ఒకే మాట..ఉద్యమ బాట.. | united state movement | Sakshi
Sakshi News home page

ఒకే మాట..ఉద్యమ బాట..

Published Wed, Aug 7 2013 2:44 AM | Last Updated on Fri, Sep 1 2017 9:41 PM

united state movement

 సమైక్యాంధ్ర ఉద్యమ ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. ఉద్యోగులు, విద్యార్థులు, వర్తకులు, కార్మికులు, శ్రామికులు ఉద్వేగంతో ఉద్యమబాట పడుతున్నారు. ఆయా వర్గాలు, సంఘాలు తమ సృజనతో వినూత్న నిరసన రూపాలు రూపొందిస్తూ ఉద్యమానికి ఊపు తెస్తున్నాయి. ఏడో రోజూ జిల్లాలో బంద్ సంపూర్ణంగా జరిగింది.
 సాక్షి, రాజమండ్రి : కేసీఆర్ నాశయ..నాశయ, సోనియా నాశయ.. నాశయ..సమైక్యాంధ్ర వర్థయ.. వర్థయ. అంటూ వేదపండితులు శాపనార్ధాలు పెట్టారు. ‘కేసీఆర్‌కు ఉరి.. సమైక్యాంధ్రకు దారి’ అంటూ కార్మిక, శ్రామిక, పేదవర్గాలవారు మిన్నంటేలా నినాదాలు చేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జిల్లాలో కొనసాగుతున్న ఉద్యమం మంగళవారం ఏడోరోజుకు చేరింది. ఉద్యమం కారణంగా జిల్లాలో వాణిజ్యం స్తంభించింది. ఒకటో తేదీ నుంచి బ్యాంకులు, ఏటీఎంలు పనిచేయకపోవడంతో ఉద్యోగులకు జీతాలు కరువయ్యాయి. అయినా లెక్కచేయని ఉద్యోగులు సమైక్యాంధ్ర కోసం ప్రాణాలైనా త్యాగం చేస్తామంటూ ఉద్యమించారు. పస్తులున్నా ఫరవాలేదు. తెలుగుజాతి ఒక్కటిగా ఉంటే చాలంటూ కార్మిక, శ్రామిక సంఘాల వారు సమైక్య ఉద్యమంలో భాగస్వాములు అవుతున్నారు.
 
 రాజమండ్రి, కాకినాడల్లో సుమారు 200 ఏటీఎంలు వారం రోజులుగా మూతపడ్డాయి.sem వర్తకం, వాణిజ్యం జిల్లాలో 80 శాతం మూతపడింది. బ్యాంకుల్లో రోజుకు రూ. 40 నుంచి రూ. 50 కోట్ల చొప్పున లావాదేవీలు నిలిచిపోయాయి. రోజుకు రూ. నాలుగు కోట్ల మేర బంగారం అమ్మకాలు, రూ. పది కోట్ల మేర కిరాణా, రూ. 50 నుంచి 75 లక్షల మేర వస్త్ర వ్యాపారం నిలిచిపోయినట్టు అంచనా. ఏ వర్గం బంద్ పిలుపు ఇవ్వకుండానే వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేస్తున్నారు. బంగారం, వస్త్ర దుకాణాలు కూడా నిరవధికంగా బంద్ పాటిస్తుండడంతో ఈ ప్రభావం బుధవారం నుంచి ప్రవేశిస్తున్న శ్రావణమాసం పెళ్లిళ్ల సీజన్‌పై పడనుంది.
 
 శాంతి, గణపతి హోమాలు
 రాజమండ్రిలో పురోహితులు, బ్రాహ్మణ సమాఖ్యల ఆధ్వర్యంలో పుష్కరాలరేవు వద్ద శాంతి హోమం, గణపతి హోమం నిర్వహించారు. అనంతరం యువకులు ర్యాలీ చేశారు. మహిళా శక్తి సంఘాల సభ్యులు, నాయకులు సుమారు 300 మంది మహిళలు ర్యాలీ నిర్వహించారు. కోటిపల్లి బస్టాండ్ వద్ద మానవహారంగా ఏర్పడి కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీవిత బీమా సంస్థ ఏజెంట్లు తాడితోట, పుష్కరాలరేవు సెంటర్‌లో రాస్తారోకో చేసి మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సప్లయ్ కంపెనీలు, మైక్, సౌండ్ సిస్టం సంఘాలు సంయుక్తంగా మెయిన్‌రోడ్డుపై భారీగా ర్యాలీ నిర్వహించాయి. వాయిద్య కళాకారుల సంఘం ర్యాలీ నిర్వహించింది. ఆనాల వెంకటప్పారావు రోడ్‌లో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, మంగళవారపు పేటలోని స్థానికులు,  మున్సిపల్ ఉద్యోగులు నగరపాలకసంస్థ ఎదురుగా, ఆర్టీసీ ఉద్యోగుల సంఘాలు ఆర్టీసీ బస్టాండు ఎదుట, న్యాయవాదులు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఎదుట వంటా వార్పూ నిర్వహించారు. లాయర్లు నిర్వహిస్తున్న రిలే దీక్షలు ఏడోరోజుకు చేరాయి. ఏపీఎన్‌జీవోలు పుష్కరఘాట్‌లో, ఇసుక ర్యాంపు రవాణా, బోట్ వర్కర్ల సంఘాలు లారీలతో భారీగా ర్యాలీ నిర్వహించాయి. స్టెయిన్‌లెస్ స్టీల్ అండ్ మెటల్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను ఊరేగించి దగ్ధం చేశారు. సెంట్రల్ వెజిటబుల్ మార్కెట్ వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం సభ్యులు సమైక్య ఉద్యమంలో పాల్గొన్నారు. కోటిపల్లి బస్టాండ్‌లో వివిధ పాఠశాలలకు చెందిన చిన్నారులు కేసీఆర్ శవయాత్ర చేశారు. ర్యాలీ చేసి కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
 
 కోనసీమలో మరింత ఉద్ధృతం
 అమలాపురంలో మంత్రి విశ్వరూప్‌తో పాటు ఎమ్మెల్సీ రవికిరణ్ వర్మ, మాజీ మంత్రుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రోడ్లపై వంటావార్పూ చేపట్టారు. ముమ్మిడివరం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో వ్యాపారులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. కొత్తపేటలో వికలాంగులు ధర్నా, రాస్తారోకో చేశారు. న్యాయవాదులు విధులు బహిష్కరించి మోటారుసైకిల్ ర్యాలీ చేశారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ప్రైవే ట్ కళాశాలకు చెందిన డిగ్రీ, జూనియన్ విద్యార్థులు టీడీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. రావులపాలెంలో మోటారు వర్కర్స్ యూనియన్ సభ్యులు ఆటోలతో మానవహారం నిర్వహించారు. మల్కిపురంలో ఉపాధ్యాయ సంఘాలు విధులు బహిష్కరించాయి. పిఠాపురం కోటగుమ్మం సెంటర్‌లో బంగారు ఆభరణాల దుకాణదారులు వంటా వార్పు నిర్వహించారు. వైద్య ఉద్యోగులు ఉద్యమించారు.
 
 జర్నలిస్టుల ఆందోళన
 రాజమండ్రి జర్నలిస్టు అసోసియేషన్ సభ్యులు సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. నగరంలోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద సమావేశమై నిరసన వ్యక్తం చేశారు. కాకినాడ రూరల్ మండల కేంద్రం సర్పవరం జంక్షన్ వద్ద జర్నలిస్టులు మానవహారంగా ఏర్పడి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. కోరుకొండ, సీతానగరం, గోకవరం మండలాల విలేకరులు ర్యాలీలు నిర్వహించారు.
 
 జేఏసీ కార్యాచరణ
 సమైక్య ఉద్యమం సమష్టిగా నిర్వహించేందుకు అన్ని వర్గాలను ఒకే తాటిపైకి తెచ్చేందుకు ఉద్యోగ సంఘాల జేఏసీ కాకినాడ ఎన్‌జీఓ హోంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించింది. భవిష్యత్ కార్యాచరణపై  నేతలు చర్చించారు. జగ్గంపేటలో సమైక్యాంధ్ర కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. జాతీయ రహదారిపై మూడు గంటలపాటు రాకపోకలు స్తంభింపచేసి వంటా వార్పూ చేపట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యులు జ్యోతుల నెహ్రూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 16వ నెంబరు జాతీయ రహదారిపై రాజానగరం, దివాన్‌చెరువు, లాలాచెరువు వద్ద రాస్తారోకో చేసి దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. రాజమండ్రి రూరల్, అనపర్తి, మండపేట, రామచంద్రపురం, రంపచోడవరం తదితర నియోజకవర్గాల్లో సమైక్యాంధ్ర ఉద్యమాలు అదే జోరు.. అదే హోరుతో కొనసాగాయి.
 
 పాల్గొన్న నేతలు
 రాష్ట్ర విభజనకు ములకారకుడు చంద్రబాబునాయుడేనని ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు అన్నారు. సామర్లకోట రైల్వేస్టేషన్ సెంటర్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ చేపట్టిన వంటా వార్పు కార్యక్రమంలో నియోజకవర్గ కో-ఆర్డినేటర్ తోట సుబ్బారావునాయుడుతో కలిసి ఎమ్మెల్సీ పాల్గొన్నారు. రాష్ట్రం ముక్కలు చేయడాన్ని సహించేది లేదని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు స్పష్టం చేశారు. రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ సెంటర్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. సమైక్యవాది కావడం వల్లనే ఎన్టీఆర్‌ను గౌరవిస్తున్నామన్నారు. సమైక్యాంధ్ర కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్ పిలుపునిచ్చారు. తాజీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి రాయవరం మండలం మాచవరం ఉపసర్పంచ్ ఎన్నికల్లో పాల్గొన్న సందర్భంగా బోసు ఈ పిలుపు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ది కోసమే రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు ముందుకు వచ్చిందని మరో సీజీసీ సభ్యులు జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేటలో 16వ నెంబరు జాతీయ రహదారిపై జేఏసీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆత్రేయపురంలో జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ చేసి, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్‌రావు సమైక్యవాదని వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు జక్కంపూడి రాజా అన్నారు. మంగళవారం తన నివాసంలో గువ్వల కెనెడీ సమైక్యాంధ్ర కోసం వేసిన చిత్రాలను ఆవిష్కరించారు. అనంతరం రాజమండ్రి కంబాలచెరువు సెంటర్‌లో జక్కంపూడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వైఎస్సార్ సీపీ సిటీ కో ఆర్డినేటర్ బొమ్మన రాజ్‌కుమార్, రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement