యూనివర్సిటీ: కరువు జిల్లాలోని రెండు విశ్వవిద్యాలయాలను రాష్ట్ర ప్రభుత్వం కనికరించలేదు. సాంకేతిక విద్యలో రాయలసీమలోనే తలమానికంగా ఉన్న జేఎన్‌టీయూ ప్రగతికి గండిపడింది. పంపిన ప్రతిపాదనలకు, కేటాయించిన బడ్జెట్‌కు భారీ వ్యత్యాసం ఉండడమే ఇందుకు తార్కాణం. జేఎన్‌టీయూ పరిధిలోని కలికిరి ఇంజనీరింగ్ కళాశాల ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారు. ఇప్పటికే నిర్మాణాలలో ఉన్న కలికిరి ఇంజనీరింగ్ కళాశాలకు రూ.200 కోట్లు అవసరం కాగా, ఒక్క నయాపైసా కూడా కేటాయింలేదు.
మరో వైపు పులివెందుల ఇంజనీరింగ్ కళాశాల, జేఎన్‌టీయూ అనంతపురం కళాశాలలో నిర్మాణాలు, మౌళిక సదుపాయాల కల్పనపై నీలినీడలు కమ్ముకున్నాయి. మెత్తంగా జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయానికి కేవలం రూ 51.32 కోట్లు కేటాయించారు. అటు ఎస్కేయూలో గత ఏడాది రూ.66 కోట్లు కేటాయించగా తాజా బడ్జెట్‌లో రూ.52.90 కోట్లు కేటాయించి సరిపెట్టారు. ఇందులో రూ.40 కోట్లు భోదన, భోదనేతర సిబ్బంది జీతాలకు సరిపోతుంది.
ఉద్యోగాల భర్తీ సాధ్యమేనా:
ఎస్కేయూలో 160, జేఎన్‌టీయూలో 180 భోదన పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని యిచ్చింది. కానీ వీటికి తాజా బడ్జెట్‌లో ఆర్థిక పరమైన అనుమతులు ఇవ్వలేదు. ఈ నేపధ్యంలో ఉద్యోగాల భర్తీకి ఆటంకాలు ఏర్పడ్డాయి. వర్సిటీ అంతర్గత వనరుల నుంచి మాత్రమే ఉద్యోగాల భర్తీకి అయ్యే మెత్తాలను భరించాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. జేఎన్‌టీయూలో గత రిజిస్ట్రార్, వీసీ చొరవతో 2014-15 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.100 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో నుంచే భవన నిర్మాణాలను చేపడుతున్నారు. జేఎన్‌టీయూ పరిధిలో ఖాళీగా ఉన్న భోదన పోస్టుల భర్తీకి సన్నాహాలు చేస్తున్నట్లు రిజిస్ట్రార్ ఎస్.కృష్ణయ్య నూతన వర్సిటీ డైరీ ఆవిష్కరణ సందర్భంగా వెల్లడించారు.
అయితే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపు అంశాలలో మొండిచేయి చూపడంతో ఉద్యోగాల భర్తీ కష్టసాధ్యమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరో వైపు ఎస్కేయూలో ప్రధాన అంతర్గత వనరు దూరవిద్య విభాగం. ప్రతి ఏటా రూ.25 కోట్ల ఆదాయం వచ్చేది. అయితే తాజాగా మారిన పరిస్థితులను బట్టి దూరవిద్య ఆదాయం గణనీయంగా పడిపోయింది. దీంతో రాష్ట్రప్రభుత్వం బ్లాక్‌గ్రాంట్స్ మంజూరు చేసే దయాదాక్షిణ్యాలపై భోదన పోస్టుల భర్తీ ఆదారపడి ఉంది.
విశ్వవిద్యాలయాలకు ‘చంద్ర’ గ్రహణం
Published Fri, Mar 13 2015 2:56 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement