VIP Reporter
-
కష్టాల వారధి
చుట్టూ సముద్రం.. మధ్యలో పచ్చని తోటలు.. అహ్లాదకరమైన వాతావరణం.. బయటివారికి చూడముచ్చటగా కనిపించే పూడిలంక గ్రామం అంతరాల్లోకి వెళితే.. తరతరాలుగా అనుభవిస్తున్న అంతులేని వ్యథ కనిపిస్తుంది. గుండెలను పిండేసే దీనగాధలెన్నో కన్నీటి సుడులతో పోటీ పడుతూ ఉబికివస్తాయి. ఉరుము ఉరిమినా.. చినుకు రాలినా.. ఈ గ్రామంతోపాటు మరికొన్ని గ్రామాల ప్రజలు భయంతో గుండెలు చిక్కబట్టుకుంటారు. చిన్న వర్షం వచ్చినా సముద్రపు నీరు పొంగి గ్రామాన్ని రోజుల తరబడి జలదిగ్బంధంలో మగ్గబెట్టేస్తుంది. బయట ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. వజ్రపుకొత్తూరు మండలం పూడి జగన్నాథపురం పంచాయతీ పరిధిలోని ఈ గ్రామం దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్య ఇది. ఉండనా ఊడనా అన్నట్లుండే వంతెన దాటి గ్రామంలోకి అడుగుపెట్టే అధికారులు, ప్రజా ప్రతినిధులే లేరు. ఇక స్థానికుల సమస్యలు పట్టించుకునే వారెవరు. నేనున్నానంటూ పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ ఆ గ్రామంలోకి అడుగుపెట్టారు. ప్రజాప్రతినిధిగా కాకుండా ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా వెళ్లిన ఆయన అక్కడి ప్రజల సమస్యలను సావకాశంగా విన్నారు. వారి చిరకాల కోరిక అయిన వంతెన నిర్మాణాన్ని ఆరు నెలల్లో పూర్తి చేయిస్తానని తియ్యని కబురు చెప్పారు. గ్రామస్తులతో జరిపిన మాటామంతీ యథాతథంగా... బొర్ర సరస్వతి(ఉప సర్పంచి): ఊరు పుట్టిన నుంచి రోడ్డు సదుపాయం లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. ముఖ్యంగా గర్భిణులు, చదువుకునే పిల్లలు చాలా బాధపడుతున్నారు. ఈ సమస్య తీర్చాలి. శివాజీ: ఈ సమస్య నాకు బాగా తెలుసు. ఒకసారి అప్పటి ఎమ్మెల్యే రేవతీపతితో కలసి తెప్పలో మీ ఊరికి వచ్చాను. అప్పుడు నీటిలో జారిపోవడం కూడా జరిగింది. హుద్‌హుద్ తుపాను పనుల కింద కాలిబాట వంతెన మరమ్మతులకు రూ.10 లక్షలు మంజూరు చేశాం. పనులు కూడా జరగుతున్న విషయం మీకు తెలిసిందే. శాశ్వత వంతెన కూడా నూతన సంవత్సర కానుక గా ఇస్తున్నాం. బి.వీరస్వామి(రైతు): గ్రామంలో సీసీ రోడ్లు, కాలువలు లేక వర్షాకాలంలో వీధులు బురదమయం అవుతున్నాయి. నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి. శివాజీ: ఎంపీ ల్యాడ్స్ నిధులతో మార్చిలోగా సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మించేలా చర్యలు తీసుకుంటాను. బత్సల హేమలత: గ్రామంలో అంగన్వాడీ కేంద్రం లేక గర్భిణులు, బాలింతలు, 3 ఏళ్ల లోపు పిల్లలకు పౌష్టికాహారం అందడం లేదు. అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలి. శివాజీ: తప్పకుండా మంజూరు చే యిస్తా. అయితే గర్భిణులు, బాలింతలు, బాలబాలికల సంఖ్య 30 మందికిపైగా ఉండాలి. ఆ వివరాలతో నాకు జాబితా అందించండి. కేంద్రం ఏర్పాటు చేయిస్తాను. తిమ్మల క్రిష్ణారావు(మాజీ సర్పంచి): పూడిజగన్నాథపురం గ్రామంలో అంగన్వాడీ భవనం లేదు. అద్దె కొంపలో ఉంది. భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి. పాఠశాలను 10వ తరగతి వరకు అప్‌గ్రేడ్ చేయలి. శివాజీ: భవనం మంజూరుకు కృషి చేస్తాను. పాఠశాలలో గత మూడేళ్లలో చదువుకున్న విద్యార్థుల వివరాలు ఇస్తే పరిశీలించి 10వ తరగతి వరకు పాఠశాలను అప్‌గ్రేడ్ చేయిస్తాను. గుళ్ల చిన్నారావు(మత్స్యకారుడు): చేపల వేట వల్ల మత్స్యకారులకు 50 ఏళ్లకే చూపు మందగిస్తుంది. వలసలు పోతున్నారు. పింఛనుఇచ్చి వలసలు నివారించండి. వారికి రూ.1000 పింఛను మంజూరు చేయాలి. తుపాన్ల వల్ల మత్స్య సంపద నశిస్తోంది. మత్స్య సంపద అభివృద్ధికి కృషి చేయాలి. శివాజీ: ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మత్స్య సంపద అభివృద్ధికి కృషి చేస్తాను. దీనిపై శాస్త్రవేత్తలతో సంప్రదింపులు జరుగుతున్నాయి. అధ్యయనం చేసేందుకు త్వరలో బృందాన్ని తీసుకొస్తాం. సీహెచ్. భీమారావు(మత్స్యకారుడు): మా గ్రామంలో అంగన్వాడీ భవనాలు లేవు. తుపాన్ రక్షిత భవనాలు మరమ్మతులకు గురయ్యాయి. అభివృద్ధి పనులు చేపట్టాలి. శివాజీ: మత్స్యకార గ్రామాల్లో దశలవారీగా అంగన్వాడీ భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటాను. ఏడాదికొకటి చొప్పున నిర్మిస్తాం. కేంద్ర ప్రభుత్వ నిధులతో తుపాను భవనాలు నిర్మిస్తాం. ఆకుల పాపారావు (మత్స్యకారుడు): గ్రామంలో 73 బోట్లు ఉన్నాయి. తుపాన్ల సమయంలో తడిసి పాడవడం వల్ల బాగా నష్టపోతున్నాం. కోల్డ్ స్టోరేజీలు లేక అవస్థలు పడుతున్నాం. చేపలకు గిట్టుబాటు ధర లభించడం లేదు. శివాజీ: ఇది ప్రధాన సమస్య. కోల్డ్ స్టోరేజీలు లేక చేపలకు ధర రావడం లేదన్నది నిజమే. విశాఖపట్నంలోని ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తాం. గ్లో సంస్థ ద్వారా సహకరిస్తాం. సూరాడ పెంటయ్య: మత్స్యకార ప్రాంతాల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మందులు కొనుగోలు చేయలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. శివాజీ: ఈ సమస్య గతంలో నిర్వహించిన ఆరోగ్య శిబిరాల్లోనూ స్పష్టంగా కనిపించింది. ఈ ప్రాంతంలో ఆరోగ్య ఉప కేంద్రం నిర్మించి వైద్యుడిని నియమిస్తాం. మత్స్యకారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యమిస్తాం. ఇది త్వరలోనే కార్యరూపం దాల్చుతుంది. దున్న దండాసి: తుపాన్ల సమయంలో వలలు, బోట్లు ధ్వంసమై తీవ్ర నష్టం జరుగుతోంది. అధికారులు వచ్చి చూసి వెళ్లిపోతున్నారు తప్ప న్యాయం జరగడం లేదు. నష్ట పరిహారం చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఫైలీన్, హుద్‌హుద్ తుపాన్ల నష్ట పరిహారం ఇంకా అందలేదు. శివాజీ: మత్స్యకారులను అన్ని విధాలా ఆదుకుంటాం. తుపాను పరిహారం విడుదలైంది. లబ్ధిదారుల ఖాతాల్లో దాన్ని జమ చేసేందుకు చర్యలు తీసుకున్నాం. నేను స్వయంగా పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తాను. బి.డిల్లీరావు: పూడిజగన్నాథపురం నుంచి-తిమ్మలవానిపేట లింక్ రోడ్డు పాడైంది. నడిచి వెళ్లడానికే అవస్థలు పడుతున్నాం. ఆ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి. శివాజీ: నిర్మించాల్సిన లింక్ రోడ్ల వివరాలు పంచాయతీరాజ్ ఇంజనీర్ల ద్వారా సేకరిస్తాం. నిధులు మంజూరైనప్పుడు ఈ గ్రామానికి ప్రాధాన్యత ఇచ్చి మంజూరు చేయిస్తాను. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రావెల్ రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం. బత్సల కేశవరావు: మా గ్రామంలో చౌకధరల డిపో లేదు. 69 కుటుంబాలు ఉన్నాయి. రేషన్ సరుకుల కోసం చాలా దూరంలో ఉన్న పల్లివూరు వెళ్లాలి. రేషన్ డిపో మంజూరు చేయించాలి. అందరికీ రేషన్ కార్డులు లేవు. మంజూరు చేయాలి. శివాజీ: కుటుంబాల సంఖ్య ఆధారంగా రేషన్ డిపో మంజూరు చేస్తారు. రెవెన్యూ అధికారులతో మాట్లాడి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కోరతాను. వీలున్నంతవరకు మంజూరు చేస్తాం. రేషన్‌కార్డులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వెంటనే అర్హులైన ప్రతి ఒక్కరికీ అందిస్తాం. -
రైతులు బాగుంటేనే..
ధాన్యాన్ని అమ్ముకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నాలు. గిట్టుబాటు ధర మాట అటుంచి మిల్లర్ల మాయాజాలంలో నిలువునా దగా పడుతున్నారు. తేమ 17 శాతం మించకూడదన్న నిబంధన.. ధాన్యం అమ్మిన 48 గంటలు దాటినా సొమ్ము జమ కాకపోవడంతో రైతులు మిల్లర్లను ఆశ్రయిస్తున్నారు. తక్కువ ధరకే ధాన్యాన్ని వారికి విక్రయిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో వరి ఆరబోత యంత్రాలు, టార్పాలిన్ల కొరత, రవాణా తదితర విషయూల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐకేపీ కేంద్రాల్లో ట్రక్ షీట్. బ్యాంకు ఖాతాలు, ఆధార్ వివరాల నమోదులో తప్పులు దొర్లుతున్నాయి. దీంతో బ్యాంకుల నుంచి సొమ్ములు రైతుల ఖాతాలకు జమ కావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొవ్వూరు రెవెన్యూ డివిజినల్ ఆఫీసర్ (ఆర్డీవో) బి.శ్రీనివాసరావు ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకునేందుకు ఆయన ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మారారు. దొమ్మేరులోని కొనుగోలు కేంద్రానికి వెళ్లి రైతులతో మాట్లాడారు. మిల్లర్లు వద్ద తేమ శాతం నిర్ధారణలో వ్యత్యాసాలు నమోదవుతున్నట్టు గుర్తించి ఓ రైస్‌మిల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులు బాగుంటేనే మనమంతా బాగుంటామని అన్నారు. రైతులు, ఐకేపీ మహిళలు, మిల్లర్‌తో ఆర్డీవో ఇంటర్వ్యూ ఇలా సాగింది. ఆర్డీవో : నేను ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా వచ్చాను. గతంలో ఇక్కడి రైతులు ధాన్యం ఎవరికి అమ్మేవారు. క్వింటాల్‌కు రేటు ఎలా ఉండేది. రైతులు : వ్యాపారులకు అమ్మేవాళ్లం. ఆరుదల ధాన్యానికి రూ.వెయ్యి, పచ్చి ధాన్యం అయితే రూ.850-860 మధ్య వచ్చేది. ఆర్డీవో : అప్పటికీ, ఇప్పటికీ రేటు విషయంలో మార్పు ఉందా. జుజ్జవరపు నాగేశ్వరరావు : మార్పు ఏమీ లేదండి. డబ్బులు వెంటనే వచ్చేస్తాయన్న భ్రమతో ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో అమ్మాం. గత నెల 22న అమ్మితే ఇప్పటికీ డబ్బులు రాలేదు. ఆర్డీవో : మీ సమస్యను ఎవరికి తెలియజేశారు. నాగేశ్వరరావు : ఎవరికి చెప్పాలో తెలియక ధాన్యం కొనుగోలు కేంద్రం చుట్టూ తిరుగుతున్నాం సార్. ఆర్డీవో : రండి.. ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్లి వివరాలు తెలుకుందాం. ఇక్కడ కొనుగోలు కేంద్రం ఇన్చార్జి ఎవరు? ఎంత ధాన్యం కొనుగోలు చేశారు? పద్మావతి : నేనే సార్. ఇప్పటి వరకు 177 మంది రైతుల నుంచి 2,357 టన్నుల ధాన్యం కొన్నాం. ఆర్డీవో : ఇంకా ఎంతమందికి సొమ్ములు చెల్లించాలి పద్మావతి : ట్రక్ షీట్లో తప్పులు ఉన్నాయని 20 మందికి బ్యాంకు నుంచి డబ్బులు చెల్లించలేదు. ఆర్డీవో : గతనెల 22న ధాన్యం అమ్మిన రైతు నేటికీ సొమ్ము అందలేదంటున్నారు. దీనిపై ఎలాంటి చర్య తీసుకున్నారు. పద్మావతి : ట్రక్ షీట్లో తప్పులను సరిచేయించి పంపించాం సార్. ఆర్డీవో : వెంటనే లోపాలు సవరించి సొమ్ములు అందని రైతులందరికీ ఒకట్రెండు రోజుల్లో డబ్బు అందించండి. కలగర రాధాకృష్ణ ప్రసాద్, రైతు : ఐకేపీ కేంద్రం ద్వారా 40 బస్తాల ధాన్యం కొవ్వూరు మిల్లుకు పంపాం. క్వింటాల్‌కు ఐదు కిలోల చొప్పున 65 కేజీలు తరుగు కింద తగ్గించారు. ఆర్డీవో : ఈ విషయూన్ని సివిల్ సప్లైస్ అధికారుల ద్వారా తహసిల్దార్ దృష్టికి తీసుకువెళ్లారా? పద్మావతి : ఈ సమస్య మాకు ఇప్పుడే తెలిసింది సార్. అబ్బాయిరాజు, రైతు : ఎక్కువ ధాన్యం ఉంటే కళ్లాల నుంచే సేకరిస్తామని చెప్పారు గానీ అమలు కావడం లేదు. లోడింగ్, అన్లోడింగ్ , రవాణా చార్జీల భారం రైతులపైనే పడుతోంది సార్. ఆర్డీవో : కళ్లాల నుంచే ధాన్యాన్ని నేరుగా సేకరిస్తామని ఫ్రభుత్వం చెప్పింది. ఎక్కువ ధాన్యం ఉంటే రవాణా ఖర్చులను ప్రభుత్వమే భరిస్తోంది. రైతులు రవాణా నిమిత్తం ఖర్చు చేసిన చార్జీల బిల్లులను కొనుగోలు కేంద్రానికి లేదా తహసిల్దార్‌కు పంపించాలి. వాటిని సివిల్ సప్లైస్ డీఎం కార్యాలయానికి పంపి బిల్లులు ఇప్పిస్తాం. నాగేశ్వరరావు, రైతు : మిల్లర్లు అన్లోడింగ్ చార్జీల కింద బస్తాకు రూ.20 చొప్పున వసూలు చేస్తున్నారు. ధాన్యం వెనక్కి తీసుకురాలేని పరిస్థితుల్లో దిగుమతి కూలీ చెల్లించాల్సి వస్తోంది. రైతుకు లోడింగ్, అన్లోడింగ్ చార్జీలు భారమవుతున్నాయి. ఇతర రైతులు : తేమశాతం పేరుతో మిల్లర్లు మోసగిస్తున్నారు. ఇక్కడ 17 తేమ శాతం వస్తే మిల్లు దగ్గరకు వెళితే 19 నుంచి 21 శాతం తేమ ఉందని తప్పుడు లెక్కలు చూపించి ఇబ్బందులు పెడుతున్నారు. బస్తాకు రూ.80 నుంచి రూ.100 త గ్గిస్తున్నారు. ఆర్డీవో : కొందరు మిల్లర్లు తేమ శాతం ఎక్కువ చూపించి రైతులను మోసగిస్తున్నారన్న విషయం నా దృష్టికి వచ్చింది. ఈ రకమైన సమస్యలుంటే వెంటనే తహసిల్దార్‌కు ఫిర్యాదు చేయండి. ఆర్డీవో : జెడ్పీటీసీ గారూ.. మీ ఊళ్లో ధాన్యం కొనుగోళ్లు ఎలా సాగుతున్నాయండి. గారపాటి శ్రీదేవి, జెడ్పీటీసీ : మిల్లర్లు రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. తరుగు, రవాణా చార్జీలను రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. రైతుకు ఎక్కడా న్యాయం జరగడం లేదు. పొలం నుంచే నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తే రైతుకు లాభం చేకూరుతుంది. అక్కడి నుంచి ఆర్డీవో శ్రీనివాసరావు సమీపంలోని విజయదుర్గా రైస్ మిల్లుకు వెళ్లారు. మిల్లర్‌ను ఉద్దేశించి... ఆర్డీవో : మీ పేరు చెప్పండి. రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేసిన వివరాలను నమోదు చేస్తున్నారా. మిల్లర్ : నా పేరు వట్టికూటి సత్యనారాయణ సార్. ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు నేరుగా చెక్కులు అందిస్తున్నాం. వివరాలు నమోదు చేయడం లేదు. ఆర్డీవో : నేరుగా సేకరించిన ధాన్యంలో 25 శాతం లెవీ కింద ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఏ రైతు నుంచి ఎంత ధాన్యం సేకరిస్తున్నాం, రకం ఏమిటి, రైతు సాగు చేస్తున్న విస్తీర్ణం, రైతుకు ఇచ్చిన మద్దతు ధర తదితర వివరాలు కచ్చితంగా నమోదు చేయాలి. సత్యనారాయణ, మిల్లర్ : ఇక నుంచి నమోదు చేయిస్తాం సార్. ఆర్డీవో : ఐకేపీ కేంద్రంలో చూపించిన తేమ శాతానికి మిల్లర్ల వద్ద చూపిస్తున్న తేమ శాతానికి వ్యత్యాసాలు వస్తున్నాయని రైతులు, ఐకేపీ మహిళలు చెబుతున్నారు. ఎందుకు తేడా వస్తోంది. సత్యనారాయణ : శాంపిల్ తీసుకువచ్చే విధానంలో లోపాలు ఉంటాయి. శాంపిల్‌ను గాలి తగలకుండా పాలిథిలిన్ కవర్లో పెట్టి జాగ్రత్తగా తీసుకురావాల్సి ఉంటుంది. మెషిన్‌కు మెషిన్‌కు మధ్య కూడా వ్యత్యాసాలు ఉంటారుు. తేమ శాతం స్వల్పంగా తేడా ఉన్నా ధాన్యం కొంటున్నాం సార్. ఆర్డీవో : గతంలో ఎక్కువ కొనుగోలు చేసేవారా.. ఇప్పుడు ఎక్కువ కొనుగోలు చేస్తున్నారా.. ప్రస్తుతం విధానం ఎలా ఉంది. సత్యనారాయణ : ఇప్పుడే బాగుంది సార్. బ్యాంకు గ్యారంటీ కూడా లభిస్తోంది. ఐకేపీ కేంద్రం నుంచి ధాన్యం శాంపిల్ తీసుకొచ్చిన ఆర్డీవో.. ఇందులో తేమశాతం 18.3 శాతం ఉన్నట్టు ఐకేపీ కేంద్రంలో వచ్చిందని, మిల్లులో ఎంత వస్తుందో చూద్దామని మిల్లర్‌తో అన్నారు. మిల్లర్ సత్యనారాయణ ఆ శాంపిల్‌ను తేమ శాతం మెషిన్లో ఉంచి పరిశీలించగా 14.8 తేమ శాతం వచ్చింది. ఆర్డీవో సహా అక్కడి వారంతా అవాక్కయ్యారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ రైతుల విషయంలో ఐకేపీ గ్రూపులు, మిల్లర్లు నిజారుుతీతో వ్యవహరించాలని కోరారు. రైతులు బాగుంటుందనే మనం బాగుంటామని అన్నారు. -
చలించి...స్పందించి
గరుగుబిల్లి మండల కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న తోటపల్లి పంచాయతీ నందివానివలస గ్రామమది. అక్కడ 280 గడపలున్నాయి. 320 కుటుంబాల్లో 1350 మంది నివసిస్తున్నారు. నిర్వాసిత గ్రామమైన ఈ ఊరు... కూలిన పెంకుటిళ్లు, ధ్వంసమైన రోడ్లు, శిథిలమైన పాఠశాల భవనం, సమస్యలతో పోరాడలేక నీరసించిన జనంతో దయనీయంగా మారింది. నాగావళికి వ రదలొచ్చినప్పుడు రోజుల తరబడి జలదిగ్బంధంలో చిక్కుకుంటుంది. పంటపొలాల్లోంచి బురదనీరు గ్రామంలోకి ప్రవేశిస్తుండడంతో వీధులన్నీ చెమ్మగా మారిపోతాయి. నందివానివలసతో పాటు తోటపల్లి గ్రామంలో కూడా అడుగడుగునా సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఆయా గ్రామాల ప్రజల ఇక్కట్లను ప్రత్యక్షంగా చూసి, వారి బాధలు వినేందుకు కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి, సాక్షి తరఫున వీఐపీ రిపోర్టర్‌గా మారారు. వారి కష్టాలు విని చలించిపోయారు. సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పాముల పుష్ప శ్రీవాణి: నమస్తే... నాపేరు పాముల పుష్ప శ్రీవాణి. నేను మీ నియోజకవర్గ ఎమ్మెల్యేను. మీ సమస్యలు తెలుసుకోవడానికి ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్‌గా వచ్చాను. పుష్ప శ్రీవాణి: బాబు నీ పేరు ఏమిటీ.. సమస్య ఏంటీ ? సతీష్‌కుమార్ : మేడమ్.. నా పేరు సతీష్‌కుమార్, మా ఊర్లో 18 ఏళ్లు నిండిన యువకులకు పునరావాస ప్యాకేజీ మంజూరు చేయలేదు? మా కన్నా ముందు నిర్వాసిత గ్రామాలుగా ప్రకటించిన ఊళ్లలో వారికి ప్యాకేజీని ప్రభుత్వం మంజూరు చేసింది. ఎందుకు ప్రభుత్వం వివక్ష చూపించిందో తెలియడం లేదు? పుష్పశ్రీవాణి: ఈ విషయాన్ని ఉన్నతాధికారులతో చర్చించి చలించి...స్పందించి తగున్యాయం చేస్తాను. పుష్పశ్రీవాణి: అమ్మా...నీ పేరేంటి, నీ సమస్య ఏంటి ? ఒమ్మి త్రినాథమ్మ: నా పేరు త్రినాథమ్మ, అసలు మాట దేవుడు ఎరుగు, వడ్డ్డీలు తడిసిమోపుడవుతున్నాయి. డ్వాక్రా రుణాలు తీర్చే మార్గం కనిపించడంలేదు. మీరే సమస్యపరిష్కరించాలి. పుష్పశ్రీవాణి: ఈవిషయమై ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తోంది. పుష్ప శ్రీవాణి : ఎలా ఉన్నారు, మీ పేర్లేంటి ? గొల్లు మహాలక్ష్మి: నాపేరు మహాలక్ష్మి , 70 ఏళ్లు నిండినా పింఛన్ మంజూరు కాలేదు. ఎన్నిసార్లు దరఖాస్తులు చేసినప్పటికీ పట్టించుకోవడంలేదు. రెడ్డి పోలమ్మ: నా పేరు పోలమ్మ, భూమి ఎక్కువుగావుందని మూడు నెలలనుంచి పింఛను నిలిపేశారు. కొడుకులు కూడా పట్టించుకోవడం లేదు. నేను ఎలా బతకాలమ్మ ? పుష్పశ్రీవాణి: అధికారులతో చర్చించి పింఛన్ మంజూరుకు కృషిచేస్తాను. పుష్ప శ్రీవాణి : నీ సమస్య ఏంటి ? గొర్లి శంకర్: మేడమ్.... మేము ఎస్టీ నిరుపేద కుటుంబానికి చెందినవారిమండి, మాకు అంత్యోదయ కార్డుకూడా మంజూరు చేయడంలేదు. పుష్పశ్రీవాణి: కొత్తగా రేషన్‌కార్డులు మంజూరు చేసిన సమయంలో అంత్యోదయ కార్డు వచ్చేలా అధికారులతో మాట్లాడతాను. పుష్పశ్రీవాణి: ఏంటమ్మా ఏమైనా సమస్యలున్నాయా ? అంపెల్లి గంగమ్మ: గ్రామంలో కుళాయికూడా లేదు మేడమ్. పుష్పశ్రీవాణి: నందివానివలస నిర్వాసిత గ్రామం కావడంతో ప్రభుత్వం రక్షిత పథకాలను మంజూరు చేయడం లేదు. పునరావాసం కల్పించిన తరువాత కుళాయి ఏర్పాటు చేస్తాం. పుష్పశ్రీవాణి: మీ పేర్లేంటి, ఎంటి మీ సమస్య ? మరడాన అప్పలనాయుడు: మేడమ్ నా పేరు అప్పలనాయుడు. పునరావాసం కల్పించేందుకు అధికారులు పట్టించుకోవడంలేదు. గ్రామానికి మూడేళ్ల క్రితం పునరావాసానికి సంబంధించిన ప్యాకేజీను ఇచ్చారు. కానీ ఇంతవరకు పునర్నిర్మాణం కోసం స్థల సేకరణ కూడా చేయలేదు. ఉన్న ఇళ్లు కూడా కూలిపోతున్నాయి. మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోవడంలేదు. రెడ్డి హరికృష్ణ: నాపేరు హరికృష్ణ మేడమ్. ఈ ఊళ్లో ఎలా బతకాలో తెలియడంలేదు. ఉన్న ఇళ్లు కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. నిత్యం అరచేతిలో ప్రాణాలను పెట్టుకొని జీవిస్తున్నాం. ఇళ్ల మరమ్మతులు కూడా చేసుకోలేని స్థితిలోవున్నాం. రెడ్డి సత్యనారాయణ: ఇళ్ళుపెచ్చులూడిపోతున్నాయి. అధికారులు పట్టించుకోవడంలేదు. వర్షాలువస్తే నరకం చూస్తున్నాం. పుష్పశ్రీవాణి: పునరావాసంపై పార్వతీపురం సబ్‌కలెక్టర్‌తో ఇప్పటికే పలుమార్లు చర్చించాను. మళ్లీ మరోసారి చర్చించి గ్రామానికి పునరావాసం కల్పించేందుకు చర్యలు చేపడతాను. పుష్పశ్రీవాణి: మీ సమస్య ఏంటి ? కర్రి ఎల్లంనాయుడు: నాపేరు ఎల్లంనాయుడండి...వరదనీరు గ్రామంలోకి చొచ్చుకొస్తుంది. మురుగు చేరడంతో వ్యాధులు బారినపడుతున్నాం. అధికారులకు చెప్పినప్పటికీ పట్టించుకోవడంలేదు. పుష్పశ్రీవాణి: ఇంజినీరింగ్ అధికారులతో చర్చించి గ్రామంలోకి వరదనీరు రాకుండా పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు చర్యలు చేపడతాను. పుష్ప శ్రీవాణి : చెప్పండమ్మ... నీ సమస్య ఏంటమ్మ ? గొల్లు ధనుంజయమ్మ: ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నభోజనం తయారీకి వంటశాల లేకపోవడంతో ఆరుబయటే వంటలను చేస్తున్నాం. వర్షాలు వచ్చినప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. పుష్పశ్రీవాణి: వంటశాల నిర్మాణానికి ఉన్నతాధికారులతో చర్చిస్తాను. పుష్పశ్రీవాణీ: మీ ఊరికి వచ్చే వంతెన ప్రమాదకరంగా ఉంది... ఎప్పటి నుంచి ఇలా ఉంది ? రొక్కలి సత్యనారాయణ: ఏళ్ల తరబడి దీని పరిస్థితి ఇలాగే ఉంది. ఎంత మంది అధికారులు, నాయకులకు చెప్పినా సుఖం లేదు.. తరచూ చాలా మంది వంతెన మీద నుంచి పడిపోతున్నారు. అదృష్టవశాత్తు ప్రాణాలు మిగులుతున్నాయి. పుష్పశ్రీవాణీ: చెప్పమ్మా.. ఏమిటీ సమస్య. లలిత: అమ్మా! రుణమాఫీ అన్నారు. డబ్బులు రాలేదు సరికదా, మా పొదుపు డబ్బులు ఇరిపేస్తున్నారు. పార్వతి: బ్యాంకులకు వెళితే నోటీసులు ఇస్తామంటున్నారు. పుష్పశ్రీవాణీ: చంద్రబాబు మాటలు నమ్మి అధికారం ఇస్తే ఇలాగైందన్న బాధ ఇప్పుడు అందరిలో ఉంది. ప్రతీ పైసా మాఫీ అయ్యే వరకూ మీకు అండగా ఉంటాం. పుష్పశ్రీవాణీ: మీ ఇబ్బంది ఏంటమ్మ...? చంద్రమ్మ : నా భర్త చనిపోయి రెండేళ్లు అయ్యింది.. అయినా ఇప్పటివరకూ వితంతు పింఛను ఇవ్వకుండా తిప్పుతున్నారు.. పుష్పశ్రీవాణీ: జన్మభూమిలో దరఖాస్తు పెట్టినా ఇవ్వడం లేదా... సమస్య పరిష్కారానికి కృషి చేస్తాను. అప్పయ్యమ్మ: అమ్మా... నాకు చేతులు పనిచేయవు, కళ్లు కనిపించవు., అయినా పింఛను ఇవ్వడం లేదు., పుష్పశ్రీవాణీ : ఏం, ఎందుకని ఇవ్వడం లేదు.. అప్పయమ్మ: అధికారులు ఇచ్చిన సర్టిఫికేట్లో 20 శాతం అంగవైకల్యం ఉందని రాశారు. అందుకే ఇవ్వడం లేదట పుష్పశ్రీవాణీ: లేదు.. ఇక్కడ సదరంలో ధ్రువీకరించి పింఛను వచ్చేటట్టు చేస్తాను పుష్పశ్రీవాణీ: చెప్పండమ్మా ... మీ సమస్య ఏంటి? పెదపెంకి రమణ, లక్ష్మి: అమ్మా మాకు రేషను కార్డులు లేవని బంగారుతల్లి పథకం ఇవ్వడం లేదు..చాలా ఇబ్బందిగా ఉంది పుష్పశ్రీవాణీ: రేషను కార్డు వచ్చేలా చేస్తా...అలాగే మీ గ్రామంలో సమస్యల పరిష్కారాని ప్రయత్నిస్తాను. మళీ కలుద్దాం...