వైద్య సేవకు ‘కమీషన్‌’ | Urban Health Centers Are Under Apollo Hospitals In Nellore | Sakshi
Sakshi News home page

వైద్య సేవకు ‘కమీషన్‌’

Published Thu, Jul 25 2019 12:33 PM | Last Updated on Thu, Jul 25 2019 12:33 PM

Urban Health Centers Are Under Apollo Hospitals In Nellore - Sakshi

వెంగళరావు నగర్‌లో ఖాళీగా ఉన్న పట్టణ ఆరోగ్యకేంద్రం

పల్లెల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అందించినట్టే పట్టణాల్లో సైతం సాధారణ జబ్బులకు వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో అర్బన్‌ హెల్త్‌ సెంటర్స్‌ (యూహెచ్‌సీలు) వైద్యం మాట ఎలా ఉన్నా నిర్వహణ పేరుతో గత ప్రభుత్వ పాలకులు ప్రైవేట్‌ అపోలో సంస్థకు దోచి పెట్టేలా అగ్రిమెంట్‌ చేసుకున్నారు. ఈ రూపంలో అప్పటి టీడీపీ పెద్దలు భారీగా కమీషన్లు దోచుకున్నారు. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న సిబ్బందితో పాటు, వైద్య శాఖాధికారులు వ్యతిరేకించినా కమీషన్లకు కక్కుర్తి పడి నాటి టీడీపీ ప్రభుత్వం బలవంతంగా వీటిని కార్పొరేట్‌ సంస్థ అయిన అపోలోకి అప్పగించింది. నాటి నుంచి దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. తాజాగా కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో ఈ దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపడుతోంది.

సాక్షి, నెల్లూరు:  పట్టణ ఆరోగ్య కేంద్రాలను 2000 సంవత్సరంలో ప్రారంభించారు. జిల్లా కేంద్రమైన నెల్లూరులో 8, కావలిలో 3 గూడూరులో 1 వంతున ఆస్పత్రులను ఏర్పాటు చేశారు. ఇటీవల వెంకటగిరిలో మరో పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో మొత్తం జిల్లాలో 13 కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిని మొదట్లో ఏజెన్సీలు నిర్వహించేవి. సిబ్బంది వెంగళరావు నగర్‌లో ఖాళీగా ఉన్న పట్టణ ఆరోగ్యకేంద్రం మొత్తం వైద్య, ఆరోగ్యశాఖ అధీనంలో ఉండేవారు.

2016లో అపోలో యాజమాన్యం కిందకు.. 
నాటి టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల్లో ఉన్న పట్టణ కేంద్రాలను అపోలో కార్పొరేట్‌ వైద్యశాలకు, ధనుష్‌ సంస్థకు అప్పగించింది. అందులో నెల్లూరు జిల్లాలో ఉన్న 13 ఆరోగ్య కేంద్రాలు అపోలో యాజమాన్యం కిందకు వచ్చాయి. ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న సిబ్బంది వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రభుత్వం లెక్క చేయకుండా అపోలోకి అప్పగించింది.

దోపిడీకి స్కెచ్‌
అపోలో సంస్థకు అప్పగిస్తే నాణ్యమైన వైద్య సేవలందుతాయని టీడీపీ ప్రభుత్వం నమ్మబలికింది. కొన్ని రకాల రక్త పరీక్షలు చేస్తారని, సూపర్‌ స్పెషాలిటీ డాక్టర్‌ టెలీ మెడిసిన్‌ పద్ధతిలో పర్యవేక్షిస్తారని చెప్పింది. నాణ్యమైన వైద్య సేవల పేరుతో దోపిడీకి స్కెచ్‌ వేసింది. అంతకు ముందు ఆస్పత్రి నిర్వహణకు నెలకు కేవలం రూ.70 వేలు మాత్రమే ఇచ్చేవారు. అదే అపోలోకి అప్పగించగానే నెలకు రూ.4.30 లక్షలకు పెంచేశారు. ఈ డబ్బంతా అపోలో ఆస్పత్రి యాజమాన్యానికి చెందుతోంది. ఇందులో ఒక్కో ఆస్పత్రి నుంచి నెలకు రూ.ఒక్క లక్ష చొప్పున నాటి టీడీపీ పాలకులకు కమీషన్ల రూపంలో దండుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. అంటే నెలకు ఒక్క నెల్లూరు జిల్లా నుంచి రూ.13 లక్షలు సంవత్సరానికి రూ.1.56 కోట్లు కమీషన్లు టీడీపీ నేత విమర్శలు వచ్చాయి. ఒక్క జిల్లాలోనే ఈ పరిస్థితి ఉంటే ఇక 110 మున్సిపాలిటీల్లో ఎలా ఎంత దండుకున్నారో అర్థమవుతోంది.

జీతం బెత్తెడు.. చాకిరీ బారెడు 
అపోలో యాజమాన్యం కిందకు ఆరోగ్య కేంద్రాలు రాగానే వాచ్‌మెన్‌ సూపర్‌వైజర్‌ను తొలగించారు. ఒక్క ల్యాబ్‌ టెక్నీషియన్‌ను నియమించారు. ఒక్క ఆస్పత్రిలో ఇద్దరు ఏఎన్‌ఎంలు, సీఓ, డాక్టర్, ల్యాబ్‌ టెక్నీషియన్, స్వీపర్‌ మాత్రమే ఉండేటట్లు చేశారు. సిబ్బందికి కనీసం జీతం పెంచలేదు. పలు  రకాల రికార్డులు రాయిస్తూ గొడ్డు చాకిరి చేయిస్తున్నారు. గతంలో మధ్యాహ్నం 2 గంటల వరకే ఓపీ కొనసాగేది. ప్రస్తుతం రెండు పూటలా ఓపీ నిర్వహిస్తున్నామని చెబుతూ రాత్రి 8 గంటల వరకు పని చేయించుకుంటున్నారు.

నిమిషం ఆలస్యమైనా జీతం కట్‌
నర్సులు, సిబ్బంది ఆస్పత్రికి 8.10 గంటలకు రావాలి. కేవలం ఒకే ఒక్క నిమిషం ఆలస్యమైనా ఆ రోజు జీతం కట్‌. జీతాలు పెంచమని అడిగితే ఇంటికి వెళ్లి పొమ్మని అపోలో యాజమాన్యం బెదిరిస్తోంది. ఇటీవల గుంటూరులో ఒక నర్సును అపోలోకి చెందిన సూపర్‌ వైజర్‌లు జీతాలు పెంచమన్నందుకు దారుణంగా బెదిరించారు. ఈ వ్యవహారం వాట్సప్‌లో హల్‌చల్‌ చేసింది.

రెంటికి చెడ్డ రేవడిలా.. 
మొదట్లో పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో కాంట్రాక్ట్‌ పద్ధతిలో చేరిన నర్సులను కాలక్రమంలో ప్రభుత్వం రెగ్యులర్‌ చేస్తామని ప్రకటించింది. ఎప్పటికైనా రెగ్యులర్‌ అవుతామనే ఆశతోనే నర్సులు పని చేస్తున్నారు. అపోలో సంస్థకు అప్పగించడంతో నర్సులు వైద్యశాఖ నుంచి వేరైపోయారు. ఈ లోపు అనేక మందికి వయో పరిమితి కూడా దాటిపోయింది. ఇప్పుడు నర్సుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. ఇదంతా టీడీపీ చేసిన పాపమని ఇప్పుడు వారు శాపనార్థాలు పెడుతున్నారు.

వృథా ఖర్చు : నిపుణుల కమిటీ 
నాలుగు రోజుల క్రితం వైద్య ఆరోగ్యశాఖను పరిశీలించడానికి నిపుణుల కమిటీ సభ్యులు జిల్లాలో పర్యటించారు. వారు పెద్దాసుపత్రిలో విలేకరులతో మాట్లాడుతూ పట్టణ ఆరోగ్య కేంద్రాలను అపోలోకి అప్పగించి ప్రజా సొమ్మును వృథా చేశారని వెల్లడించారు. ఇటు రోగులకు ఉపయోగపడక, అటు జీతాలు పెంచక ఆ డబ్బంతా ఏమవుతుందో పరిశీలిస్తున్నామన్నారు. త్వరలోనే ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్టణ ఆరోగ్య కేంద్రాలను అపోలో యాజమాన్యం నుంచి తప్పించి నిర్వహణ ప్రభుత్వమే చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటారని తెలిపారు. వైద్యశాఖాధికారి డాక్టర్‌ రాజ్యలక్ష్మిని ఈ విషయమై వివరణ అడిగితే ప్రభుత్వం నుంచి తమకు ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదని చెబుతున్నారు. ఏది ఏమైనా పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్యం పేరిట అపోలోకి దోచి పెట్టిన విషయం తేటతెల్లమైంది. దీనికి త్వరలోనే పుల్‌స్టాప్‌ పడనుందని, సిబ్బందిని వైద్యశాఖ అధీనంలోనికి తీసుకుని జీతాలు పెంచే అవకాశముందని తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement