సాక్షి, అమరావతి: ఉపాధి, ఉద్యోగాల కోసం నగరాలకు వలసపోయే సామాన్య, పేద వర్గాలు ముందుగా అడిగేది అక్కడి ప్రజల జీవన వ్యయం (కాస్ట్ ఆఫ్ లివింగ్) గురించే. జీవనవ్యయం ఎక్కువగా ఉన్న నగరాల్లో వచ్చే జీతంలో మూడోంతులు ఖర్చులకే పోతుంటే.. ఇక పేదవాడి కష్టాలు చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని 352 నగరాల్లో ప్రజల జీవన వ్యయంపై ‘నంబియో’ సంస్థ నిర్వహించిన సర్వేలో మన రాష్ట్రానికి చెందిన విజయవాడ, విశాఖపట్నంలలో తక్కువ జీవన వ్యయంతో సామాన్యుడికి అందుబాటులో ఉన్నాయని తేలింది. మన దేశంలోని నగరాల్లో జీవన వ్యయం అంతకంతకూ పెరుగుతున్నా, ప్రపంచంలోని ఇతర నగరాలతో పోల్చినప్పుడు సామాన్యుడికి కాస్త అందుబాటులో ఉన్నట్లు నివేదికలో వెల్లడైంది. నివేదికలో విజయవాడ, విశాఖపట్నం నగరాలకు 350, 351 ర్యాంకులు దక్కగా.. ముంబై 316, ఢిల్లీ 323, బెంగుళూరు 327, పూణె 328, హైదరాబాద్ 333, చెన్నై 334, కోల్‌కతాలు 336 ర్యాంకుల్లో నిలిచాయి. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్, బేసల్, లాసన్నె, జెనీవా, బెర్న్ నగరాలు అత్యధిక జీవన వ్యయంతో జాబితాలో మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి.
విశాఖ నగరం
ఎలా అంచనా వేశారు?
న్యూయార్క్ నగర జీవన వ్యయం ప్రాతిపదికగా ఇతర నగరాల స్థాయిని నిర్ణయించారు. ఇందుకోసం నిత్యవసర వస్తువులు, ఆభరణాల ధరలు, రెస్టారెంట్లలో రేట్లు, రవాణా, ఇతర అవసరాల ధరల్ని లెక్కించి న్యూయార్క్ నగరం సూచీని వందగా అంచనా వేశారు. ఆ ధరల్ని ఇతర నగరాల ధరలతో పోల్చి ర్యాంకింగ్ నిర్ధారించారు. ఉదాహరణకు జెనీవా ధరలను న్యూయార్క్‌తో పోల్చగా.. సూచీ 121 శాతంగా వచ్చింది. అంటే జెనీవాలో న్యూయార్క్ కంటె జీవన వ్యయం 21 శాతం ఎక్కువ. పారిస్ నగరం ఇండెక్స్ 85 శాతం కాగా న్యూయార్క్ కంటే అక్కడ 15 శాతం తక్కువగా జీవనవ్యయం ఉన్నట్లు లెక్కించారు. విజయవాడ, విశాఖపట్నంలో సూచీలు 21.64, 21.21 శాతంగా ఉండడంతో న్యూయార్క్ కంటే ఈ రెండు నగరాల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ 78.36, 78.79 శాతం తక్కువ ఉందని తేల్చారు.
అద్దెల్లో మాత్రం రివర్స్
విజయవాడలో జీవన వ్యయం తక్కువగా ఉన్నా అద్దెల్లో ఎక్కువగా ఉన్నాయి. అద్దెల్లో విజయవాడ సూచీ 5.01 శాతంగా ఉండగా.. విశాఖ నగరానికి 4.07గా వచ్చింది. లక్నో, సూరత్, భోపాల్, భువనేశ్వర్, మైసూర్, కోయంబత్తూర్, జైపూర్ నగరాల్లో అద్దె విజయవాడలో కంటే తక్కువగా ఉంది.
ఇక్కడి వరకూ ఇదే ఎక్కువ
అంతర్జాతీయ స్థాయిలో మన నగరాల్లో జీవన వ్యయం తక్కువున్నా, ఇక్కడి పరిస్థితులతో పోల్చితే అది చాలా ఎక్కువ. పేదలకు ఈ నగరాలు అందుబాటులో లేవు.
–డాక్టర్ రామనాథ్ ఝా, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ రీసెర్చ్ ఫెలో
Comments
Please login to add a commentAdd a comment