చెట్ల కింద బతుకులు
అడవుల్లో వన్యప్రాణులే కాదు అటవీప్రాంతంలో ప్రాణం ఉన్న మనుషులూ ఉంటున్నారన్న విషయం ఈ పాలకులకు తట్టటం లేదు.. వారి బతుకులూ పట్టటం లేదు. బడుగుల బాగుకు ‘పథకం' పన్నామని చెప్పుకునే ప్రభుత్వాలకు గూడేల్లో ఉండే చెంచుజాతుల గోడు చెవికెక్కడం లేదు. బడి, గుడి కాదు గదా కనీసం కూడు, గూడు కూడా అందని పండ్లుగానే మారి అలమటిస్తున్నారు. మట్టిమానుల్లో దొరికే దుంపలతో కడుపునింపుకుంటున్న బతుకుల అభ్యున్నతికి స్థానిక ప్రజాప్రతినిధులే పూనిక వహించాలి. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు నిధులతోవారి బతుకుల్లో వెలుగులు పూయించాలి.
వెల్దుర్తి
అటవీ ప్రాంతంలో నివసించే చెంచుల బతుకుల్లో మార్పు రావటం లేదు. చెంచుల అభివృద్ధికి ఐటీడీఏ పరిధిలో ఏర్పాటు చేశామని ప్రభుత్వాలు చెబుతున్న అనేక సంక్షేమ పథకాలు వారి దరి చేరడం లేదు. మండల కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో 14 చెంచు గూడేలు ఉన్నాయి. శిలువకొండతండా, దావుపల్లి, బొటుకులపాయతండా, సేవానాయక్‌తండా, పిచ్చయ్యబావితండా, లోయపల్లి , జెండాపెంట, రామచంద్రాపురం, హనుమాపురంతండా, గుడిపాడుచెరువుగూడెం ఉన్నాయి.
వీటిల్లో దాదాపు 400 చెంచు కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. అనేక ఏళ్ల నుంచి అటవీ ప్రాంతంలో ఉన్నాఇప్పటికీ పూరిళ్లల్లోనే ఉంటున్నారు.
విద్య, ఆరోగ్యం వీరికి అందని ద్రాక్షగా మారాయి. అటవీ ప్రాంతంలో లభించే పండ్లు, కట్టెలు విక్రయిస్తూ బతుకుతున్నారు.
కుంకుడుచెట్టుతండాకు 40 ఏళ్ల కిందట అప్పటి ప్రభుత్వం పక్కా గృహాలను నిర్మించి ఇచ్చింది. ప్రస్తుతం అవి శిధిలావస్థకు చేరుకున్నాయి.
ఆ తరువాత ఇందిరమ్మ గృహాలు మంజూరయ్యాయి. ఇళ్లు నిర్మించుకునేందుకు అవసరమైన అనుభవదారి ధ్రువీకరణ పత్రాల కోసం 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న తహశీల్దార్ కార్యాలయానికి నడిచి వచ్చి దరఖాస్తులు అందించారు.
గూడేలు అటవీ ప్రాంతంలో ఉన్నందు వల్ల అనుభవదారి సర్టిఫికెట్లు మంజూరు చేయడం కుదరదని రెవెన్యూ అధికారులు తేల్చి చెప్పారు. దాంతో వారంతా జిల్లా కేంద్రం గుంటూరు చేరుకుని కలెక్టర్‌కు దరఖాస్తులు అందజేసినా ఫలితం లేకుండాపోయింది.
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద గుడిపాడుచెరువు గ్రామాన్ని మోడల్ గ్రామంగా ఎంపిక చేసి రూ. 40 లక్షలతో రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసిన దాఖలాలు లేవు.
జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పనులు చేసుకొని అరకొర రాబడితో బతుకు లాగిస్తున్న చెంచుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేయాల్సి వుంది.