రోజులు మారాయి.. అందుకే పార్టీ మారాను.. మీరూ మారాలి’ అని మెదక్ ఎంపీ విజయశాంతి అన్నారు.
రోజులు మారాయి.. పార్టీ మారా
Published Mon, Oct 21 2013 4:06 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
సిద్దిపేట రూరల్, న్యూస్‌లైన్:‘రోజులు మారాయి.. అందుకే పార్టీ మారాను.. మీరూ మారాలి’ అని మెదక్ ఎంపీ విజయశాంతి అన్నారు. సిద్దిపేట మండలం మిట్టపల్లిలో వడ్డెర సంఘం భవన నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన చేశారు. గ్రామ దేవతలను పూజిస్తూ కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం గ్రామంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజా శ్రేయస్సుకోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని, అధికార పార్టీలో ఉన్న నాకు అభివృద్ధి చేయడం సాధ్యమవుతోందన్నారు. సిద్దిపేట ప్రజలు కూడా మారాల్సిన అవసరం ఉందన్నారు. 2014లో కాం గ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యత ఇక్కడి ప్రజలదేనని అన్నారు. ఎంపీ నియోజకవర్గపరిధిలోని సిద్దిపేటకు అధికంగా నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు.
నిధులు నావి... పేరు ఎమ్మెల్యేదిగా ప్రచారం చేసుకుంటున్నారని పరోక్షంగా స్థానిక ఎమ్మెల్యే హరీష్‌రావుపై విమర్శలు గుప్పించారు. ప్రజల కోసం పుట్టిన రాములమ్మ ప్రజల కోసమే చస్తుందన్నారు. తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది అన్న మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ పార్టీని విశ్వసించాలన్నారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో అడ్డుకుంటే వారి చెంప చెళ్లుమంటుందని ఆవేశపూరితంగా అన్నారు. సిద్దిపేట నియోజకవర్గం ప్రజల ఓట్లతోనే గెలిచానని, అందుకే ఈ నియోజకవర్గానికి అధికంగా నిధులిచ్చానని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడబోతున్నదని, కష్టాలు తొలుగుతాయన్నారు. సీమాంధ్ర నాయకులు తెలంగాణ గురించి ఏం మాట్లాడినా పట్టించుకోవద్దని ప్రజలకు సూచించారు.
మిట్టపల్లిలోని అసంపూర్తిగా ఉన్న మైనార్టీ సంఘం భవన నిర్మాణానికి, హైమాస్ట్ లైట్లు, బోరు మోటార్ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కుర్మ సంఘం ఆధ్వర్యంలో విజయశాంతికి గొంగళి కప్పి సన్మానించారు. అనంతరం పలు సంఘాల వారు ఎంపీని సన్మానిం చారు. అంతకు ముందు రంగాధాంపల్లి చౌరస్తా వద్ద గల అమరవీరుల స్థూపం వద్ద ఎంపీ నివాళులర్పించారు. ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు సిద్ధరబోయిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో మిట్టపల్లి వరకు బైక్ ర్యాలీ నిర్వహిం చారు. గ్రామ సర్పంచ్ రాజ్యలక్ష్మి, ఎంపీ విజయశాంతికి మంగళహారతి, పూలమాలతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మల్లవ్వ, వార్డు సభ్యులు రజిత, నర్సింహులు, మహేష్, సమేష్, ఫాయాసోద్దిన్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ వర్మ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement