వృత్తి విద్య నేలచూపు! | Vocational Education getting down! | Sakshi
Sakshi News home page

వృత్తి విద్య నేలచూపు!

Published Sun, Oct 13 2013 3:30 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

Vocational Education getting down!

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వృత్తివిద్య నేలచూపులు చూస్తోంది. నాలుగేళ్లుగా అడ్మిషన్ల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. గతేడాది నుంచి పరిస్థితి మరీ దిగజారింది. సీట్ల సంఖ్య పెరుగుదలలో భారీ మార్పు లేకపోయినా మిగిలిపోతున్న సీట్ల సంఖ్య మాత్రం ఏటా పెరుగుతూ వస్తోంది. వృత్తి విద్యా కోర్సులకు భారీగా ఫీజులు పెరగడంతో 2012-13 విద్యా సంవత్సరం నుంచి ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. 2011-12 విద్యా సంవత్సరం నుంచి ఏటా లక్షకు పైగా ఇంజనీరింగ్ సీట్లు మిగిలిపోతున్నాయి. ఫార్మసీ సంస్థలకు మన రాష్ట్రం.. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా ఉన్నప్పటికీ బీ ఫార్మసీ సీట్లకూ ఆదరణ కరువవుతోంది. ఇక ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు డిమాండ్ పూర్తిగా పడిపోయింది. ఎంసీఏలో 5 వేల పైచిలుకు సీట్లు మాత్రమే భర్తీ అవడం చూస్తుంటే.. వచ్చే ఏడాది ఈ కోర్సులో విద్యార్థులు కేవలం ప్రభుత్వ కళాశాలల్లో మాత్రమే చేరే పరిస్థితి కనిపిస్తోంది.
 
 ఇంజనీ‘రంగు’ వెలుస్తోంది..
 
 నాలుగేళ్లుగా రాష్ట్రంలో 4 నుంచి 4.5 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియెట్ ఎంపీసీలో చేరుతుండగా.. వీరిలో 3 లక్షలకుపైగా విద్యార్థులు ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకుంటున్నారు. వీరిలో 90 శాతం మంది ఉత్తీర్ణత సాధిస్తున్నారు. కానీ ప్రవేశాల వరకు వచ్చేసరికి లక్ష పైచిలుకు మాత్రమే ఉంటున్నారు. ఈ లక్ష పైచిలుకు ఇంజనీరింగ్ విద్యార్థుల్లో పట్టా చేతికొచ్చేసరికి 12 నుంచి 17 శాతం మంది మాత్రమే ఉద్యోగాలు సాధించగలుగుతున్నారు. అంటే ఏటా లక్ష మందికి పైగా ఇంజనీరింగ్‌లో చేరుతున్నా, 20 వేల లోపు మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయి. రాష్ట్రంలో గత నాలుగైదేళ్లుగా ఐటీ రంగం విస్తరించకపోవడం, ఎలక్ట్రానిక్, హార్డ్‌వేర్ పరిశ్రమలు రాకపోవడం, విద్యుదుత్పత్తి ప్రాజెక్టులు చేపట్టకపోవడం తదితర కారణాల వల్ల కొత్త ఉద్యోగాలకు ఆస్కారం లేకుండా పోయింది. ఉన్న అరకొర ఉద్యోగాల్లో కూడా చేరేందుకు అవసరమైన సాఫ్ట్ స్కిల్స్ లేకపోవడం, ఎప్పటికప్పుడు కంపెనీల అవసరాలు మారిపోతుండటం, సబ్జెక్టుల్లో సిలబస్ మార్చకపోవడం, విద్యార్థులు ప్రాజెక్టు వర్క్ చేయకుండా కేవలం పాత ప్రాజెక్టు రిపోర్టుల ఆధారంగా నివేదికలు సమర్పించడం వంటి కారణాలు కూడా ఇంజనీరింగ్ విద్యపై వ్యతిరేక ప్రభావం చూపుతున్నాయి. మరోవైపు కాలేజీ ఫ్యాకల్టీల్లో నిపుణులు లేకపోవడం, ల్యాబ్, లైబ్రరీ వసతులు నామమాత్రంగా ఉండడం కూడా పరిస్థితిని మరింత దిగజార్చుతున్నాయి. నాణ్యత లేకున్నా లక్ష వరకు ఫీజులు, ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ రూపంలో కేవలం రూ.35 వేలు చెల్లిస్తుండడం, మిగిలిన వాటిలో నాణ్యత లేదని విద్యార్థులు అర్థంచేసుకోవడంతో ప్రవేశాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి.
 
 ఎంబీఏకూ కరువైన ఉపాధి..
 
 నాణ్యమైన మేనేజ్‌మెంట్ కోర్సుకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. కానీ రాష్ట్రంలో పేరుగాంచిన ఎంబీఏ కళాశాలలు చాలా తక్కువ. రాష్ట్రంలో దాదాపు 34 బిజినెస్ స్కూళ్లు ఏఐసీటీఈ అనుమతి లేకుండా నడుస్తున్నప్పటికీ, వాటిపై నియంత్రణ లేదు. ప్లేస్‌మెంట్ అవకాశాలు ఉంటాయన్న కారణంతో ఎక్కువ మంది విద్యార్థులు ఏఐసీటీఈ అనుమతి లేకున్నా ఈ బిజినెస్ స్కూళ్లలో చేరుతున్నారు. ఐసెట్ ద్వారా భర్తీ చేసుకునే ఎంబీఏ కళాశాలలు.. పారిశ్రామిక అనుసంధానం లేక ఉపాధి అవకాశాలు కల్పించలేకపోతున్నాయి. ఎంబీఏ చదివినా చిరు మార్కెటింగ్ ఉద్యోగిగా మారాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రూ.80 వేల వరకూ ఫీజులు చెల్లించి, చివ రకు రూ.7, 8 వేల ఉద్యోగంలో చేరాల్సి వస్తోంది. ఈ పరిస్థితి వల్ల ఎంబీఏకూ ఆదరణ క్రమంగా తగ్గుతోంది.
 
 కంపెనీలకు పట్టని ఎంసీఏ పట్టభద్రులు
 
 మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) కోర్సు చేసే వారికి ఉద్యోగాలు దొరకడం కష్టంగా మారింది. కంప్యూటర్ సంస్థలు ఏ ఒక్కటీ తమ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లో ఎంసీఏ అర్హతకు చోటు కల్పించడంలేదు. కంపెనీల అవసరాలకు తగిన కరిక్యులం లేకపోవడం, ఐటీ రంగంలో ఎప్పటికప్పుడు తాజా కోర్సులకే డిమాండ్ ఉండడంతో ఎంసీఏకు ఆదరణ పూర్తిగా కరువైంది. ఈ ఏడాది కౌన్సెలింగ్‌లో కేవలం 5,514 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పరిస్థితి ఇలాగే ఉంటే ఒకట్రెండు సంవత్సరాల్లో ఈ కోర్సు కనుమరుగైపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు పేర్కొంటున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కోర్సులు, సిలబస్ మారాల్సిన అవసరముందని స్పష్టం చేస్తున్నారు.
 
 బీ ఫార్మసీ.. అదే పరిస్థితి
 
 బీ ఫార్మసీలో ప్రవేశాల సంఖ్య తగ్గకపోయినప్పటికీ, ఆశిం చినంత పెరుగుదల లేదు. 2009-10లో 13 వేల పైచిలుకు అడ్మిషన్లు ఉండగా.. 2012-13 నాటికి దాదాపు వెయ్యి అడ్మిషన్లు మాత్రమే పెరిగాయి. ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన ఎంపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్‌లో 558 సీట్లే భర్తీ అయ్యాయి. బైపీసీలో 14 వేల సీట్లు మాత్రమే నిండే పరిస్థితి ఉంది.
 
 ప్రభుత్వానికీ బాధ్యత ఉంది
 ‘‘1993-94లో 32 ఇంజనీరింగ్ కళాశాలలు ఉంటే ఇప్పుడవి 717కు చేరాయి. అనేక కారణాల వల్ల కళాశాలల స్థాపనకు ప్రభుత్వం అనుమతిచ్చింది. సిబ్బంది కొరత, ప్రమాణాలలేమి విద్యపై ప్రభావం చూపుతున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అందిపుచ్చుకునేందుకు కళాశాలలు ప్రయత్నించాయే తప్ప ప్రమాణాలు పెంచలేదు. 60 కళాశాలల్లో నూరు శాతం సీట్లు నిండాయంటే వీటిలో మాత్రమే ప్రమాణాలు ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. దీనిపై కళాశాలలను నిందించడం సరికాదు. ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాలి’’        - డా. పి.మధుసూదన్‌రెడ్డి, విద్యారంగ విశ్లేషకులు
 
 ప్రవేశాలు ఆలస్యమవడమే కారణం
 ‘‘రాష్ట్రంలో తెలంగాణ, సీమాంధ్ర ఉద్యమాలు జరగడం, ఏటా అడ్మిషన్లు ఆలస్యమవడం, పొరుగు రాష్ట్రాల్లో జూలైలోగా అడ్మిషన్లు నిర్వహించడం వంటి కారణాల వల్ల విద్యార్థులు తరలిపోతున్నారు. ఫీజుల నిర్ధారణలో ఆలస్యం, యాజమాన్య కోటాపై కోర్టుల్లో కేసులు వంటి కారణాలతో ఏటా అడ్మిషన్ల ప్రక్రియ జాప్యమవుతోంది. అందువల్ల రాష్ట్రంలో ఇంజనీరింగ్ అడ్మిషన్ల సంఖ్య తగ్గుతోంది’’  - రాజేశ్వర్‌రెడ్డి, యాజమాన్య సంఘాల ప్రతినిధి
 
 ఇంజనీరింగ్‌లో సీట్ల పరిస్థితి ఇదీ..
 
 సంవత్సరం    మొత్తం సీట్లు    భర్తీ అయిన సీట్లు    మిగిలిన సీట్లు
 2009-10    2,26,870    1,77,200    49,670
 2010-11    2,79,752    1,94,203    85,549
 2011-12    3,06,925    1,84,080    1,22,845
 2012-13    3,38,950    1,58,700    1,80,250
 2013-14    3,28,625    1,28,950    2,00,000
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement