అన్నీ ఇస్తున్నా అభివృద్ధి ఏదీ? | collector review on MP adopted village | Sakshi
Sakshi News home page

అన్నీ ఇస్తున్నా అభివృద్ధి ఏదీ?

Published Fri, Jan 26 2018 2:02 PM | Last Updated on Fri, Jul 26 2019 5:58 PM

collector review on MP adopted village - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ కాటంనేని భాస్కర్, పాల్గొన్న అధికారులు

గోపాలపురం: అడిగినవన్నీ ఇస్తున్నా అభివృద్ధి పనులు చేయడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని  కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ అధికారులను నిలదీశారు. గోపాలపురం మండలంలోని రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్‌ దత్తత తీసుకున్న సంజీవపురంలో ఎంపీ, ఎమ్మెల్యేల సమక్షంలో గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కలెక్టర్‌ భాస్కర్‌ మాట్లాడుతూ ఎంపీ దత్తత గ్రామానికి కావాల్సినన్ని నిధులు కేటాయించినా పనులు ఎందుకు పూర్తి చేయలేదని, పనుల్లో అలసత్వం చూపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ నిర్మాణం చేపట్టి మధ్యలోనే వదిలేశారని గిరిజనులు కలెక్టర్‌ దృష్టికి తీసుకురావడంతో పంచాయతీ రాజ్‌ డీఈ డి.సత్యనారాయణ, ఏఈ పి.సీతయ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలరోజుల్లోగా పనులు పూర్తిచేయకుంటే చర్యలు తప్పవన్నారు.

ఎంపీ మాగంటి మురళీమోహన్‌ మాట్లాడుతూ  మూడన్నరేళ్లుగా అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉన్నాయని అధికారుల బాధ్యత తీసుకుని పూర్తిచేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామంలోని అన్ని వర్గాల నాయకులు సమన్వయంతో అభివృద్ధి దిశగా పనిచేయాలని  సూచించారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎంపీ మురళీమోహన్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా దత్తత తీసుకుని అభివృద్ధి చేద్దామని అత్యదిక నిధులు కేటాయించినా పనులు పూర్తిచేయడానికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. నాయకులు అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. సర్పంచ్‌ కురసం మహాలక్ష్మి, ఎంపీటీసీ సభ్యులు కె.దుర్గారావు, ఎంపీపీ గద్దే అరుణకుమారి, జెడ్పీటీసీ సభ్యురాలు ఈలి మోహినీ పద్మజారాణి, ఏఎంసీ చైర్మన్‌ ముమ్మిడి సత్యనారాయణ,  పార్టీ మండల అధ్యక్ష కార్యదర్శులు మేణ్ణి సుధాకర్, ముప్పిడి అశోక్‌కుమార్‌ పాల్గొన్నారు. అనంతరం పెండింగ్‌ పనులు పరిశీలించారు.

బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరి
ఏలూరు (మెట్రో): స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రావాలంటే విద్యార్థులకు బయోమెట్రిక్‌ హాజరుశాతం ఉండాల్సిందేనని కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ చెప్పారు. గురువారం సంక్షేమ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో గతంలో విద్యార్థులు లేకపోయినా ఫీజు రీయిబర్స్‌మెంట్‌ పేరుతో నిధులు దుర్వినియోగమయ్యాయని, దీనిని నివారించేందుకు హాజరు ఆన్‌లైన్‌ విధానాన్ని అమలు చేశామని వెల్లడించారు. జిల్లాలోని 523 కళాశాలల్లో ఫిబ్రవరి 1 నుంచి ఖచ్చితంగా నూరుశాతం బయోమెట్రిక్‌ హాజరు అమలు చేయాలని ఆదేశించారు.

అనంతరం ఎంపీడీఓలు, గృహ నిర్మాణశాఖ ఇంజినీర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఉపాధి హామీ సిబ్బందితో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.  ఇళ్ల నిర్మాణం, మీ కోసం, జన్మభూమి వినతుల పరిష్కారం, బయోమెట్రిక్‌ హాజరు, ఉపాధి హామీ వంటి అంశాలపై  సమీక్షించారు. అంతకుముందు ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన 2కే రన్‌ను కలెక్టర్‌ ప్రారంభించారు. 

పశువుల సంరక్షణకు కేంద్రం
రోడ్డుపై సంచరించే పశువుల సంరక్షణ కోసం ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో రూ.25 లక్షలతో కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా అదనపు జాయింట్‌ కలెక్టర్‌ ఎంహెచ్‌ షరీఫ్‌ చెప్పారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన పశువుల సంరక్షణా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశంలో ఆయన ఈ విషయం వెల్లడించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement