నరసరావుపేట రూరల్, న్యూస్‌లైన్ : మద్యం మహమ్మారిపై ఆ గ్రామస్తులు కన్నెర్ర చేశారు. పంచాయతీ పాలకులపై ఒత్తిడి తెచ్చారు. గ్రామంలో మద్యనిషేధం అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. గ్రామంలో ఎక్కడా మద్యం అమ్మకాలు జరపటంగానీ, మద్యం సేవించడం గానీ చేయకూడదంటూ పంచాయతీ తీర్మానం చేయించారు. వివరాలివి.. సుమారు ఆరువేల మందికిపైగా జనాభా కలిగిన గ్రామం జొన్నలగడ్డ. గత దశాబ్దన్నర నుంచి గ్రామంలో పుట్టగొడుగుల్లా మద్యం గొలుసు దుకాణాలు పుట్టుకొచ్చాయి. ఎంతోమంది మద్యం మహమ్మారి కోరల్లో చిక్కుకొని విలువైన జీవితాలను అర్ధంతరంగా చాలించారు.
గ్రామంలో వేల రూపాయల మద్యం అమ్మకాలు సాగుతున్నా సంబంధిత అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల నూతనంగా పంచాయతీ పాలకవర్గం ఎన్నికైంది. ప్రజల బాధలను అర్ధం చేసుకున్న పాలకులు గ్రామంలో మద్యం మహమ్మారిని పారదోలేందుకు కంకణం కట్టుకున్నారు. సమావేశాన్ని ఏర్పాటుచేసి తమ పంచాయతీ పరిధిలో మద్యం, బెల్టుషాపులు నడవకూడదని తీర్మానించారు. యథేచ్ఛగా మద్యం సేవించకూడదని, అలాచేస్తే చర్యలు తీసుకుంటామంటూ తీర్మానించారు. జొన్నలగడ్డ శివారు గ్రామం రంగారెడ్డిపాలెంలో 40 ఏళ్లుగా మద్యపాన నిషేధం అమల్లో ఉంది. అలాగే పాలపాడు గ్రామంలో దశాబ్దన్నర నుంచి పూర్తిగా మద్యాన్ని నిషేదించారు. ఆ రెండు గ్రామాలను ఆదర్శంగా తీసుకున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయాన్ని అంతా హర్షిస్తున్నారు.
ప్రజల కోసం తీర్మానం..
మద్యం మహమ్మారి వల్ల గ్రామస్తులు పడుతున్న బాధలు అర్ధం చేసుకున్నాం. మద్యం మహమ్మారిని తరిమికొట్టాలని నిర్ణయించాం. ప్రజలు కూడా సహకరించాలి.
- దొండేటి అప్పిరెడ్డి, సర్పంచి
మహిళలకు సంతోషం..
మద్యానికి బానిసలై అనారోగ్యంతో ఇప్పటికే ఎంతోమంది మృతి చెందారు. కొందరు అప్పులపాలై, అనారోగ్యానికి గురై అవస్థలు పడుతున్నారు. మా గ్రామంలో మద్యపానం నిషేదించడం మహిళలందరికీ సంతోషంగా ఉంది.
- దేవిరెడ్డి రాజ్యలక్ష్మి
మద్యం రక్కసిపై కన్నెర్ర
Published Mon, Nov 4 2013 12:37 AM | Last Updated on Sat, Sep 2 2017 12:15 AM
Advertisement