53 మండలాలు.. 93 పంచాయతీలు
53 మండలాలు.. 93 పంచాయతీలు
Published Wed, May 17 2017 10:38 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
పల్లె పిలుపునకు శ్రీకారం
- జిల్లా వ్యాప్తంగా గ్రామాభివృద్ధికి బాటలు
- వెల్దుర్తి మండలం మల్లేపల్లె, కృష్ణగిరిలో పాల్గొన్న కలెక్టర్
- పల్లె బాట పట్టిన జిల్లా అధికారులు
- నీటి సమస్యపై వినతుల వెల్లువ
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పిలుపు కార్యక్రమం బుధవారం జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైంది. 53 మండలాల్లోని 93 గ్రామ పంచాయతీల్లో కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాల్లో వర్షాలు కురవడంతో ఉష్ణోగ్రత కాస్త తగ్గుముఖం పట్టింది. ఈ కారణంగా మొదటి రోజు అధికారులంతా ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. అన్ని శాఖల అధికారులు మండలాలకు స్పెషల్ ఆఫీసర్లుగా హాజరయ్యారు. నియోజకవర్గ ఇన్‌చార్జీలుగా నియమితులైన డిప్యూటీ కలెక్టర్లు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. వెల్దుర్తి మండలం మల్లేపల్లెలో కలెక్టర్ సత్యనారాయణ పల్లె పిలుపును లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గ్రామం మొత్తాన్ని కలియ తిరగడంతో పాటు ఎన్‌ఆర్‌జీఎస్ పనులను, గ్రామ స్థాయిలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలను తనిఖీ చేశారు. గ్రామంలో నెలకొన్న పారిశుద్ధ్య లోపంపై కలెక్టర్ పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యలో బడి మానేసిన విద్యార్థుల గురించి ఆరా తీశారు. గ్రామంలో డ్రాప్ అవుట్స్ ఎవరూ లేరని ఎంఈఓ కలెక్టర్‌కు వివరించారు. అయితే కలెక్టర్ గ్రామంలో తిరుగుతూ మధ్యలో బడి మానేసిన ఒక బాలుడిని గుర్తించి తప్పడు సమాచారం ఇచ్చినందుకు ఎంఈఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం ఆయన మండల కేంద్రమైన క్రిష్ణగిరికి చేరుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ అడిగిన ప్రశ్నలకు మెడికల్ ఆఫీసర్ సరిగ్గా సమాధానాలు ఇవ్వకపోవడంపై ఆగ్రహించారు. పీహెచ్‌సీ నిర్వహణలో లోపాలను గుర్తించారు. ఈ కార్యక్రమాల్లో పల్లె పిలుపు కార్యక్రమ ఉద్దేశాలను జిల్లా కలెక్టర్ వివరించారు. ఇదిలాఉండగా జిల్లా కలెక్టర్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కార్యక్రమాన్ని కల్లూరుతో పాటు వివిధ మండలాల్లో అధికారులు తూతూ మంత్రంగా నిర్వహించినట్లు తెలుస్తోంది. మండల స్థాయిలో ఎంపీడీఓ, తహసీల్దారు ఆధ్వర్యంలో రెండు టీములు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉండగా.. మొదటి రోజు పలు మండలాల్లో ఎంపీడీఓ, తహసీల్దారు కలసి ఒకే టీముగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పల్లెపిలుపు కార్యక్రమంలో భాగంగా ప్రజలు అధికారులకు తమ సమస్యలపై భారీగా వినతిపత్రాలను అందించారు. ప్రధానంగా నీటి సమస్యపై వినతులు వెల్లువెత్తాయి.
Advertisement
Advertisement