ఎరువుల గుట్టు..విభేదాలతో రట్టు
నంద్యాల: ఎరువుల అక్రమ నిల్వలు వెలుగులోకి రావడం వెనుక అధికార పార్టీకి చెందిన వ్యాపారుల మధ్య ఆధిపత్య పోరే ప్రధాన కారణంగా భావిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన మద్దతు దారుడుగా కొనసాగుతున్న దియ్యాల మధుసూదనరావు వ్యవసాయ అధికారుల అనుమతి లేకుండా అక్రమంగా నిల్వ ఉంచిన 1175 టన్నుల ఎరువులను ఈ నెల 24న విజిలెన్‌స అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం విధితమే. వీటి విలువ రూ.2.09 కోట్లు ఉంటుందని విజిలెన్స్ అధికారులు అంచనా వేశారు.
నంద్యాల పట్టణంలో ఏటా దాదాపు రూ.15 కోట్లు విలువ చేసే ఎరువులను స్థానిక వ్యాపారులు విక్రయిస్తుంటారు. పట్టణంలోని వ్యాపారులు స్థానిక రైతులకే కాకుండా శ్రీశైలం, ఆళ్లగడ్డ, బనగానపల్లె, పాణ్యం నియోజకవర్గాల్లోని 10 మండలాలకు ఎరువులను విక్రయిస్తుంటారు. అయితే ఐదారుగురు వ్యాపారులు మాత్రం స్థానిక రైతులకు విక్రయించడం కంటే సీజన్‌ను బట్టి నెల్లూరు, కడప, ప్రకాశం, మహబూబ్‌నగర్ జిల్లాలకు తరలించి భారీ ఎత్తున ఆదాయాన్ని గడిస్తుంటారు.
పది సంవత్సరాల నుంచి నంద్యాల పట్టణంలోని ఎరువుల వ్యాపారులు అధికార పార్టీకి అండదండలను అందిస్తూ తమ అక్రమ వ్యాపారాన్ని మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగించుకుంటున్నారు. వీరిపై దాడులు నిర్వహించడానికి కూడా అధికారులు వెనుకడుగు వేసేవారు. దాడికి వెళ్లే సమయంలోనే అధికార పార్టీకి చెందిన నాయకుల నుంచి ఫోన్లు వచ్చేవి. పక్కా సమాచారం మేరకు నాలుగు రోజుల క్రితం విజిలెన్స్ అధికారులు ధైర్యంగానే దాడులు కొనసాగించి అక్రమంగా నిల్వ ఉంచిన ఎరువులు 1175 టన్నులను స్వాధీనం చేసుకున్నారు.
ఆదాయం కోసం ఆధిపత్య పోరు..
ఎరువుల వ్యాపారులు కొందరు తమ ఆధిపత్యం కొనసాగించేందుకు ప్రత్యర్థిపై అధికారులకు పక్కా సమాచారం అందించి వారిని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. దియ్యాల మధుసూదనరావు పట్టణంలో ఎరువుల వ్యాపారుల సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ఈయన మాజీ ఎమ్మెల్యే శిల్పామోహన్‌రెడ్డికి తలలో నాలుకలాగా వ్యవహరించే వ్యక్తిగా గుర్తింపు ఉంది. ఎరువుల కంపెనీలు కూడా ఈయన కనుసన్నల్లోనే స్టాక్‌ను ఇతర వ్యాపారులకు కేటాయిస్తుంటారు. ఏ వ్యాపారి దగ్గర లేనన్న నిల్వలు దియ్యాల దగ్గర ఉన్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో ఆయన వ్యతిరేక వర్గీయులు ఎరువుల అక్రమ నిల్వలపై పక్కా సమాచారాన్ని విజిలెన్స్ అధికారులకు అందించినట్లు తెలుస్తోంది.