కష్టాల వారధి | VIP Reporter PALASA MLA Gowthu Syamasundara Sivaji | Sakshi
Sakshi News home page

కష్టాల వారధి

Published Sun, Jan 4 2015 4:03 AM | Last Updated on Sat, Sep 2 2017 7:10 PM

కష్టాల వారధి

కష్టాల వారధి

 చుట్టూ సముద్రం.. మధ్యలో పచ్చని తోటలు.. అహ్లాదకరమైన వాతావరణం.. బయటివారికి చూడముచ్చటగా కనిపించే  పూడిలంక గ్రామం అంతరాల్లోకి వెళితే.. తరతరాలుగా అనుభవిస్తున్న అంతులేని వ్యథ కనిపిస్తుంది. గుండెలను పిండేసే దీనగాధలెన్నో కన్నీటి సుడులతో పోటీ పడుతూ ఉబికివస్తాయి. ఉరుము ఉరిమినా.. చినుకు రాలినా.. ఈ గ్రామంతోపాటు మరికొన్ని గ్రామాల ప్రజలు భయంతో గుండెలు చిక్కబట్టుకుంటారు. చిన్న వర్షం వచ్చినా సముద్రపు నీరు పొంగి గ్రామాన్ని రోజుల తరబడి జలదిగ్బంధంలో మగ్గబెట్టేస్తుంది. బయట ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. వజ్రపుకొత్తూరు మండలం పూడి జగన్నాథపురం పంచాయతీ పరిధిలోని ఈ గ్రామం దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్య ఇది. ఉండనా ఊడనా అన్నట్లుండే  వంతెన దాటి గ్రామంలోకి అడుగుపెట్టే అధికారులు, ప్రజా ప్రతినిధులే లేరు. ఇక స్థానికుల సమస్యలు పట్టించుకునే వారెవరు. నేనున్నానంటూ పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ ఆ గ్రామంలోకి అడుగుపెట్టారు. ప్రజాప్రతినిధిగా కాకుండా ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా వెళ్లిన ఆయన అక్కడి ప్రజల సమస్యలను సావకాశంగా విన్నారు. వారి చిరకాల కోరిక అయిన వంతెన నిర్మాణాన్ని ఆరు నెలల్లో పూర్తి చేయిస్తానని తియ్యని కబురు చెప్పారు. గ్రామస్తులతో జరిపిన మాటామంతీ యథాతథంగా...
 
 బొర్ర సరస్వతి(ఉప సర్పంచి): ఊరు పుట్టిన నుంచి రోడ్డు సదుపాయం లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. ముఖ్యంగా గర్భిణులు, చదువుకునే పిల్లలు చాలా బాధపడుతున్నారు. ఈ సమస్య తీర్చాలి.
 శివాజీ: ఈ సమస్య నాకు బాగా తెలుసు. ఒకసారి అప్పటి ఎమ్మెల్యే రేవతీపతితో కలసి తెప్పలో మీ ఊరికి వచ్చాను. అప్పుడు నీటిలో జారిపోవడం కూడా జరిగింది. హుద్‌హుద్ తుపాను పనుల కింద కాలిబాట వంతెన మరమ్మతులకు రూ.10 లక్షలు మంజూరు చేశాం. పనులు కూడా జరగుతున్న విషయం మీకు తెలిసిందే. శాశ్వత వంతెన   కూడా నూతన సంవత్సర కానుక గా ఇస్తున్నాం.
 బి.వీరస్వామి(రైతు): గ్రామంలో సీసీ రోడ్లు, కాలువలు లేక వర్షాకాలంలో వీధులు బురదమయం అవుతున్నాయి. నిర్మాణానికి చర్యలు
 తీసుకోవాలి.
 శివాజీ: ఎంపీ ల్యాడ్స్ నిధులతో మార్చిలోగా సీసీ రోడ్లు, డ్రైన్‌లు నిర్మించేలా చర్యలు తీసుకుంటాను.
 బత్సల హేమలత: గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం లేక గర్భిణులు, బాలింతలు, 3 ఏళ్ల లోపు పిల్లలకు పౌష్టికాహారం అందడం లేదు. అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలి.
 శివాజీ: తప్పకుండా మంజూరు చే యిస్తా. అయితే గర్భిణులు, బాలింతలు, బాలబాలికల సంఖ్య 30 మందికిపైగా ఉండాలి. ఆ వివరాలతో నాకు జాబితా అందించండి. కేంద్రం ఏర్పాటు చేయిస్తాను.
 తిమ్మల క్రిష్ణారావు(మాజీ సర్పంచి): పూడిజగన్నాథపురం గ్రామంలో అంగన్‌వాడీ భవనం లేదు. అద్దె కొంపలో ఉంది. భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి. పాఠశాలను 10వ తరగతి వరకు అప్‌గ్రేడ్ చేయలి.
 శివాజీ: భవనం మంజూరుకు కృషి చేస్తాను. పాఠశాలలో గత మూడేళ్లలో చదువుకున్న విద్యార్థుల వివరాలు ఇస్తే పరిశీలించి 10వ తరగతి వరకు పాఠశాలను అప్‌గ్రేడ్ చేయిస్తాను.
 గుళ్ల చిన్నారావు(మత్స్యకారుడు): చేపల వేట వల్ల మత్స్యకారులకు 50 ఏళ్లకే చూపు మందగిస్తుంది. వలసలు పోతున్నారు. పింఛనుఇచ్చి వలసలు నివారించండి. వారికి రూ.1000 పింఛను మంజూరు చేయాలి. తుపాన్ల వల్ల మత్స్య సంపద నశిస్తోంది. మత్స్య సంపద అభివృద్ధికి కృషి చేయాలి.
 శివాజీ: ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మత్స్య సంపద అభివృద్ధికి కృషి చేస్తాను. దీనిపై శాస్త్రవేత్తలతో సంప్రదింపులు జరుగుతున్నాయి. అధ్యయనం చేసేందుకు త్వరలో బృందాన్ని తీసుకొస్తాం.
 సీహెచ్. భీమారావు(మత్స్యకారుడు): మా గ్రామంలో అంగన్‌వాడీ భవనాలు లేవు. తుపాన్ రక్షిత భవనాలు మరమ్మతులకు గురయ్యాయి. అభివృద్ధి పనులు చేపట్టాలి.
 శివాజీ: మత్స్యకార గ్రామాల్లో దశలవారీగా అంగన్‌వాడీ భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటాను. ఏడాదికొకటి చొప్పున నిర్మిస్తాం. కేంద్ర ప్రభుత్వ నిధులతో తుపాను భవనాలు నిర్మిస్తాం.
 ఆకుల పాపారావు (మత్స్యకారుడు): గ్రామంలో 73 బోట్లు ఉన్నాయి. తుపాన్ల సమయంలో తడిసి పాడవడం వల్ల బాగా నష్టపోతున్నాం. కోల్డ్ స్టోరేజీలు లేక అవస్థలు పడుతున్నాం. చేపలకు గిట్టుబాటు ధర లభించడం లేదు.
 శివాజీ: ఇది ప్రధాన సమస్య. కోల్డ్ స్టోరేజీలు లేక చేపలకు ధర రావడం లేదన్నది నిజమే. విశాఖపట్నంలోని ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తాం. గ్లో సంస్థ ద్వారా సహకరిస్తాం.
 సూరాడ పెంటయ్య: మత్స్యకార ప్రాంతాల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మందులు కొనుగోలు చేయలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.
 శివాజీ: ఈ సమస్య గతంలో నిర్వహించిన ఆరోగ్య శిబిరాల్లోనూ స్పష్టంగా కనిపించింది. ఈ ప్రాంతంలో ఆరోగ్య ఉప కేంద్రం నిర్మించి వైద్యుడిని నియమిస్తాం. మత్స్యకారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యమిస్తాం. ఇది త్వరలోనే కార్యరూపం దాల్చుతుంది.
 దున్న దండాసి: తుపాన్ల సమయంలో వలలు, బోట్లు ధ్వంసమై తీవ్ర నష్టం జరుగుతోంది. అధికారులు వచ్చి చూసి వెళ్లిపోతున్నారు తప్ప న్యాయం జరగడం లేదు. నష్ట పరిహారం చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఫైలీన్, హుద్‌హుద్ తుపాన్ల నష్ట పరిహారం ఇంకా అందలేదు.
 శివాజీ: మత్స్యకారులను అన్ని విధాలా ఆదుకుంటాం. తుపాను పరిహారం విడుదలైంది. లబ్ధిదారుల ఖాతాల్లో దాన్ని జమ చేసేందుకు చర్యలు తీసుకున్నాం. నేను స్వయంగా పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తాను.
 బి.డిల్లీరావు: పూడిజగన్నాథపురం నుంచి-తిమ్మలవానిపేట లింక్ రోడ్డు పాడైంది. నడిచి వెళ్లడానికే అవస్థలు పడుతున్నాం. ఆ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి.
 శివాజీ: నిర్మించాల్సిన లింక్ రోడ్ల వివరాలు పంచాయతీరాజ్ ఇంజనీర్ల ద్వారా సేకరిస్తాం. నిధులు మంజూరైనప్పుడు ఈ గ్రామానికి ప్రాధాన్యత ఇచ్చి మంజూరు చేయిస్తాను. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రావెల్ రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం.
 బత్సల కేశవరావు: మా గ్రామంలో చౌకధరల డిపో లేదు. 69 కుటుంబాలు ఉన్నాయి. రేషన్ సరుకుల కోసం చాలా దూరంలో ఉన్న పల్లివూరు వెళ్లాలి. రేషన్  డిపో మంజూరు చేయించాలి. అందరికీ రేషన్ కార్డులు లేవు. మంజూరు చేయాలి.
 శివాజీ: కుటుంబాల సంఖ్య ఆధారంగా రేషన్ డిపో మంజూరు చేస్తారు. రెవెన్యూ అధికారులతో మాట్లాడి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కోరతాను. వీలున్నంతవరకు మంజూరు చేస్తాం. రేషన్‌కార్డులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వెంటనే అర్హులైన ప్రతి ఒక్కరికీ అందిస్తాం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement