వించిపేట మహ్మదాలిపురంలోని తాత్కాలిక ఉర్దూ జూనియర్ కళాశాల భవనం
నిర్మాణ దశలోనే నిలిచిన ఉర్దూ కళాశాల భవనంనవ్యాంధ్ర రాజధాని నగరం విజయవాడలో నిర్మిస్తున్న ఉర్దూ కళాశాల శాశ్వత భవన నిర్మాణానికి నిధుల గ్రహణం పట్టింది. అంచనాలకు మించి వ్యయం కావడంతో పనులు సగంలోనే నిలిచిపోయాయి. సమయానికి నిధులు సమకూర్చడంలో విజయవాడ నగరపాలక సంస్థ పాలకులునిర్లక్ష్య వైఖరి అవలంబించారు. దీంతో కాంట్రాక్టర్ చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి పూర్తి కావాల్సిన భవనం ఇంకా నిర్మాణదశలోనే ఆగిపోయింది.
భవానీపురం(విజయవాడ పశ్చిమ): వించిపేటలోని మహ్మదాలిపురం మున్సిపల్ స్కూల్ భవనంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఉర్దూ జూనియర్ కళాశాలకు శాశ్వత భవనం నిర్మించాలన్న ఆలోచనతో నగరపాలక సంస్థ విద్యాధరపురం కబేళా వద్ద ప్రభుత్వ స్థలంలో ఎకరం భూమిని కేటాయించింది. గత ఏడాది మార్చిలో శంకుస్థాపన చేసింది. టెండర్లు పిలిచిన నాలుగు నెలలకు అది అప్రూవల్ అయ్యింది. కాంట్రాక్టర్ అగ్రిమెంట్ అయిన రెండు నెలలకు ప్లాన్ ఇచ్చారు. అనంతరం నాబార్ట్ నిధుల నుంచి మంజూరయిన రూ.2.3 కోట్లతో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. వాస్తవానికి కళాశాల భవనం ఈ ఏడాది మే నెలకు పూర్తి కావల్సి ఉంది. కళాశాల నిర్మాణం కోసం కేటాయించిన స్థలం గతంలో డంపింగ్ యార్డ్ ఉండటంతో ఫౌండేషన్ ఖర్చు భారీగా పెరిగిపోయింది. దీంతో అంచనా వ్యయానికి మించి ఖర్చు అయ్యింది. ఈ విషయాన్ని కాంట్రాక్టర్ 5 నెలల కిందటే వీఎంసీ పాలకుల దృష్టికి తీసుకువెళ్లారు. మరో కోటి రూపాయలు ఉంటేగానీ పూర్తికాదని తెగేసి చెప్పారు.
వీఎంసీ పాలకుల నిర్లక్ష్యం..
సహజంగా ఇటువంటి సందర్భాల్లో రీ ఎస్టిమేషన్ వేసి ఏదో ఒక వర్క్ నుంచి నిధులు మంజూరు చేయటం పరిపాటి. కానీ పాలకుల నిర్లక్ష్యంతో పనులు సగంలోనే నిలిచి పోయాయి. కళాశాల భవనంలో గ్రౌండ్ ఫ్లోర్ 90 శాతం పూర్తికాగా, ఫస్ట్ ఫ్లోర్ శ్లాబ్ దశలో ఆగిపోయింది. ఏదో ఒక రకంగా నిధులు మంజూరు చేయిస్తామన్న గ్యారెంటీని పాలకులు కాంట్రాక్టర్‌కు ఇవ్వకపోవడంతో ఆయన చేతులెత్తేశారు.
పాలకుల ఆరాటం
కళాశాల భవన నిర్మాణ పనులు పూర్తి కాకపోయినా తమ హయాంలో ప్రారంభించామన్న క్రెడిట్ కొట్టేయడానికి పాలకులు ఆరాటపడుతున్నారు. అందులో భాగంగానే ఇటీవల నగర మేయర్ కోనేరు శ్రీధర్ అక్కడికి వచ్చి పరిశీలించారు. అయితే పనులు సగంలోనే నిలిచిపోవడంతో శివాలెత్తిపోయి అధికారులను, కాంట్రాక్టర్‌ను రాయలేని భాషలో తిట్టినట్లు విశ్వసనీయ సమాచారం. వాస్తవానికి ఈ నెల 3న కాలేజీ తరగతులు పునఃప్రారంభం కావల్సి ఉండగా, ఆ రోజునే ప్రారంభోత్సవం చేసేద్దామని ఆయన భావించారు. అయితే అది 12వ తేదీకి వాయిదా పడింది.
ఉర్దూ కళాశాల తెప్పించిన ఘనత వెలంపల్లిదే
నగరానికి ఉర్దూ జూనియర్ కళాశాల తీసుకువచ్చిన ఘనత అప్పటి, ప్రస్తుత ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావుకే దక్కుతుంది. అంతేకాకుండా కాలేజీలో విద్యార్థులకు అవసరమైన బెంచీలను కూడా ఆయనే తన కుమారుడు సాయి అవినీష్ జ్ఞాపకార్థం బహూకరించారు. నగరంలో నాలుగు ఉర్దూ పాఠశాలలు ఉన్నప్పటికీ కాలేజి లేకపోవడంతో ఆయా పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులు పై చదువులకు వేరే ఉరు వెళ్లాల్సి వస్తుంది. దీనిపై ముస్లింలు చేసిన విజ్ఞప్తి మేరకు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న వెలంపల్లి శ్రీనివాసరావు విశేష కృషి చేసి జూనియర్ కాలేజీ తెప్పించారు. అప్పటికి శాశ్వత భవనం లేకపోవడంతో తాత్కాలికంగా వించిపేట మహ్మదాలిపురంలోని నగరపాలక సంస్థ ఉర్దూ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment