
మల్లన్న సన్నిధిలో వరలక్ష్మి వ్రతాలు
శ్రీశైలం : శైవ మహాక్షేత్రంలో రెండవ శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని ఆలయప్రాంగణంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలోని స్వామివార్ల నిత్యకల్యాణ మండపం, అక్కమహాదేవి మండపాలలో కలశాలను ఏర్పాటు చేసి పసుపు, కుంకుమ,గాజులు, జాకెట్‌పీస్‌లతో కలశాన్ని అలంకరించి శాస్త్రోక్త రీతిలో వేదమంత్రోచ్ఛరణల మధ్య వరలక్ష్మీ వ్రతనోములను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ సామూహిక వరలక్ష్మి వ్రతాలలో 1300 ల మందికి పైగా ముత్తైదువులు పాల్గొని వ్రతాన్ని నిర్వహించుకున్నట్లు ఈఓ సాగర్‌బాబు తెలిపారు.
ముత్తైదువులందరికీ దేవస్థానం తరఫున అమ్మవారి శేషవస్త్రాలు, పూలు, గాజులు, ప్రసాదాలను అందజేశారు. అలాగే వ్రతాన్ని ఆచరించుకున్న వారందరికీ శ్రీశైలప్రభ సంచికను ఇచ్చి ప్రత్యేక దర్శన క్యూ ద్వారా ఉచిత దర్శనం, అనంతరం భోజన సౌకర్యాన్ని కల్పించారు. రానున్న 3,4 శ్రావణ శుక్రవారాల(సెప్టెంబర్ 2, 9తేదీలు)లో కూడా భక్తుల కోరిక మేరకు సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఈఓ పేర్కొన్నారు.