
సాక్షి, విశాఖపట్నం : ఎన్నికల తరువాత ఈవీఎంల మీద మాట్లాడిన నేతలంగా స్లీపర్‌సెల్స్‌లోకి వెళ్లిపోయారని, వారంతా ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి అన్నారు. గత క్యాబినేట్‌లో కొలువైన మంత్రి నారాయణ కార్పోరేట్ మాఫియాకు అధిపతి అని పేర్కొన్నారు. కార్పోరేట్ వ్యవస్థను సర్వనాశనం చేశారని, కార్పోరేట్ విద్యాసంస్థలు, ఆస్పత్రుల మీద విచారణ చేపట్టాలని కోరారు. రాష్ట్రంలో కొందరు కమ్యూనిస్ట్‌లు, కాంగ్రెస్ పార్టీ కొత్త రాజకీయాలు ప్రారంభించాయన్నారు.
వైఎస్ జగన్ నాయకత్వాన కొత్త ప్రభుత్వం ఏర్పాటై వారం రోజులు కాకముందే ప్రత్యేక హోదా, నవ నిర్మాణ దీక్షలు అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. నిర్ణయాత్మక సూచనలు ఇవ్వకుండా దుర్మార్గపు ఆలోచన చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో సారి కూడా రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా రాలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అభివృద్ది వికేంద్రీకరణ జరగాలన్నారు. జిల్లాల పునర్విభజనపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు.