తాడితోట (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం విజిలెన్స్ ఎస్పీ రెడ్డి గంగాధరరావు ఆధ్వర్యంలో జిల్లాలోని అంగన్ వాడీ కేంద్రాలను విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలోని రాజానగరం మండలంలో దివాన్ చెరువు, నెంబర్ 1, 42 కేంద్రాలను అధికారులు తనిఖీ చేశారు. రికార్డులు సరిగా నిర్వహించకపోవడం, టాయిలెట్లు లేకపోవడం, పరికరాలు అపరిశుభ్రంగా ఉండడం, హాజరులో తేడాలు గమనించారు.
అమలాపురం మండలం కామనగరువు గ్రామంలోని బడుగువారి పేట, చిట్టెమ్మ చెరువు, అంగన్‌వాడీలను తనిఖీ చేసిన అధికారులు స్టాకు నిల్వల్లో ఉన్న వ్యత్యాసాలు గమనించి రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడం, మధ్యాహ్నం అల్పాహారం ఇవ్వడం లేదని గుర్తించారు. పెద్దాపురం డివిజన్ పరిధిలో జగ్గంపేట మండలం కాట్రావుల పల్లి గ్రామంలో 3, సీతానగరంలో 1, రంగాయమ్మ పేట అంగన్ వాడీ కేంద్రాలను అధికారులు తనిఖీ చేశారు. సీతానగరం అంగన్ వాడీ కేంద్రం శిథిలావస్థలో ఉండడంతో దానిని ఖాళీ చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
కాకినాడ డివిజన్ పరిధిలో తాళ్లరేవు మండలం చొల్లంగి గ్రామంలో నంబర్ 3, 26, గురజానపల్లి గ్రామంలో 1, 2, 5 కేంద్రాలను అధికారులు తనిఖీ చేశారు. చొల్లంగిలో 26 నంబర్ అంగన్ వాడీ కేంద్రంలో పాలు లేకపోవడం గమనించారు. రికార్డులు సక్రమంగా నిర్వహించాలన్నారు. విజిలెన్స్ ఎస్పీ రెడ్డి గంగాధరరావు చింతూరు డివిజన్‌లోని చింతూరు గొమ్మా 1, ఎర్రంపేట 1, 2, అంగన్ వాడీ కేంద్రాలు తనిఖీ చేశారు.
కోడిగుడ్లు ఈ నెలలో అసలు సరఫరా లేకపోవడం, పాలు నిల్వల్లో తేడాలు రావడం, బాత్ రూమ్‌లు సరిగా నిర్వహించకపోవడం గమనించారు. రెడ్డి గంగాధరరావు మాట్లాడుతూ కొన్ని కేంద్రాలు అద్దె గృహాల్లో నిర్వహించడం, కొన్ని శిథిలావస్థలో ఉండడం, బాత్‌రూమ్‌లు లేకపోవడం, ఉన్నా సక్రమంగా నిర్వహించకపోవడం వంటి విషయాలను గమనించామని దీనిపై సమగ్ర నివేదిక ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ అధికారులు బి.ఎస్.ఎన్.మూర్తి, వై.సత్యకిశోర్, బి.సాయి రమేష్, టి.రామ్మోహన్ రెడ్డి, పీడీ రత్న కుమార్, జి. గోపాలరావు, భార్గవమహేష్, షేక్‌వలీ, జి.అప్పారావు, సాయిబాబా, సుబ్రహ్మణ్యేశ్వరరావు, రామకృష్ణ, విజిలెన్స్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment