శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేస్తున్న దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు ఇష్టారీతిన మాట్లాడుతుండటంతోపాటు సోషల్ మీడియాలో అబద్దపు ప్రచారం చేస్తూ విషం కక్కుతున్నారని ఆయన కుమార్తె సునీతారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నాన్న చనిపోయిన బాధలో ఉన్న తమను సోషల్ మీడియా ప్రచారంతో మరింత హింసకు గురిచేస్తున్నారన్నారు. ఈ మేరకు శనివారం భర్త రాజశేఖర్‌రెడ్డితో కలసి సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు. వైఎస్ వివేకా ప్రతిష్టను దిగజార్చే లా ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, యూట్యూబ్‌లో నకిలీ కథనాలు ప్రసారం చేస్తున్నారని వాపోయారు. ఇందుకు బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. హైటెక్ సిటీ, గచ్చిబౌలి నుంచి కొందరు సోషల్ మీడియా ద్వారా చేస్తున్న పోస్టులతో కూడిన యూఆర్‌ఎల్‌ఎస్‌లను ఫిర్యాదు కాపీకి జత చేసి ఇచ్చారు. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
సిట్‌ను ప్రభావితం చేస్తున్న బాబు...
వైఎస్ వివేకా హత్యపై సిట్ చేస్తున్న విచారణను ప్రభావితం చేసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని సునీతారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి, కేంద్ర హోం శాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సునీతారెడ్డి, భర్త రాజశేఖర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ ఇంటెలెక్చువల్ ఫోరమ్ కోర్ టీమ్ సభ్యుడు ఎల్‌ఎం సందీప్‌రెడ్డితో రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను శనివారం కలసి ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు తీరు, చంద్రబాబు తప్పుడు ప్రచారాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. హత్య జరిగి వారం రోజులైనా నిందితులు ఎవరనేది తేలలేదన్నారు. తమ కుటుంబసభ్యులను కావాలని టార్గెట్ చేస్తూ అనుమానితుల స్టేట్‌మెంట్లను, మెడికల్ రిపో ర్టులను మార్చే ప్రయత్నం జరుగుతోందని వివరించారు. సిట్ విచారణ నిష్పక్షపాతంగా జరిగే పరిస్థితి లేదన్నారు. ఒత్తిళ్లకు గురికాని ప్రత్యేక సంస్థ ద్వారా విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment