మాటల్లేవ్!... మాట్లాడుకోడాలు లేవ్! | visakhapatnam tdp leaders group politics | Sakshi
Sakshi News home page

మాటల్లేవ్!... మాట్లాడుకోడాలు లేవ్!

Published Sat, Feb 7 2015 8:36 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM

మాటల్లేవ్!... మాట్లాడుకోడాలు లేవ్! - Sakshi

మాటల్లేవ్!... మాట్లాడుకోడాలు లేవ్!

ఇక తాడో!... పేడో!

పతాకస్థాయికి టీడీపీ వర్గపోరు
గంటావర్గంపై అయ్యన్న వర్గం ఎదురుదాడి
గంటా, ఆడారిలపై గవిరెడ్డి తీవ్ర అవినీతి ఆరోపణలు
సీబీఐ విచారణకు డిమాండ్


మాటల్లేవ్!... మాట్లాడుకోడాలు లేవ్!

ఇక పోట్లాటే అన్నస్థాయికి చేరుకుంది జిల్లా టీడీపీలో వర్గపోరు. మంత్రులు గంటా, అయ్యన్న వర్గాలు తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధపడిపోయాయి. ఇన్నాళ్లు పరోక్షంగా సాగిన వర్గపోరు పూర్తిస్థాయిలో బట్టబయలైంది. గంటా వర్గం వ్యూహాత్మక దాడితో అయ్యన్నవర్గాన్ని దెబ్బతీసింది. ఇక  ముసుగులో గుద్దులాట ఎందకని భవించిందో ఏమో అయ్యన్నవర్గం ప్రత్యక్ష పోరుకు తెరతీసింది.
 
అయ్యన్నవర్గం చూపిన తెగింపు టీడీపీలో కలకలం సృష్టించింది.  గంటా వర్గంపై అవినీతి అస్త్రం మంత్రి గంటా, విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావులతోపాటు ఆ వర్గం అవినీతి బండారాన్ని బట్టబయలు చేసేందుకు అయ్యన్నవర్గం ప్రజల ముందుకు వచ్చింది. ఞ అయ్యన్న సారథ్యంలో ఆయన అనుచరుడు, జిల్లా పార్టీ అధ్యక్షుడు గవిరెడ్డి గంటా వర్గంపై అవినీతి బాణాన్ని సంధించారు. జిల్లా టీడీపీ ఆఫీసులోనే ఆడారి తులసీరావుపై భారీ అవినీతి ఆరోపణల చిట్టాను విప్పారు. విశాఖ డెయిరీ నిధులను ఆయన సొంత ప్రయోజనాలకు ఎలా వాడుకుంటోంది ఒక్కొక్కటిగా వివరిస్తుంటే విస్తుపోవడం అందరి వంతైంది. పాడి రైతులను దోచుకున్న తీరు, కుటుంబ సభ్యుల పేర్లతో సంపాదించిన ఆస్తులు,  ఏర్పాటు చేసిన సంస్థల వివరాలు... ఇలా ఒక్కొక్కటిగా గవిరెడ్డి సోదాహరణంగా వివరించారు. గంటా వర్గీయుడైన అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవిందరావు తీరుపై కూడా విరుచుకుపడ్డారు. అవినీతిపరులంతా ఒక గూటిలో చేరి ప్రజలను దోచుకుంటున్నారని గవిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
 
సీబీఐ విచారణకు డిమాండ్

గంటా వర్గంపై అవినీతి ఆరోపణలు చేయడంతో అయ్యన్నవర్గం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఎక్కడా సీఎం చంద్రబాబును విమర్శించకుండానే చెప్పాల్సిందంగా చెప్పింది. రూ.500కోట్లమేర పాడిరైతులను దోచుకున్న ఆడారి తులసీరావుపైనా సీబీఐ విచారణ జరిపించాలని గవిరెడ్డి డిమాండ్‌చేశారు. తులసీరావుతో కలసి మంత్రి గంటా తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని కూడా ఆరోపించారు. తులసీరావు అవినీతిలో భాగస్వామి కావడం వల్ల ఆయనకు మంత్రి గంటా మద్దతిస్తున్నారని చెప్పకనే చెప్పారు. అంటే సీబీఐ విచారణ జరిపితే తులసీరావుతోపాటు గంటా బాగోతం కూడా బయటపడుతుందని పరోక్షంగా స్పష్టం చేశారు.

 సీబీఐ విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించకపోతే తప్పుడు సంకేతాలు వెళతాయని కూడా చెప్పారు. మరి దీనిపై సీఎంగానే కాకుండా పార్టీ అధినేతగా కూడా చంద్రబాబు స్పందించాల్సిన పరిస్థితిని కల్పించారు. లేకపోతే అవినీతికి ఆయన అండగా ఉన్నట్లు భావించాల్సి వస్తుందని గవిరెడ్డి పరోక్షంగా హెచ్చరించారు. ఊహించని రీతిలో అయ్యన్న వర్గం చేసిన ఈ ఎదురుదాడితో గంటా అండ్ కోను అవినీతి గ్యాంగ్‌గా ప్రజల ముందు నిలబెట్టినట్లైంది. వేగంగా చోచుకున్న ఈ పరిణామాలు జిల్లా టీడీపీలో కాదు రాష్ట్ర పార్టీలోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement