పాసుపుస్తకం జారీ చేసేందుకు రైతు నుంచి లంచం తీసుకుంటున్న వీఆర్‌వోను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
కొనకనమిట్ల, న్యూస్‌లైన్: పాసుపుస్తకం జారీ చేసేందుకు రైతు నుంచి లంచం తీసుకుంటున్న వీఆర్‌వోను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..కొనకనమిట్ల మండలంలోని చినారికట్ల గ్రామానికి చెందిన బరిగె గురువులు ఐదేళ్లుగా పాసు పుస్తకం కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. ఈక్రమంలో ఇటీవల వీఆర్‌వోగా వచ్చిన ఎస్.శివప్రసాద్‌ను కలిసిన సదరు రైతు మొత్తం వివరాలు అందచేసి, పాసు పుస్తకం వచ్చేలా చూడాలని వేడుకున్నాడు.
వీఆర్‌ఓ *5 వేలు ఇస్తే, వెంటనే పాసు పుస్తకం వచ్చేలా చూస్తానని చెప్పాడు. అంత ఇచ్చుకోలేనని రైతు వేడుకున్నా, పై వారికి నేనేం చెప్పాలని కసురుకున్నాడు. దీంతో రైతు విషయం ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. రైతు గురువులు సోమవారం కార్యాలయానికి వచ్చి వీఆర్‌వోకు * 3,500 ఇచ్చి తొందరగా పనిజరిగేలా చూడాలని కోరాడు. అప్పటికే మాటువేసిన ఏసీబీ అధికారులు వీఆర్‌వో నుంచి నగదును, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. దాడిలో నెల్లూరు డీఎస్పీ జే భాస్కరరావు, ఒంగోలు సీఐలు వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, ఎస్సైలు కృపానందం, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.