కేసు వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ షేక్ మాసూమ్ బాషా
రాజోలు(తూర్పుగోదావరి):వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని... కట్టుకున్న భర్తనే కడతేర్చేందుకు భార్య ప్రియుడితో కలసి కుట్ర పన్నింది. పథకం ప్రకారం మత్తు బిళ్లలు మజ్జిగ, అన్నంలో కలిపి భర్తకు ఇచ్చి అనారోగ్యం పాల్జేసింది. చివరకు ప్రియుడితో కలసి భర్తను హత్య చేసి సహజ మరణంగా చిత్రీకరించి అంత్యక్రియలు పూర్తి చేసింది. అడ్డుతొలగిందని ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతుండగా కూతురు విని తండ్రి హత్యకు గురైనట్టు తెలుసుకుని సఖినేటిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనలో సఖినేటిపల్లి మండలం ఉయ్యూరివారి మెరకకు చెందిన ఉప్పు ప్రసాద్ (48) ఈ నెల 2న హత్యకు గురయ్యాడు. భర్తను హత్య చేసిన కేసులో నిందితులైన భార్య ప్రశాంతి, ప్రియుడు చొప్పల సుభాకర్(శివ), మరో ఇద్దరు నల్లి వెంకట నరసింహారావు, జిల్లెళ్ల ప్రసాద్‌లను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. మధ్యవర్తిత్వం చేసి మత్తు బిల్లులు అందించిన మరో నిందితురాలు యడ్ల ప్రమీలరాణి పరారీ ఉంది.
సోమవారం రాజోలు పోలీస్ స్టేషన్ వద్ద అమలాపురం డీఎస్పీ షేక్ మాసూమ్ బాషా స్థానిక విలేకరులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సఖినేటిపల్లి మండలం ఉయ్యూరివారి మెరకలో ప్రశాంతి అలియాస్ శాంతి భర్త ఉప్పు ప్రసాద్ సోడాషాపు నిర్వహించుకుంటున్నాడు. ప్రశాంతికి కేశవదాసుపాలేనికి చెందిన చొప్పల సుభాకర్(శివ)కు కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. తమ సంబంధానికి భర్త ప్రసాద్ అడ్డుగా ఉన్నాడని హత్య చేసేందుకు కుట్ర పన్నారు. ప్రియుడు మత్తు బిళ్లలను మధ్యవర్తిగా ఉన్న యడ్ల ప్రమీలరాణి ద్వారా ప్రశాంతికి ఇస్తే వాటిని రోజూ భర్తకు మజ్జిగ, అన్నంలో కలిపి ఇచ్చేది. అలాచేస్తే అనారోగ్యానికి గురై ఎవరికీ అనుమానం రాకుండా భర్త చనిపోతాడని భావించారు. ఎంతకీ భర్త చనిపోక పోవడంతో ప్రియుడు శివ నేరుగా రంగంలోకి దిగాడు.
ఈ నెల 2న సోడాషాపు వద్దకు వచ్చి నిమ్మసోడా కావాలంటూ ఉప్పు ప్రసాద్‌ను శివ అడిగాడు. ఈ నేపథ్యంలో వెనుక నుంచి శివ అనుచరులైన నల్లి వెంకట నరసింహారావు అలియాస్ పండు (చింతలమోరి), జిల్లెళ్ల ప్రసాద్ అలియాస్ డెక్కన్ (కేశవదాసుపాలెం)లు ప్రసాద్ మెడకు తువాలు వేసి కింద పడేశారు. పడిపోయిన ప్రసాద్ గొంతును శివ నులుమి ప్రాణాలు తీశాడు. ఎవరికీ అనుమానం రాకుండా షాపులో ఉన్న కురీ్చలో ప్రసాద్ శవాన్ని కూర్చోబెట్టి వెళ్లిపోయారు. భార్య ప్రశాంతి వచ్చి లబోదిబోమని మొసలి కన్నీరు కారుస్తూ కూతురు మేరి ప్రేస్లీని పిలిచింది. ప్రేస్లీ స్థానికుల సహకారంతో తండ్రిని రాజోలు ఏరియా ఆస్పత్రికి తీసుకుని వెళ్లింది. అప్పటికే ప్రసాద్ మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు.
దీంతో తమ ఆచారం ప్రకారం మృతదేహాన్ని గ్రామంలోని శ్మశాన వాటికలో ఖననం చేశారు. తండ్రి చనిపోయిన నాటి నుంచి తల్లి ప్రవర్తనలో మార్పు రావడంతో కూతురు ప్రేస్లీకి అనుమానం వచ్చింది. తల్లి సెల్‌ఫోన్ సంభాషణలపై దృష్టి పెట్టింది. ప్రియుడు శివతో తల్లి ప్రశాంతి మాట్లాడిన మాటలను విని తన తండ్రి హత్యకు గురయ్యాడని తెలుసుకుంది. ఈ నెల 26న తల్లిపై కుమార్తె ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సఖినేటిపల్లి ఎస్సై సురేష్‌కుమార్ హత్య కేసు నమోదు చేశారు. ట్రైనీ డీఎస్పీ డి.బాలచంద్రారెడ్డి, సీఐ డి.దుర్గాశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో కేసు విచారణ చేపట్టారు. ఈ నెల 26న ఖననం చేసిన ప్రసాద్ మృతదేహాన్ని బయటకు తీసి శవపంచనామా నిర్వహించారు. హత్య కేసును ఛేదించిన ట్రైనీ డీఎస్పీ డి.బాలచంద్రారెడ్డి, అమలాపురం డీఎస్పీ షేక్ మాసూమ్ బాషా, రాజోలు సీఐ దుర్గాశేఖర్‌రెడ్డి, ఎస్సై సురేష్‌కుమార్‌ను ఎస్పీ నయీం అస్మీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment