టీడీపీలో చేరికలు 'లడ్డూబాబు మేకప్' లాంటివి
వలసలు పేరుతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చేస్తున్న ఆర్బాటం చూస్తుంటే బాధేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. బుధవారం హైదరాబాద్లో వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ ... టీడీపీలో చేరికలు లడ్డూబాబు మేకప్ లాంటివని ఎద్దేవా చేశారు. శాసనసభలో ప్రతిపక్ష నేతగా పదేళ్లలో మీరేం సాధించారని చంద్రబాబును ఆమె సూటిగా ప్రశ్నించారు. ఈ పదేళ్ల కాలవ్యవధిలో ఎవరు తరపున పోరాడారో చెప్పాలని చంద్రబాబును వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ చేతిలో చంద్రబాబు ఓ కీలుబొమ్మలా మారారని ఆమె ఆరోపించారు.
గత పదేళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీ శాసనసభలో ప్రతిపక్ష స్థానంలో ఉంది. అయిన ఆ పార్టీ తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించిన దాఖలాలు లేవు. కనీసం ప్రజల సమస్యలపై పోరాడిన పాపాన కూడా పోలేదు. దాంతో చంద్రబాబు గత పదేళ్ల కాలంలో ప్రతిపక్ష నేతగా ఉత్సవ విగ్రహం ఉన్నారు. అయితే రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా నూకలు చెల్లాయి. దాంతో ఆ పార్టీలోని మాజీ మంత్రులు, సీనియర్లు అంతా జపింగ్ రాగం అలపించుకుంటూ తెలుగు దేశం పార్టీలో చేరుతున్నారు. ఆ పరిణామాన్ని చూసి చంద్రబాబు ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు. రానున్న ఎన్నికలలో తమ పార్టీ విజయం తథ్యమని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాబు వైఖరిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మపై విధంగా స్పందించారు.