ఘాట్ రోడ్డులో రాకపోకలు బంద్ | Vehicles not allowed to Chinturu-Maredumilli Ghat Road | Sakshi
Sakshi News home page

ఘాట్ రోడ్డులో రాకపోకలు బంద్

Published Tue, Aug 13 2013 5:47 AM | Last Updated on Fri, Sep 1 2017 9:49 PM

మరమ్మతులు చేసేందుకు చింతూరు - మారేడుమిల్లి ఘాట్‌రోడ్‌లో మంగళవారం నుంచి రాకపోకలు నిలిపివేశారు. సోమవారం ఘాట్‌రోడ్‌లో పలుచోట్ల అధికారులు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు.

చింతూరు (ఖమ్మం), న్యూస్‌లైన్ : మరమ్మతులు చేసేందుకు చింతూరు - మారేడుమిల్లి ఘాట్‌రోడ్‌లో మంగళవారం నుంచి రాకపోకలు నిలిపివేశారు. సోమవారం ఘాట్‌రోడ్‌లో పలుచోట్ల అధికారులు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. భధ్రాచలం ఆర్‌అండ్‌బీ పరిధిలో గల ఈ ఘాట్ రోడ్డులో ఇటీవల కురిసిన వర్షాలకు ఓ ప్రాంతంలో రిటైనింగ్‌వాల్ (రక్షణ గోడ) కూలిపోగా పలుచోట్ల కొండ చెరియలు విరిగిపడ్డాయి. వాటిని దృష్టిలో ఉంచుకుని అధికారులు రాకపోకలను నిలిపివేసి మరమ్మతులు చేపట్టాలని భావించారు. నెల రోజుల పాటు ఈ మరమ్మతులు కొనసాగనున్నట్టు సమాచారం. కొన్ని రోజుల క్రితం ఆర్‌అండ్‌బీ ఎస్‌సీ ఘాట్‌రోడ్‌ను పరిశీలించి మరమ్మతులు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ రహదారిలో అన్నిరకాల వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈ రహదారిలో ప్రయాణించే ఆర్టీసీ బస్సులకు సంబంధించిన డిపోలతో పాటు, పోలీసు అధికారులకు, రెవెన్యూ, ఐటీడీఏ అధికారులకు లేఖలు రాశారు. ఘాట్‌రోడ్‌లో మరమ్మతుల నిమిత్తం వాహనాల రాకపోకలు నిలిపివేయాల్సిందిగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినట్టు ఆర్‌అండ్‌బీ ఈఈ వెంకటి తెలిపారు.15 రోజుల్లో మరమ్మతు పనులు పూర్తవుతాయని ఆయన పేర్కొన్నారు.
 
ప్రయాణం ఇక దూరాభారమే
ఓ వైపు ఇప్పటికే సీమాంధ్రలో బంద్ వాతావరణంతో  బస్సులు సరిగా నడవక ఇబ్బందులు పడుతున్న భద్రాచలం డివిజన్ ప్రజలపై ఘాట్‌రోడ్ బంద్ తీవ్ర ప్రభావం చూపనుంది. భద్రాచలం, చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, మండలాలకు చెందిన ప్రజలు, వ్యాపారులతో పాటు పొరుగునే వున్న ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలనుంచి నిత్యం అనేకమంది వివిధ పనుల నిమిత్తం రాజమండ్రి వెళుతుంటారు. దీంతోపాటు ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ప్రతిరోజు వందలాది సరుకు రవాణా లారీలు ఈ ఘాట్‌రోడ్‌లోనే ప్రయాణిస్తుంటాయి. మరోవైపు కాకినాడ, రాజమండ్రి, గోకవరం, జగ్దల్‌పూర్ డిపోలకు చెందిన బస్సులు నిత్యం ఈ ఘాట్‌రోడ్ ద్వారానే భద్రాచలం, జగ్దల్‌పూర్ ప్రయాణిస్తుంటాయి. రహదారి మూసివేయడంతో ప్రయాణికులతో పాటు లారీ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. ఇరుకుగా ఉండే ఘాట్‌రోడ్‌కు ఎక్కడా డైవర్షన్‌కు అవకాశం లేకపోవడంతో ఈ రహదారిలో వాహనాలు తిరిగే పరిస్థితి లేదు.
 
ఘాట్‌రోడ్ బంద్‌తో రాజమండ్రి వైపు నుంచి చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, మోతుగూడెం, డొంకరాయి, సీలేరు, భద్రాచలం, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల వైపునకు వెళ్లే రవాణా లారీలతో పాటు బస్సులు రాజమండ్రి నుంచి వయా కుక్కునూరు మీదుగా భద్రాచలం వచ్చి అక్కడి నుంచి ఆయా ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఈ ప్రాంతాల నుంచి రాజమండ్రి వెళ్లాలన్నా వయా భద్రాచలం, కుక్కునూరు మీదుగానే ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. ఉదాహరణకు చింతూరు నుంచి రాజమండ్రికి 130 కి.మీ దూరంకాగా 4 గంటల ప్రయాణం, రూ 105 బస్సు చార్జీ. ప్రస్తుతం ఘాట్‌రోడ్ బంద్‌తో చింతూరు నుంచి భద్రాచలం 65 కిలోమీటర్లు అక్కడి నుంచి రాజమండ్రి సుమారుగా 200 కి.మీ. మొత్తం కలిపి 265 కి.మీల దూరం కాగా 135 కి.మీ అధికంగా, 5 గంటలు అదనంగా ప్రయాణించాల్సి ఉంటుంది. బస్సు చార్జీ సైతం రెట్టింపుకంటే అధికమవుతోంది.
 
అటు సీమాంధ్ర.. ఇటు ఘాట్‌రోడ్డు బంద్
మరోవైపు సీమాంధ్రలో సమైక్య ఉద్యమం నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు నిలిచిపోనుండగా ఇదే తరుణంలో ఘాట్‌రోడ్డులో అన్ని వాహనాల రాకపోకలు నిలిచిపోనుండడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడనున్నారు. ఘాట్‌రోడ్‌లో కార్లు, ఆటోలకు కూడా అనుమతి లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం తప్పనిసరైన వారి గతేంటనేది ప్రశ్నార్ధకంగా మారింది. కార్లు, ఆటోలలో భద్రాచలం మీదుగా వెళ్లాలనుకున్నా మన జిల్లాలోని అశ్వారావుపేట దాటగానే పశ్చిమగోదావరి జిల్లా సరిహద్లుల్లో సమైక్యవాదులు వాహనాలను నిలిపివేసే ఆస్కారముండడంతో ఇటునుంచి వెళ్లే  ప్రయాణికులు మరిన్ని కష్టాలు ఎదుర్కోనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement