కలెక్టర్ గారూ.. దత్తత గ్రామాన్ని చూడరూ..!
వైఎస్సార్ జిల్లా: స్వచ్ఛభారత్‌లో భాగంగా జిల్లాస్థాయి నుంచి మండల స్థాయి అధికారుల వరకు ఏదో ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు మండలంలోని మల్లెపల్లె గ్రామ పంచాయతీని అప్పటి కలెక్టర్ కేవీ రమణ దత్తత తీసుకున్నారు.
ఏడాది క్రితం ఆయన దత్తత తీసుకున్న పంచాయతీని ఓ ఒక్కసారి పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి కనీస వసతులపై సర్పంచి నాగిపోగు పెంచలయ్య, ఎంపీటీసీ సభ్యురాలు చిలేకాంపల్లె ఉమాదేవి ఆధ్వర్యంలో మండల స్థాయి అధికారులతో సమీక్షించారు. పంచాయతీ పరిధిలో లింగాలదిన్నెపల్లె, చెంచయ్యగారిపల్లె, ఎద్దులాయపల్లె, మల్లేపల్లె, శ్రీరాంనగర్, ఎస్సీ కాలనీ, ఎస్టీ కాలనీ ఉన్నాయి. తాగునీరు, విద్యుత్, రోడ్లు, మరుగుదొడ్లు తదితర సమస్యలు నెలకొన్నాయి. వీటి పరిష్కారానికి నివేదికలు తయారు చేసివ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఆయన బదిలీపై వెళ్లడంతో కొత్త కలెక్టర్ సత్యనారాయణ దత్తత గ్రామంపై దృష్టిపెట్టాలని పంచాయతీ ప్రజలు కోరుతున్నారు.