అసత్యాలతో అడ్డగోలు వాదన! | Vigilance for cheating case on Nama Nageswara Rao | Sakshi
Sakshi News home page

అసత్యాలతో అడ్డగోలు వాదన!

Published Wed, Jan 22 2014 4:09 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

అసత్యాలతో అడ్డగోలు వాదన! - Sakshi

అసత్యాలతో అడ్డగోలు వాదన!

తప్పుడు ధ్రువీకరణలతో, అధికారులను మేనేజ్ చేసి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో వందల కోట్ల విలువైన భూమిని కాజేసేందుకు ప్రయుత్నించిన మధుకాన్ సంస్థ అధినేత నామా నాగేశ్వరరావు అసత్యాలతో...

కూకట్‌పల్లి భూమిపై నామా అవాస్తవాలు
2004 మే 10న వైఎస్ ప్రాజెక్టు ఇచ్చారన్న నామా
 .. వైఎస్ సీఎంగా బాధ్యతలు స్వీకరించింది 2004 మే 14న
చంద్రబాబు సీఎంగా ఉండగా 2004 ఫిబ్రవరిలోనే వేగంగా కసరత్తు
నిబంధనలు ఉల్లంఘించి మధుకాన్‌కు ప్రాజెక్టును కట్టబెట్టిన అధికారులు
నిగ్గుతేల్చిన విజిలెన్స్ నివేదిక... ఒప్పందాన్ని రద్దుచేయాలని సిఫారసు
విజిలెన్స్ నివేదికను ఖండించని నామా...

 
సాక్షి, హైదరాబాద్: తప్పుడు ధ్రువీకరణలతో, అధికారులను మేనేజ్ చేసి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో వందల కోట్ల విలువైన భూమిని కాజేసేందుకు ప్రయుత్నించిన మధుకాన్ సంస్థ అధినేత నామా నాగేశ్వరరావు అసత్యాలతో, అడ్డగోలు వాదనతో తనను తాను సమర్థించుకునేందుకు ప్రయుత్నిస్తున్నారు. మంగళవారం ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదే కనిపించింది.
 
     2004 మే 10వ తేదీన వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనకు ఈ ప్రాజెక్టును కట్టబెట్టారని నామా చెప్పారు. అయితే, వాస్తవానికి వైఎస్ సీఎంగా బాధ్యతలు చేపట్టింది 2004 మే 14వ తేదీన. అంటే వైఎస్ సీఎంగా బాధ్యతలు చేపట్టక ముందే తనకు కూకట్‌పల్లి భూమిని అప్పగించారని నామా చెబుతున్నారన్నమాట. 2004 ఫిబ్రవరిలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఈ భూమిని కట్టబెట్టారన్న విషయాన్ని కప్పిపుచ్చడానికే నామా  వైఎస్ ప్రస్తావన తెచ్చారని ఇక్కడ స్పష్టమవుతోంది.
     తన సంస్థ అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదికను కనీసం ప్రస్తావించలేదు. ఎందుకంటే ఫిబ్రవరి 2004లోనే ఆ భూమిని మధుకాన్‌కు అప్పగించేందుకు ముందస్తు నిర్ణయానికి వచ్చారని విజిలెన్స్ నివేదిక సుస్పష్టంగా పేర్కొంది. అంటే చంద్రబాబు అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మధుకాన్‌కు భూసంతర్పణ నిర్ణయం జరిగిపోయిందన్నమాట. ఇదే విషయా న్ని ‘సాక్షి’ మంగళవారం సంచికలో పేర్కొంది.
 
     ఈ ఒప్పందాన్ని రద్దు చేసి, అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలన్న విజిలెన్స్ సిఫారసుపై ప్రస్తుత కిరణ్ ప్రభుత్వం ఎందుకు మిన్నకుండిపోయిందన్న అంశాన్నీ ‘సాక్షి’ ప్రస్తావించింది. అయితే, తాను అక్రమాలకు పాల్పడినట్లుగా విజిలెన్స్ ఇచ్చిన నివేదికలోని ఒక్క అంశాన్ని కూడా నామా ప్రస్తావించలేదు. ఆ నివేదిక తప్పని చెప్పుకునే ప్రయత్నమూ చేయులేదు.
 
     వాస్తవాలు ఏమిటో చెప్పకుండా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ఎదురుదాడికి దిగారు.  చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే ఈ భూ సంతర్పణకు వేగంగా కసరత్తు జరిగింది. బిడ్డింగ్ నిబంధనలను మార్చడంతో పాటు మధుకాన్‌కు అర్హత కల్పించేందుకు టర్నోవర్‌ను కూడా రూ.100 కోట్ల నుంచి రూ.50 కోట్లకు తగ్గించారు. సాంకేతిక కన్సార్షియం భాగస్వామిగా బీనాపురి కంపెనీ ఉందని తప్పుడు పత్రాలను సమర్పించి కాంట్రాక్టును కైవసం చేసుకుంది. ఈ వాస్తవాలను కప్పిపుచ్చి నామా ఎదురుదాడికి దిగే ప్రయత్నం చేయడం గమనార్హం.
 
 ఎకరాకు రూ.4.45 కోట్లు పెట్టా: నామా
 టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా హైదరాబాద్ కూకట్‌పల్లిలో విలువైన భూములను మధుకాన్ కంపెనీ కారు చౌకగా కైవసం చేసుకున్న వైనంపై ఆ సంస్థల యజమాని, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావు స్పందించారు. పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులుతో కలిసి మంగళవారం ఎన్టీఆర్ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ భూములకు జరిగిన బిడ్డింగ్‌లో ఏడుగురు అర్హత పొందితే, అందులో అత్యధిక బిడ్డింగ్ వేసిన మధుకాన్ కంపెనీ ఎకరాకు 4.45 కోట్ల చొప్పున మొత్తం 40.28 కోట్ల రూపాయలు చెల్లించినట్టు చెప్పారు. ఆరోజు మార్కెట్ విలువ రూ.2 కోట్లు కూడా లేదని తెలి పారు.
 
 డబ్బంతా చెల్లించిన తర్వాత ఆ భూములకు సంబంధించి సమతానగర్ రెసిడెన్షియల్ అసోసియేషన్, జీహెచ్‌ఎంసీ, హుడా, ఏపీ హౌసింగ్, రాష్ట్ర ప్రభుత్వంపైనా, మాపైనా కేసులు వేశారని చెప్పా రు. ఆరోజు నుంచి ప్రభుత్వం వాటిని క్లియర్ చేసి భూములు ఇవ్వాల్సి ఉండగా ఇవ్వలేదన్నారు. ఈ విషయంలో అసత్య ప్రచారం చేయడం తగదన్నారు. చంద్రబాబు మీద ఎందుకు బురదజల్లుతున్నారని ప్రశ్నిస్తూ.. ఈ సందర్భంగా ఆయన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు గుప్పించారు. సాక్షిపై తన అక్కసును వెళ్లగక్కారు. విజిలెన్స్ నివేదికపై మాత్రం ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
 
 హౌస్ కమిటీతో విచారణ మొదలు
 ఈ ప్రాజెక్టులో అవకతవకలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే పి.జనార్దన్‌రెడ్డి 2005 డిసెంబర్ 16న అసెంబ్లీలో నోటీసు ఇచ్చారు. స్పందించిన ప్రభుత్వం బాజిరెడ్డి గోవర్ధన్ నేతృత్వంలో హౌస్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 2008లో నివేదికను సమర్పించింది. జాయింట్ వెంచర్ ప్రాజెక్టులను చేపట్టే సమయంలో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించింది. ఇందుకు అనుగుణంగా హౌసింగ్ బోర్డు పని విధానంలో వైఎస్ హయాంలో మార్పులు వచ్చాయి. తర్వాతి కాలంలో అనేక అవకతవకలు ఉన్నట్టు విజిలెన్స్ శాఖకు ఫిర్యాదులు అందడంతో విచారణ ప్రారంభించింది. గత ఏడాది ఆగస్టులో నివేదిక సమర్పించింది. అయితే, ఈ నివేదిక వచ్చి ఆర్నెల్లయినా  ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
 
 విజిలెన్స్ నిగ్గు తేల్చిన నిజాలు!
 -    ప్రాజెక్టును దక్కించుకునేందుకు వుధుకాన్ యుజ వూని ఏపీహెచ్‌బీ అధికారులను ‘మేనేజ్’ చేశారు.
 -    కంపెనీకి ఉన్న అనుభవం గురించి కూడా మధుకాన్ తప్పుడు పత్రాలు సమర్పించింది. ‘వర్క్ కాంట్రాక్ట్స్’గా పనులు చేపట్టిన అనుభవం తమకుందని పత్రాలు సమర్పించింది. ఈ రకమైన పనులు చేపట్టేందుకు ‘డెవలపర్’ తరహా అనుభవం ఉండాలని ఈఓఐ (ఆసక్తి వ్యక్తీకరణ లేఖ) స్పష్టం చేస్తోంది.
 -    సాధారణంగా ఈఓఐని క్రిసిల్‌లాంటి జాతీయస్థాయి సంస్థలు సమీక్షించాలి. మధుకాన్ ఈఓఐను మాత్రం ఏపీహెచ్‌బీ అధికారులే సమీక్షించారు.
 -    సాంకేతిక కన్సార్షియం భాగస్వామిగా బీనాపురి కంపెనీ ఉందని మధుకాన్ పేర్కొంది. వాస్తవానికి బీనాపురి కంపెనీకి ఇందులో భాగస్వామ్యం లేదు. ఆ విషయాన్ని కప్పిపుచ్చి ఆ కంపెనీకి 11 శాతం ఈక్విటీ ఉన్నట్లుగా తప్పుడు పత్రాలు సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement