తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం శివకోడులో 'సువర్ణ ఇండియా' చిట్ ఫండ్ కంపెనీ ఎండీ బూశెం వెంకటవేణు నివాసంపై బాధితులు మంగళవారం దాడి చేశారు.
రాజోలు : తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం శివకోడులో 'సువర్ణ ఇండియా' చిట్ ఫండ్ కంపెనీ ఎండీ బూశెం వెంకటవేణు నివాసంపై బాధితులు మంగళవారం దాడి చేశారు. ఆయన ఇంటి అద్దాలు ధ్వంసం చేశారు. మలికిపురం కేంద్రంగా సుమారు రూ.3 కోట్ల మేర డిపాజిట్లు సేకరించిన సువర్ణ ఇండియా 18 నెలల క్రితం బోర్డు తిప్పేసింది. డిపాజిట్ దారులందరికీ వారి సొమ్ములు తిరిగి చెల్లించలేదు. ఈ కేసు విషయంలో వేణు అరెస్ట్ కాగా, అనంతరం బెయిల్‌పై విడుదలై... బకాయిలన్నింటినీ చెల్లిస్తానని డిపాజిట్ దారులకు హామీ ఇచ్చారు.
అయితే 15 రోజుల క్రితం 'సువర్ణ ఇండియా' కంపెనీపై రాజమండ్రిలో ఒక వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ కంపెనీ డిపాజిట్ దారుల్లో మళ్లీ ఆందోళన చెలరేగింది. డిపాజిట్లు రావేమోనన్న ఆందోళనతో మంగళవారం సుమారు 15 మంది వేణు నివాసంపై దాడి చేశారు. ఆ సమయంలో వేణు, ఆయన భార్య రాజ్యలక్ష్మి ఇంట్లో లేరు. బాధితులతో రాజ్యలక్ష్మి ఫోన్లో మాట్లాడి, అందరికీ డబ్బులు తిరిగి చెల్లిస్తామని చెప్పారు. కేసు కోర్టులో ఉన్నందున దాడులు సరికావని చెప్పడంతో వారు శాంతించి వెనక్కి వెళ్లిపోయారు.