఒప్పుకోలేదన్నారు. ఇప్పుడు విభజన బిల్లు అసెంబ్లీకి వస్తుండగా సీమాంధ్ర నేతలు సమైక్య తీర్మానం ప్రవేశపెట్టాలనుకోవటం సరికాదన్నారు. అలాంటి తీర్మానానికి ఆస్కారం లేదని వారు స్పష్టం చేశారు.