విజయవాడ పోలీసు కమిషనరేట్‌కు
- నలుగురు అదనపు డీసీపీలు
విజయవాడ సిటీ : నగర పోలీసు కమిషనరేట్‌కు నలుగురు అదనపు డీఎస్పీలను కేటాయించిన ప్రభుత్వం.. ఇక్కడ పనిచేస్తున్న ఒక అదనపు ఎస్పీ, ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా పనిచేస్తున్న ఇద్దరు డీఎస్పీలు సహా ముగ్గురు అదనపు డీసీపీలను బదిలీ చేసింది. నగర పోలీసు కమిషనరేట్ బలోపేతం చేసేందుకు ఉన్నతాధికారులు చేపట్టిన చర్యల్లో భాగంగా ఈ బదిలీలు జరిగినట్టు పోలీసు వర్గాల సమాచారం. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం..
వచ్చేది వీరు..
గుంటూరు అర్బన్ వెస్ట్‌జోన్ డీఎస్పీగా పనిచేస్తున్న టీవీ నాగరాజుకు అదనపు ఎస్పీగా పదోన్నతి కలిపించి విజయవాడ నగర ట్రాఫిక్ అదనపు డీసీపీగా బదిలీ చేశారు. ఇంటెలిజెన్స్ డీఎస్పీగా పనిచేస్తున్న ఎం.నాగేశ్వరరరావుకు అదనపు ఎస్పీగా పదోన్నతి కలిపించి నగర క్రైం విభాగం అదనపు డీసీపీగా నియమించారు. కేంద్ర నేర పరిశోధన విభాగం (సీఐడీ) డీఎస్పీగా పనిచేస్తున్న పి. నరసింహారావుకు అదనపు ఎస్పీగా పదోన్నతి కలిపించి సిటీ స్పెషల్ బ్రాంచి (సీఎస్‌బీ) అదనపు డీసీపీగా నియమించారు. కేంద్ర నేర పరిశోధన విభాగం (సీఐడీ) డీఎస్పీగా పనిచేస్తున్న జి.రామకోటేశ్వరరావుకు అదనపు ఎస్పీగా పదోన్నతి కలిపించి నగర పోలీసు కమిషనరేట్‌లోని పరిపాలన (అడ్మినిస్ట్రేషన్) విభాగం అదనపు డీసీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
వెళ్లేది వీరు...
నగర పోలీసు కమిషనరేట్‌లో అదనపు డీసీపీ(క్రైమ్స్)గా పనిచేస్తున్న వి.గీతాదేవిని విజయవాడ రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి బదిలీ చేశారు. నగర పోలీసు కమిషనరేట్‌లో పనిచేస్తున్న అదనపు డీసీపీ(పరిపాలన) షకీలా భానుకు పోస్టింగ్ ఇవ్వలేదు. ఆమెను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. నగర పోలీసు కమిషనరేట్‌లోని సిటీ స్పెషల్ బ్రాంచ్‌లో ఓఎస్‌డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా పని చేస్తున్న టి.రవీంద్రబాబును బదిలీ చేస్తూ పోస్టింగ్ ఇవ్వకుండా డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలన్నారు.