ప్రభుత్వ శాఖలు వర్సిటీకి..
కొత్త కాపురానికి ఇల్లు వెతుక్కున్నట్టు, నవ్యాంధ్ర ప్రభుత్వ పాలనా కార్యాలయాలను హైదరాబాద్ నుంచి తరలించేందుకు ఉన్నతాధికారులు భవన వసతి కోసం జిల్లాకు విచ్చేశారు. దీనిలో భాగంగానేమూడు ప్రధానశాఖల ప్రిన్సిపల్ కార్యదర్శులు శనివారం మంగళ గిరి సమీపంలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాన్ని పరిశీలించారు. ప్రాథమిక సమాచారం మేరకు విద్య, సాంఘిక సంక్షేమ శాఖలకు చెందిన అన్ని కార్యాలయాలను వర్సిటీకి తరలించనున్నట్టు తెలుస్తోంది.
ఏఎన్‌యూ
రాష్ట్ర ప్రభుత్వ పాలనా కార్యాలయాలను హైదరాబాద్ నుంచి జిల్లాకు తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రిన్సిపల్ కార్యదర్శులు అజయ్ కల్లం, డి. సాంబశివరావు, శ్యాంబాబులు శనివారం ఉదయం ఆచార్య నాగార్జున యూనివర్సిటీని పరిశీలించారు.
తొలుత పరిపాలనా భవన్‌లోని కమిటీ హాలులో వర్సిటీ అధికారులతో సమావేశమయ్యారు.
ఏఎన్‌యూ మొత్తం విస్తీర్ణం, భవనాల నిర్మాణాలు, రోడ్లకు కేటాయించిన స్థలం ఇలా అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య పి. రాజశేఖర్, ఇంజనీర్ కుమార్ రాజాలు అన్ని వివరాలు అందించారు.
అనంతరం ఏఎన్‌యూ దూరవిద్యా కేంద్రం భవనాన్ని పరిశీలించారు. అక్కడి వివరాలను కేంద్రం డెరైక్టర్ ఆచార్య ఎంవీ రాంకుమార్త్న్రం తెలియజేశారు.
ఇంజనీరింగ్ కళాశాలలో నిర్మాణంలో ఉన్న ఈసీ, ట్రిపుల్ ఈ భవనాన్ని పరిశీలించారు. ఆ వివరాలను ఇంజనీర్ కుమార్ రాజా వివరించారు.
ఏఎన్‌యూలో వసతుల కల్పనకు చేపట్టాల్సిన చర్యలపై ఏఎన్‌యూ అధికారులకు రాష్ట్ర శాఖల అధికారులు పలు సూచనలు చేశారు. ఇకపై నూతనంగా నిర్మించే భవనాల్లో అటాచ్డ్ బాత్‌రూంలు ఉండే విధంగా ప్లాన్ చేయాలని సూచించారు.
భవనాల పరిశీలన లాంఛనమే..
ఏ భవనాలను ఏ అవసరాలకు వాడుకోవాలనే దానిపై ఇప్పటికే రాష్ట్ర స్థాయి అధికారులు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దానిలో భాగంగానే ఇక్కడకు వచ్చిన ఉన్నతాధికారులు తమవెంట ఏఎన్‌యూ మ్యాప్‌లు, భవనాల విస్తీర్ణం, తదితర పూర్తి వివరాలను తమ వెంట తెచ్చుకున్నారు.
ప్రభుత్వ అవసరాలకు భవనాలు తీసుకుంటున్నాం:
ప్రభుత్వ కార్యాలయాల కోసం ఏఎన్‌యూలోభవనాలు తీసుకుంటున్నట్టు ప్రిన్సిపల్ కార్యదర్శులు తెలిపారు. వర్సిటీని పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.
విద్య, సాంఘిక సంక్షేమ శాఖల అవసరాలకు కావాల్సిన భవనాలను ఇవ్వాలని ఏఎన్‌యూ ఉన్నతాధికారులను కోరినట్టు చెప్పారు. దీనిపై ఏ విషయాన్ని వర్సిటీ అధికారులు తమకు సమాచారం ఇవాల్సివుందన్నారు.
ఈ భవనాల్లో...
రాష్ట్ర ప్రభుత్వ అవసరాల్లో భా గంగా ఏఎన్‌యూలోని దూరవిద్యాకేంద్రం భవనం, పరిపాలనా భవ నం, ఇంజనీరింగ్ కళాశాలలో నూతనంగా నిర్మిస్తున్న భవనం, స్పోర్ట్స్ హాస్టల్‌తో పాటు, రూ.20 కోట్లతో నిర్మించనున్న ఇంటర్నేషనల్ స్టూ డెంట్స్ హాస్టల్ భవనాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంది.
ఉన్నతాధికారుల వెంట జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఆర్డీఓ భాస్క ర నాయుడు, ఆర్‌అండ్ బీ ఈఈ రాఘవేంద్రరావు, డీఎస్‌ఓ రవితేజ నాయక్, అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఎస్‌ఓ సుధాకర్, మంగళగిరి తహశీల్దార్ కృష్ణమూర్తి, పెదకాకాని ఇన్‌చార్జి తహశీల్దార్ డి.సుబ్బారావు తదితరులు ఉన్నారు.