
అశోక్‌నగర్‌లో ప్రభుత్వ స్థలాల్లో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలు
సాక్షి, విశాఖపట్నం: క్రమబద్ధీకరించేందుకు అవకాశం లేకున్నప్పటికీ ఎక్కడైనా కొండవాలు ప్రాంతం కనిపిస్తే చాలు కబ్జా చేయడం... ప్లాట్లు వేసి అమ్మేయడం... సొమ్ము చేసుకోవడం అధికార టీడీపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్యలా మారింది. గడిచిన మూడేళ్లలో 296, 118జీవోల ప్రకారం క్రమబద్ధీకరించిన వాటిలో అత్యధికం కొండవాలు ప్రాంతాల్లోని ఆక్రమణలే. ఇవన్నీ అభ్యంతరకర భూముల్లో ఉన్నవే. వీటిని క్రమబద్ధీకరించే అవకాశం లేకున్నప్పటికీ అడ్డగోలుగా రెగ్యులరైజ్ చేసేశారు. అంతటితో ఆగకుండా సిటీ పరిధిలోని కొండలపై నిర్మాణానికి అనువుగా ఉండే ప్రాంతాలను కబ్జా చేయడం.. అమ్మేసుకోవడం.. ఎలాంటి అనుమతుల్లేకుండా నిర్మించేసుకోవడం అధికార పార్టీ నేతలకు అలవాటుగా మారి పోయింది. ఎవరైనా పొరపాటున పొరుగు జిల్లాల నుంచి వలస వచ్చి కొండవాలు ప్రాంతాల్లో కాసింత జాగాలో పూరిపాక వేసుకుంటే చాలు అధికారుల ద్వారా వాటిని పునాదులతో సహా కూలగొట్టే వరకు వదలడం లేదు. ఈ తరహా కబ్జాలు.. ఆక్రమణలు విశాఖ తూర్పు, పశ్చిమ, గాజువాక నియోజకవర్గాల్లో జోరుగా సాగుతున్నాయి.
గాజువాక పరిధిలో...
గాజువాక నియోజకవర్గ పరిధిలోని పెదగంట్యాడ ప్రాంతంలోని రెవెన్యూ కొండపై ఏకంగా ఎకరా 50 సెంట్ల ప్రభుత్వ భూమిని స్థానిక ప్రజాప్రతినిధి అండదండలతో టీడీపీ నేతలు కబ్జా చేసి గుట్టుగా అమ్మకాలు సాగిస్తున్నారు. ఆ స్థలాల్లో అనుమతుల్లేకున్నప్పటికీ దగ్గరుండి మరీ నిర్మాణాలు సాగిస్తున్నారు. అశోక్‌నగర్‌లో సర్వే నంబర్ 274లో ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలు, అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. ఇక్కడ సాగుతున్న ఆక్రమణలు, అక్రమ కట్టడాలపై స్థానికులు ఫిర్యాదు చేయగా లోకాయుక్తలో సైతం 2016 సెప్టెంబర్ 22న కేసు నమోదైంది. లోకాయుక్త ఆదేశాలతో రెవెన్యూ అధికారులు కొంతమేర ఆక్రమణలు తొలగించారు. తాజాగా టీడీపీ ప్రజాప్రతినిధి ఒత్తిళ్లు, పెద గంట్యాడ తహసీల్దార్ ప్రోద్బలంతో కొంతమంది వ్యక్తులు మళ్లీ ఆక్రమణలు... అక్రమ కట్టడాలకు తెరతీశారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ప్లాట్లుగా విభజించి మరీ అమ్మేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిపిస్తున్నారు.
ఇటీవల ఈ నిర్మాణాలకు అనుమతులున్నాయా? లేదో తెలుసుకునేందుకు సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేస్తే కనీస సమాచారం ఇచ్చిన పాపన పోలేదు. దీంతో స్థానికులతో కలిసి ఈ ఆక్రమణలు, అక్రమకట్టడాలపై గడిచిన మూడు నెలల్లో మూడుసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఉన్నప్పుడు ఫిర్యాదు చేయగా.. వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా తహసీల్దార్‌ను ఆదేశించారు. కానీ రాజకీయ ఒత్తిళ్లతో స్థానిక రెవెన్యూ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను జీవో నంబర్ 388 ద్వారా క్రమబద్ధీకరించుకునే అవకాశం ఉండడం అధికార టీడీపీ నేతలకు వరంగా మారింది. ఈ జీవో ద్వారా క్రమబద్ధీకరిస్తామని నమ్మజూపుతూ అమ్మకాలు సాగిస్తున్నారు. ఇదే తరహాలో సర్వే నంబర్ 274లో సుమారు 1.50ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ప్లాట్లుగా వేసి అమ్మేస్తున్నారు. 388 జీవో ప్రకారం క్రమబద్ధీకరించేస్తామంటూ నమ్మ జూపుతున్నారు. పైగా అనుమతుల్లేకుండా నిర్మాణాలు చేసుకునేందుకు నేతలే అధికారిక అనుమతులు ఇచ్చేస్తు న్నారు.
తహసీల్దార్ అండదండలతోనే అమ్మకాలు
సర్వే నంబర్ 274లో ప్రభుత్వ స్థలాన్ని ప్లాట్లుగా వేసి అమ్మేయడంతోపాటు అక్రమ నిర్మాణాల వెనుక రెవెన్యూ అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. స్థానిక తహసీల్దార్ ప్రోద్భలంతోనే ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. తక్షణమే నిర్మాణాలను నిలుపుదుల చేసి ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.
– కింతాడి రాజశేఖర్, ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి
అక్రమ నిర్మాణాలు నా దృష్టికి రాలేదు
అవి ప్రభుత్వ భూములే..కానీ అక్కడ నిర్మాణాలు జరుగుతున్నట్టుగా నా దృష్టికి రాలేదు. ఎవరు తీసుకురాలేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం.
–పార్వతీశ్వరరావు, తహసీల్దార్, పెదగంట్యాడ
Comments
Please login to add a commentAdd a comment