ప్రభుత్వ గుర్తింపు లేకుండా కొనసాగుతున్న పాఠశాలలను మూసివేయిస్తామని పాఠశాల విద్య రీజనల్ జాయింట్ డెరైక్టర్ పయ్యావుల పార్వతి స్పష్టం చేశారు.
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ గుర్తింపు లేకుండా కొనసాగుతున్న పాఠశాలలను మూసివేయిస్తామని పాఠశాల విద్య రీజనల్ జాయింట్ డెరైక్టర్ పయ్యావుల పార్వతి స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా అన్ని సదుపాయాలు కల్పించిన పాఠశాలలకే గుర్తింపు మంజూరు చేస్తామని చెప్పారు. ఆమె మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు లేకుండా 300 పాఠశాలలు కొనసాగుతున్నట్టు గుర్తించామని, ఆయా పాఠశాలలకు ఇప్పటికే పలు దఫాలుగా నోటీసులు జారీ చేశామని వివరించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో -1 ప్రకారం ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వం నుంచి విధిగా గుర్తింపు పొంది, తరగతులు నిర్వహించుకోవాలని, లేని పక్షంలో అటువంటి పాఠశాలలను ఏ సమయంలోనైనా మూసివేసేందుకు విద్యాశాఖకు అధికారం ఉందని స్పష్టం చేశారు. జీవోలో నిర్దేశించిన విధంగా తరగతి గదులు, టాయిలెట్లు, ఆట స్థలం, ప్రయోగశాలలు, గ్రంథాలయం, అగ్నిమాపక పరికరాలు, అర్హత కలిగిన ఉపాధ్యాయ బృందం ఉండాలని వివరించారు.
గుర్తింపు లేని స్కూళ్లు జారీ చేసే
టీసీలకు విలువ ఉండదు
విద్యాహక్కు చట్టం ప్రకారం గుర్తింపు లేని పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఆయా పాఠశాలలు జారీ చేసే టీసీలు, సర్టిఫికెట్లకు ప్రభుత్వపరంగా ఎటువంటి గుర్తింపు ఉండదని స్పష్టం చేశారు. గుర్తింపు లేని పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ఎంసెట్, ఐఐటీ, ఫార్మసీ తదితర కోర్సుల కౌన్సెలింగ్‌లలో సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో అనర్హులుగా పరిగణించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఏడో తరగతి వరకూ నిర్వహణకు గుర్తింపు పొందిన పలు పాఠశాలల యాజమాన్యాలు పదో తరగతి వరకూ అనధికారికంగా అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్టు గుర్తించామని, ఈ విధంగా చదివిన విద్యార్థులు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు ప్రైవేటు క్యాండెట్లుగా హాజరుకావాల్సి ఉంటుందన్నారు. గుర్తింపు లేని స్కూళ్లలో చదువుతూ, 10వ తరగతి పరీక్షలకు హాజరైన పక్షంలో వారికి జారీ చేసే సర్టిఫికెట్లపై సైతం ప్రైవేటు క్యాండెట్ అని స్పష్టంగా పేర్కొంటామని స్పష్టం చేశారు.
ఎంఈవో కార్యాలయాల్లో స్కూళ్ల జాబితా
గుర్తింపు లేని పాఠశాలల వివరాలను మండలాల వారీగా ఎంఈవో కార్యాలయాల్లో ప్రదర్శనకు ఉంచినట్టు ఆర్జేడీ తెలిపారు. ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహరించాలని, అటువంటి పాఠశాలల్లో పిల్లలను చేర్పించిన పక్షంలో ఎటువంటి పరిణామాలకైనా వారే బాధ్యులు కావాల్సి ఉంటుందని చెప్పారు.
ఈ విషయమై తల్లిదండ్రులను చైతన్యపర్చాల్సిందిగా ఎంఈవోలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. పాఠశాలల మూసివేత అంశాన్ని మండల స్థాయిలో ఎంఈవోలు, డివిజన్ స్థాయిలో డీవైఈవోలు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. గుర్తింపు లేని పాఠశాలలకు నోటీసులు జారీ చేసి, స్పందించని పక్షంలో మూసివేయించాలని జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.