కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ సోమవారం నాటితో ముగిసింది. మొత్తం 78,881 మంది అభ్యర్థులు దరఖాస్తుచేసుకున్నారు. వీరిలో వీఆర్‌ఓ పోస్టులకు 73,353 మంది, వీఆర్‌ఏ పోస్టులకు 3148 మంది.. వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పోస్టులకు 2,380 పోటీ పడుతున్నారు. జిల్లాలో 105 వీఆర్‌ఓ పోస్టులు భర్తీ చేస్తుండగా.. ఒక్కో పోస్టుకు 721 మంది మధ్య పోటీ నెలకొంది. మొత్తం దరఖాస్తుదారుల్లో వికలాంగులు 2,149 మంది ఉన్నారు. 2011లో 58 వీఆర్‌ఓ పోస్టులను భర్తీ చేశారు. అప్పట్లో 59వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు గడువు పూర్తి కావడంతో మంగళవారం పరిశీలన కార్యక్రమం చేపట్టనున్నారు. ప్రధానంగా ఫొటోలు సంతకాలను పరిశీలిస్తారు. ఫొటో ఉండి సంతకం చేయనివి, సంతకం ఉండి ఫొటోలు లేని గుర్తిస్తారు. ఇలాంటి దరఖాస్తుదారులు రాత పరీక్షకు వచ్చే రోజు ఫొటోపై గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించుకురావాల్సి ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు. పరిశీలన కోసం 25 మంది రెవెన్యూ ఉద్యోగులను పండగ రోజు కూడా కలెక్టర్ కార్యాలయానికి పిలిపించారు. అనవసరమైనన్ని కంప్యూటర్లను కూడా సిద్ధం చేశారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తి కావడంతో అధికార యంత్రాంగం రాత పరీక్షకు అవసరమైన సెంటర్లను గుర్తించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే ప్రాథమికంగా సెంటర్లను గుర్తించారు.
జిల్లా వ్యాప్తంగా 254 సెంటర్లు ఏర్పాటు చేయతలపెట్టారు. అత్యధికంగా కర్నూలులో ఏడు సెంటర్లు ఏర్పాటు చేస్తుండగా మిగిలిన వాటిని నంద్యాల, ఆదోని, నందికొట్కూరు, డోన్, ఎమ్మిగనూరు, ఆత్మకూరు, బనగానపల్లె, గూడూరు, కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 2వ తేదీన రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వీఆర్‌ఓ అభ్యర్థులకు.. సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు వీఆర్‌ఏ అభ్యర్థులకు పరీక్ష జరగనుంది. ఈనెల 19 నుంచి ఇంటర్నెట్‌లో హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
ఇక ‘పరీక్షే’
Published Tue, Jan 14 2014 12:55 AM | Last Updated on Sat, Sep 2 2017 2:36 AM
Advertisement
Advertisement