
వైఎస్సార్‌సీపీ నాయకుడిపై కక్ష సాధింపు
30 ఏళ్ల నాటి బోరుకు ‘వాల్టా' నోటీసులిప్పించిన టీడీపీ నాయకులు
బత్తలపల్లి : మండలంలోని డి.చెర్లోపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు దరూరి రామకృష్ణపై ఆ గ్రామ టీడీపీ నాయకులు కక్ష సాధింపునకు పాల్పడ్డారు. ఎన్నికల్లో సహకరించలేదన్న అక్కసుతో ఏళ్ల క్రితం వేసిన బోరు బావికి వాల్టా చట్టం కింద నోటీసులు జారీ చేయించారు. బాధితుడు కథనం మేర కు.. చిత్రావతి నది పరీవాహక ప్రాంతంలో ఉన్న తన వ్యవసాయ భూమిలో రామకృష్ణ 30ఏళ్ల క్రితం బోరు వేసుకున్నా డు. వెయ్యి చీనీ చెట్లు, 600 జామ చెట్లు, ఐదెకరాల్లో టమాట పంట సాగు చేశాడు. ఈ క్రమంలో వాల్టా చట్టం అతిక్రమించారంటూ గత నెల 29న రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. స్థానిక టీడీపీ నాయకులు రాజకీయంగా ఒత్తిళ్లు తెచ్చి నోటీసులు ఇప్పించారని బాధితుడు వాపోయాడు.
బోరు నీటితోనే పంటలు కాపాడుకుంటున్నామని, తమకు అన్యాయం జరిగితే తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్య చేసుకుంటామని వాపోయాడు. రెవెన్యూ అధికారులు ఈ సమస్యను పరిశీలించి న్యాయం చేయాలని కోరా డు. కాగా నదిలో దాదాపు 100 నుంచి 120 మంది రైతులు బోర్లు వేసుకుని పంటలు పండించుకుంటూ జీవిస్తున్నారన్నారు. ఈ సమస్యపై మండల వైఎస్సార్‌సీపీ నాయకులు మంగళవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఇన్‌చార్జ్ తహశీల్దార్ సురేష్‌బాబును కలిశారు. గత 30 ఏళ్లకు పైబడి రైతులు ఇక్కడి నదీ పరీవాహక ప్రాంతంలో బోర్లు వేసుకుని పంటలు పండిస్తున్నారని, వారి పొట్టకొట్టవద్దని విన్నవిం చారు. చిత్రావతిలో వేసిన బోర్లు, పంటల సాగును వివరించారు. గ్రామాల్లో కక్షలకు ఆజ్యం పోసే ఇలాంటి చర్యలకు పూనుకోవద్దని, నోటీసుకు వివరణ ఇచ్చేందుకు 3 వారాలు గడువు ఇవ్వాలని కోరారు. దీంతో రాతపూర్వకంగా అర్జీ ఇవ్వాలని తహశీల్దార్ సూచించారు. మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గోల్లపల్లి రామకృష్ణారెడ్డి, ఎంపీపీ కోటి సూర్యప్రకాష్‌బాబు, సింగిల్ విండో అధ్యక్షుడు కేశనపల్లి వెంకటచౌదరి, మండల కన్వీనర్ బగ్గిరి బయపరెడ్డి, గుర్రం శ్రీనివాసరెడ్డి, ముష్టూరు నరసింహారెడ్డి, జయరామిరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు గుజ్జెల వెంగళరెడ్డి, ప్రసాద్‌రెడ్డి, కృష్ణా, రామకృష్ణ, ముసలయ్య, నారాయణస్వామి, కార్యకర్తలు పాల్గొన్నారు.