
అంగన్‌వాడీల వినూత్న నిరసన
రాజంపేట రూరల్,
కళ్లకు గంతలు కట్టుకుని అంగన్‌వాడీ వర్కర్లు బుధవారం స్థానిక ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రాజంపేట, నందలూరు, పెనగలూరు మండలాల్లోని అంగన్‌వాడీలు పెద్దఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సీఐటీయూ జిల్లా కార్యదర్శి సీ.రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, లేదా అని ప్రశ్నించారు. అంగన్‌వాడీలు ఇరవై రోజుల నుంచి సమ్మె చేస్తుంటే చీమకుట్టినట్లు అయినా ఈ ప్రభుత్వానికి లేదని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలను పట్టించుకునే పరిస్థితులల్లో పాలకులు లేరని మండిపడ్డారు. రాష్ట్రాలు విడిపోయినా కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే పెద్దఎత్తున నిరసనలు తెలుపుతామన్నారు. అంగన్‌వాడీ జిల్లా కార్యదర్శి ఎన్.శంకరమ్మ, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.