అమ్మాయిల హాస్టల్లో ఆగంతకుడు!
అమ్మాయిల హాస్టల్లో అర్ధరాత్రి ప్రవేశించిన ఆగంతకుడి వ్యవహారం విజయనగరం జిల్లాలో కలకలం సృష్టించింది. మండలకేంద్రమైన నెల్లిమర్ల లోని వేణుగోపాలపురం కాలనీలో సాంఘిక సంక్షేమ జూనియర్ కాలేజి, హైస్కూలు, హాస్టల్ ఒకే ప్రాంగణంలో ఉంటాయి. అక్కడ కొత్తగా డార్మిటరీ కడుతూ.. కొంతమేరకు మరమ్మతులు కూడా చేస్తున్నారు. దాంతో కొన్ని కిటికీలు తొలగించి ఉన్నాయి.
నాలుగోతేదీ అర్ధరాత్రి 12 గంటలకు తొలగించిన కిటికీలోంచి ఓ ఆగంతకుడు లోపలకు ప్రవేశించాడు. తాను పూర్తి నగ్నంగా ఉండటమే కాక.. పక్కన పడుకుని ఉన్న అమ్మాయిల దుస్తులను కూడా బ్లేడుతో తొలగించాడని ఆరోపిస్తున్నారు. పిల్లలంతా తర్వాతిరోజు టీచర్స్ డే ఉండటంతో దాని కోసం ప్రాక్టీసు చేసి బాగా అలసిపోయి ఉన్నారు. దాంతో గాఢనిద్రలో ఉన్నారు. కొంతమందికి మెలకువ రావడంతో వాళ్లు ఆగంతకుడిని, అతడి చేష్టలను గమనించి కేకలు వేశారు. అయితే.. పిల్లలు కేకలు వేసి అరగంట గడిచినా వార్డెన్ గానీ, ప్రిన్సిపల్ గానీ ఎవరూ రాలేదు. ఈలోపు అతడు దుప్పటి కప్పుకొని పారిపోయాడు. ఏడో తేదీన కొంతమంది తల్లిదండ్రులు రావడంతో వాళ్లకు పిల్లలు ఫిర్యాదు చేశారు. ఆగంతకుడు కొంతమంది పిల్లలపై అత్యాచారయత్నం కూడా చేశాడని ఆరోపణలు వచ్చాయి.
జడ్పీ ఛైర్పర్సన్ శోభా స్వాతిరాణి, సోషల్ వెల్ఫేర్ జోనల్ ఆఫీసర్ శేషుకుమారి వచ్చి అక్కడ విచారించారు. అయితే.. వచ్చింది తన భర్తేనేని, ఏం చేసుకుంటారో చేసుకోండంటూ ప్రిన్సిపల్ వారి పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు చెబుతున్నారు. ఐద్వా, ఏఐఎస్ఎఫ్, ఏబీవీపీ లాంటి సంఘాల నాయకులు కూడా అర్ధరాత్రి హాస్టల్లో ప్రవేశించినది ప్రిన్సిపల్ భర్తేనని ఆరోపిస్తున్నారు. విషయం బాగా వివాదాస్పదంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి, అక్కడ పనిలో ఉన్న కూలీలను విచారిస్తున్నారు. నిందితుడు ఎవరన్నది ఇంకా తేలలేదు.