సాక్షి, నెల్లూరు: పల్లె, పట్టణం, నగరం అనే తేడా లేకుండా జిల్లా వ్యాప్తంగా సమైక్య నినాదం మార్మోగుతోంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుకోవాలనే ఆకాంక్షతో అన్ని వర్గాల ప్రజలు 52 రోజులుగా ఉద్యమబాటలో అలుపెరగని పయనం సాగిస్తున్నారు. ఢిల్లీ వీధులు దద్దరిల్లేలా ఇక్కడి నుంచే సమైక్య శంఖారావం పూరిస్తున్నారు. రోజుకో వినూత్న కార్యక్రమంతో సమైక్య భేరి మోగిస్తున్నారు.
జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో శుక్రవారం నిరసన కార్యక్రమాలు హోరెత్తాయి. నెల్లూరులోని వీఆర్‌సీ సెంటర్‌లో ప్రైవేటు విద్యాసంస్థల జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు మొదలయ్యాయి. వీఆర్‌సీ సెంటర్‌లో ఉపాధ్యాయులు(యూటీఎఫ్), గాంధీబొమ్మ సెంటర్‌లో ఎస్‌యూపీఎస్ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ కార్మికులు బస్సుకు తాళ్లు కట్టి ఆర్టీసీ బస్టాండ్ నుంచి వీఆర్‌సీ వరకు లాగారు. రెవెన్యూ అసోసియేషన్ నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కావలి లోని జెండాచెట్టు సెంటర్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు మత్స్యకారులు వలలు, బోట్లతో ర్యాలీ చేశారు.
న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో కేసీఆర్, సోనియా, కోదండరామ్ మాస్క్‌లు ధరించిన వారితో ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ జరిగింది. వైఎస్సార్‌సీపీ, సమైక్యాంధ్ర జేఏసీ, ప్రభుత్వ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ఆర్డీఓ, జేబీ కళాశాల యాజ మాన్యం ఆధ్వర్యంలో జేబీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు సమైక్య క్రీడాజ్యోతి ర్యాలీ సాగింది. పొదలకూరులో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రిలేదీక్ష చేశారు. వీరికి తహశీల్దార్,ఎంపీడీఓ సంఘీభావం తెలిపారు. వెంకటగిరిలో జేఎసీ ఆధ్వ ర్యంలో మహిళాగర్జన నిర్వహించారు. పలు మహిళా సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థినులు వేలాదిగా తరలివచ్చారు.
ఎంపీడీఓ కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా స్థానిక కాశీపేట కూడలిలో ఏర్పాటుచేసిన సభాస్థలికి తరలివచ్చారు. 50 రోజులుగా ఉద్యమం హోరెత్తుతున్న ప్రభుత్వం స్పందించకపోవడంపై వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ రాపూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మండిపడ్డారు. సైదాపురంలో ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిరాహారదీక్షలు చేపట్టారు. ఉదయగిరి బస్టాండ్ సెంటర్‌లో ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు రిలే దీక్ష చేశారు. వైఎస్సార్‌సీపీ నేతల దీక్షలు కొనసాగాయి. సీతారాంపురం బస్టాండు సెంటర్లో రిలే దీక్షలు 23వ రోజుకు చేరుకున్నాయి. వింజమూరులో ఉద్యోగ జేఏసీ దీక్షలు 45వ రోజుకు చేరుకున్నాయి. గూడూరు టవర్‌క్లాక్ సెంటర్‌లో రిలేదీక్ష లో ఉన్న వారికి లోక్‌సత్తా పార్టీ నేత కేవీ కృష్ణయ్య మద్దతు పలికారు. విద్యార్థులు రాస్తారోకో నిర్వహించి మానవహారంగా నిలిచారు.కోట, వాకాడు, చిట్టమూరు మండలాల క్రైస్తవులు కోటక్రాస్ రోడ్డు వద్ద ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ నాయకుడు బత్తిన విజయకుమార్ హాజరయ్యారు.
వాకాడులో కేంద్ర ప్రభు త్వ కార్యాలయాలు మూతపడ్డాయి. చిట్టమూరులో ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు మోకాళ్ల నిలిచి నిరసన తెలిపారు. ఆత్మకూరులోని బస్టాండు సెంటర్‌లో అధ్యాపకులు రిలేదీక్షలో కూర్చున్నారు. నెల్లూరుపాళెం సెంటర్‌లో ఆర్టీసీ జేఏసీ, సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. సంగంలో ర్యాలీ జరిగింది. చేజర్లలోని బస్టాండు సెంటర్‌లో ఉపాధ్యాయులు రిలేదీక్షలో కూర్చున్నారు. బుచ్చిలోని వైఎస్సార్ విగ్రహం వద్ద విద్యార్థి, ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
కోవూరులోని ఎన్జీఓ హోంలో షుగర్‌ఫ్యాక్టరీ కార్మికులు రిలేదీక్షలో కూర్చున్నారు.కొడవలూరులో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. ఇందుకూరుపేటలోని బస్టాండు సెంటర్‌లో మానవహారంగా నిలుచుని వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. సూళ్లూరుపేట, నాయుడుపేటలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. మంగళంపాడు సర్పం చ్‌తో పాటు పలుశాఖల ఉద్యోగులు దీక్షలో కూర్చున్నారు. తడలో రోడ్డుపైనే క్షవరం చేసి నాయీ బ్రాహ్మణులు నిరసన తెలిపారు.
వెంకటగిరిలో మహిళల భారీ ర్యాలీ
Published Sat, Sep 21 2013 3:36 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement