రైతు శ్రేయస్సే లక్ష్యం..  | NG Ranga Agricultural University Vishnuvardhan Reddy CM Jagan Govt | Sakshi
Sakshi News home page

రైతు శ్రేయస్సే లక్ష్యం.. 

Published Tue, Aug 10 2021 4:25 AM | Last Updated on Tue, Aug 10 2021 4:25 AM

NG Ranga Agricultural University Vishnuvardhan Reddy CM Jagan Govt - Sakshi

సాక్షి, అమరావతి: రైతు శ్రేయస్సే లక్ష్యంగా కృషిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ ఆశయసిద్ధికి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కట్టుబడి ఉందని వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ ఎ.విష్ణువర్ధన్‌రెడ్డి చెప్పారు. దేశంలోనే వినూత్న ప్రయోగంగా ఖ్యాతిగాంచిన వైఎస్సార్‌ రైతుభరోసా కేంద్రాలతో (ఆర్బీకేలతో) కలిసి అన్నదాతల సంక్షేమానికి, రైతు ఆదాయం రెట్టింపు చేసేందుకు విస్తృత చర్యలు చేపట్టామన్నారు. విశ్వవిద్యాలయం 50వ స్నాతకోత్సవం మంగళవారం తిరుపతిలోని ఎస్వీ వ్యవసాయ కళాశాలలో జరుగనుంది. వర్సిటీ చాన్సలర్, రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్‌గా పాల్గొనే ఈ స్నాతకోత్సవంలో విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయనున్నట్లు వైస్‌ చాన్సలర్‌ చెప్పారు. స్నాతకోత్సవం నేపథ్యంలో ఆయన సాక్షి ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. రైతు సొంతంగా విత్తనాన్ని తయారు చేసుకునేందుకు వర్సిటీ సహకరిస్తుందన్నారు. దీనివల్ల నాణ్యత పెరుగుతుందని, రైతుకు ఖర్చు తగ్గుతుందని చెప్పారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

ఇప్పటివరకు 455 వంగడాల విడుదల
యూనివర్సిటీ ఇప్పటివరకు హైబ్రిడ్‌ సహా 455 పంట వంగడాలను విడుదల చేసింది. 2020లో వర్సిటీ రాష్ట్రస్థాయిలో 22, జాతీయస్థాయిలో 10రరకాల వంగడాలను విడుదల చేసింది. బెల్లంపొడి తయారీకి, నాగజెముడుతో తయారు చేసే ఫ్రూట్‌బార్‌కు పేటెంట్లు వచ్చాయి. 

13వ స్థానానికి చేరిన వర్సిటీ ర్యాంకు
దేశంలో 74 వ్యవసాయ విశ్వవిద్యాలయాలుంటే గతేడాది వరకు ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ ర్యాంకు 31. ఇప్పుడు 13వ స్థానానికి చేరింది. 

మౌలికవసతులకు తొలి ప్రాధాన్యత
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి మౌలిక వసతుల కల్పన పెద్ద సమస్యగా మారింది. గుంటూరుకు సమీపంలోని లాం ఫాంలో ప్రధాన భవంతుల నిర్మాణం పూర్తికావొచ్చింది. తిరుపతిలో అగ్రి బిజినెస్‌ సెంటర్‌ను ముఖ్యమంత్రి, గవర్నర్‌ మంగళవారం ప్రారంభిస్తారు.  

ఈ ఏడాది లక్ష క్వింటాళ్ల లక్ష్యం
వ్యవసాయంలో విత్తనం ఎంత నాణ్యతగా ఉంటే దిగుబడి అంత ఎక్కువగా ఉంటుంది. అందుకే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా నాణ్యమైన విత్తనాన్నే సరఫరా చేయాలని ఆదేశించారు. దానికనుగుణంగానే రైతు సొంతంగా విత్తనాన్ని తయారు చేసుకునే కార్యక్రమానికి యూనివర్సిటీ శ్రీకారం చుట్టింది. 2020–21లో 43,064 క్వింటాళ్ల బ్రీడర్, ఫౌండేషన్‌ విత్తనాలను రైతులకు సరఫరా చేశాం. ఈ ఏడాది అంటే 2021–22కి ఆ లక్ష్యాన్ని లక్ష క్వింటాళ్లుగా పెట్టుకున్నాం.  రాష్ట్రంలో వినూత్నంగా అమలవుతున్న వైఎస్సార్‌ రైతుభరోసా కేంద్రాలతో వర్సిటీ కేంద్రాలు, ఏరువాక కేంద్రాలు అనుసంధానమై రైతులకు రోజువారీ సూచనలు, సలహా ఇస్తున్నాయి. 

వ్యవసాయ పీజీ కోర్సుల్లో 20 శాతం ఎన్‌ఆర్‌ఐ కోటా
యూనివర్సిటీ క్యాంపస్‌ (తిరుపతి): ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిదిలో వ్యవసాయ పీజీ కోర్సుల్లో 20 శాతం ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్డ్‌ కోటా సీట్లు ప్రవేశపెట్టనున్నట్లు వీసీ డాక్టర్‌ ఎ.విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపా రు. ఆయన సోమవారం తిరుపతి వ్యవసాయ కళాశాలలో మీడియాతో మాట్లాడారు. పీజీ కోర్సుల్లో సీట్ల సంఖ్య చాలా త క్కువగా ఉందని, దేశవ్యాప్తంగా డిమాండ్‌ ఉ న్న నేపథ్యంలో పీజీ కోర్సుల్లో 20 శాతం ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్డ్‌ కోటా ప్రవేశపెడుతున్నామని తెలిపారు. దీనిద్వారా మరో 34 సీట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. యూజీ కోర్సుల్లో 10 శాతం సీట్లు ఎన్‌ఆర్‌ఐ కోటా కింద ప్రవేశపెట్టామన్నారు. 

డిప్లమో కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు 
వ్యవసాయ పాలిటెక్నిక్‌ డిప్లమో కోర్సుల్లో ప్ర వేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే నోటిఫికేష న్‌ విడుదల చేశామన్నారు. ఈనెల 13న మొదలయ్యే రిజిస్ట్రేషన్ల ప్రకియ 23 వరకు కొనసాగుతుందన్నారు. 10వ తరగతి పాసైనవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 4,230 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. సెప్టెంబర్‌లోపు అడ్మిషన్లు పూర్తిచేస్తామని తెలిపారు. ఆయన వెంట రిజిస్ట్రార్‌ గిరిధర్‌కృష్ణ, డీన్‌ ప్రతాపకుమార్‌రెడ్డి, అసోసియేట్‌ డీన్‌ బూచుపల్లి రవీంద్రనాథరెడి 
తదితరులు ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement