కర్నూలు అగ్రికల్చర్ : అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని ఉందన్నట్లు.. నిధులు పుష్కలంగా ఉన్నా, వినియోగించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల వృథా అయ్యే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం విడుదల చేసిన నిధులను సద్వినియోగం చేస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. జిల్లా కలెక్టర్ విజయమోహన్ కూడా నిధులను సద్వినియోగం చేయండని ఒత్తిడి పెంచుతున్నా అధికారుల చెవికెక్కడం లేదు. అధికారుల నిర్లక్ష్యం వల్ల రూ.60 కోట్లు వృథా అయ్యే ప్రమాదం ఏర్పడింది. ఇదీ జిల్లాలో ఐడబ్ల్యూఎంపీ వాటర్ షెడ్ల పరిస్థితి.
జిల్లాలో 2009-10లో మొదటి బ్యాచ్ కింద 58199 హెక్టార్ల అభివృద్ధికి 13 మెగా వాటర్ షెడ్లు మంజూరయ్యాయి. వీటిని 66 గ్రామాల్లో అమలు చేస్తున్నారు. ఇందుకోసం రూ.46.08 కోట్లు విడుదలయ్యాయి. 2010-11లో రెండవ బ్యాచ్ కింద 66133 హెక్టార్ల అభివృద్ధికి 16 మెగా వాటర్ షెడ్లు మంజూరయ్యాయి. మొదటి బ్యాచ్ వాటర్ షెడ్ల కాల పరిమితి 2014 మార్చితోనే పూర్తయింది. నిధులు భారీగా మిగిలిపోవడంతో 2015 మార్చి వరకు పొడిగించారు. రెండవ బ్యాచ్ వాటర్ షెడ్ల గడువు ఈ ఏడాది మార్చి నెలతో పూర్తి కానుంది. మొత్తంగా రెండు బ్యాచ్‌లకు సంబంధించి రూ.101.40 కోట్లు విడుదలయ్యాయి.
కాలపరిమితి మరో 15 రోజుల్లో ముగియనున్నా కేవలం రూ.36.30 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇంకా నిధులు రూ.65.09 కోట్లు మిగిలిపోయాయి. ఈనెల చివరిలోగా రూ.5 కోట్ల వరకు వినియోగించినా రూ.60 కోట్లు నిధులు వృథా(ల్యాప్స్) అయ్యే ప్రమాదం ఏర్పడింది. ఈ నిధులను వినియోగించడానికి మరో ఏడాది కాలం పాటు అవకాశం ఇవ్వాలని జిల్లా యంత్రాంగం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖను కోరింది. ఎలాంటి స్పందన లేకపోవడంతో కనీసం మరో ఆరు నెలలయినా అవకాశం ఇవ్వాలని కోరింది. దీనిపైనా స్పందన లేదు.
గడువు పొడిగించకపోతే రూ.60 కోట్లు వృథా కానున్నాయి. నిధులు వృథా కావడానికి ప్రాజెక్టు ఆఫీసర్లు, టెక్నికల్ ఆఫీసర్ల నిర్లక్ష్యమే కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిధులు భారీగా వృథా అయ్యే పరిస్థితి ఏర్పడటంతో జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కఠిన చర్యలకు సిద్ధం కాగా రెండు నెలలుగా పనులను వేగవంతం చేశారు. అదే సమయంలో అవకతవకలు భారీగానే జరుగుతున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇది మొదటి బ్యాచ్ పరిస్థితి..
మొదటి బ్యాచ్ వాటర్ షెడ్లలో సహజ వనరుల అభివృద్ధికి రూ.34.91 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా కేవలం రూ.16.61 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. పీఎస్‌ఐ కింద రూ.9.07 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా, రూ.70.68 లక్షలు మాత్రమే ఖర్చు చేశారు. మొత్తంగా రూ.46.08 కోట్లు వినియోగించాల్సి ఉండగా, రూ.19.40 కోట్లు ఖర్చు చేశారు. ఆత్మకూరు, జూపాడుబంగ్లా మండలాల్లోని ఇందిరేశ్వరం, తంగడంచె మెగా వాటర్ షెడ్లను వాటర్(డబ్ల్యూఓటీఆర్) అనే స్వచ్ఛంద సంస్థకు అప్పగించారు. ఈ సంస్థ వాటర్‌షెడ్ కార్యక్రమాల నిర్వహణలో అలసత్వం వహిస్తోంది. ఇందిరేశ్వరం ప్రాజెక్టులో కేవలం 34 శాతం, తంగడంచె ప్రాజెక్టులో 21 శాతం మాత్రమే నిధులు విని యోగించారు. ఆళ్లగడ్డ, డోన్, కోడుమూరు, మంత్రాలయం, పత్తికొండ, ఎమ్మిగనూరు మండలాల్లోని ప్రా జెక్టుల నిర్వహణలో అలసత్వం రాజ్యమేలుతోంది.
2వ బ్యాచ్ వాటర్ షెడ్‌ల్లో...
రెండవ బ్యాచ్‌లో 16 మెగా వాటర్ షెడ్లలో 62 గ్రామాల్లోని 66133 హెక్టార్ల అభివృద్ధికి రూ.55.31 కోట్లు విడుదలయ్యాయి. గడువు పూర్తవుతున్నా కేవలం రూ.16.89 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. కౌతాళం మండలంలోని హల్వి ప్రాజెక్టులో 19 శాతం, ఆలూరు మండలం హత్తి బెలగల్ ప్రాజెక్టులో 18 శాతం, నందవరం ప్రాజెక్టులో 31 శాతం, ఆదోని మండలం మండగిరి ప్రాజెక్టులో 23 శాతం, ఉయ్యాలవాడ మండలం మయలూరు ప్రాజెక్టులో 25 శాతం, పత్తికొండ మండలం హోసూరు ప్రాజెక్టులో 21 శాతం, ప్యాపిలి మండలం గుడిపాడు ప్రాజెక్టులో 31 శాతం, కోడుమూరు మండలం గోరంట్ల ప్రాజెక్టు 25 శాతం, నంద్యాల మండలి మిట్నాల ప్రాజెక్టులో 28 శాతం మాత్రమే నిధులు వినియోగించారు. నిధుల వినియోగంలో ప్రాజెక్టు ఆఫీసర్లు తదితరులు ఎంత నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారో దీనిని బట్టి తెలుస్తోంది.
హడావుడితో అక్రమాలు...
వాటర్‌షెడ్ పనుల నిర్వహణపై కలెక్టర్ ఒత్తిడి పెంచడంతో రెండు నెలలుగా పనులు కొంత మేర ఊపందుకున్నాయి. తూతూ మంత్రంగా పనులు చేపట్టి మమ అనిపిస్తున్నారు. ఇదే సమయంలో నిధులు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. కౌతాళం, ఆలూరు, ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, కోసిగి తదితర మండలాల్లో జరిగే వాటర్ షెడ్ కార్యక్రమాల్లో భారీ ఎత్తున అవకతవకలు చోటుచేసుకుంటున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అక్రమాలపై జిల్లా కలెక్టర్ సీహెచ్.విజయమోహన్ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నిధులకు.. విని‘యోగం’ లేదు..
Published Mon, Mar 16 2015 3:32 AM | Last Updated on Sat, Sep 2 2017 10:54 PM
Advertisement