వ్యాగన్‌ వర్క్‌షాపునకు కదలిక | Wagon work shops starts | Sakshi
Sakshi News home page

వ్యాగన్‌ వర్క్‌షాపునకు కదలిక

Published Fri, Feb 16 2018 12:29 PM | Last Updated on Fri, Feb 16 2018 12:29 PM

Wagon work shops starts - Sakshi

వ్యాగన్‌ వర్క్‌షాప్‌ (ఫైల్‌)

రాష్ట్రంలోనే ఇలాంటి వర్క్‌షాపు విజయవాడలో ఉంది. వడ్లపూడిలో ఏర్పాటు కానున్నది రెండో వ్యాగన్‌ వర్క్‌షాపు. అయితే విజయవాడ వర్క్‌షాపు కంటే అత్యాధునిక యంత్ర పరికరాలు, సామగ్రిని కలిగి ఉంటుంది.

సాక్షి, విశాఖపట్నం: వడ్లపూడిలో నిర్మించ తలపెట్టిన వ్యాగన్‌ వర్క్‌షాపునకు ఎట్టకేలకు కదలిక వచ్చింది. ఈ బడ్జెట్‌లో రూ.150 కోట్లు కేటాయించడంతో త్వరలోనే ఈ వ్యాగన్‌ వర్క్‌షాపు పనులు ప్రారంభం కానున్నాయి. ఈ వ్యాగన్‌ వర్క్‌షాపును 2015–16 రైల్వే బడ్జెట్‌లో మంజూరు చేశారు. అప్పట్లో దీనికి రూ.213.97 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. 2016–17లో రూ.30 కోట్లు, 2017–18లో రూ.80 కోట్లు వెరసి రూ.110 కోట్లు కేటాయించారు. అయినప్పటికీ రైల్వే మంత్రిత్వశాఖ తీసుకున్న నిర్ణయాల వల్ల జాప్యం జరుగుతూ వచ్చింది. పలు తర్జన భర్జనల అనంతరం ఈ వర్క్‌షాపునకు గత జూన్‌ 15న అప్పటి రైల్వే మంత్రి సురేష్‌ప్రభు విజయవాడ నుంచి వీడియో లింకు ద్వారా శంకుస్థాపన చేశారు.

240 ఎకరాలు కేటాయింపు
వడ్లపూడిలో ఈ వ్యాగన్‌ వర్క్‌షాపు నిర్మాణానికి 240 ఎకరాలు కేటాయించారు. దీని నిర్మాణ బాధ్యతను చేపట్టడానికి తొలుత బీహార్‌లోని పాట్నాకు చెందిన ఓ సంస్థ ముందుకొచ్చింది. కానీ కొన్నాళ్ల తర్వాత వెనక్కి తగ్గింది. దీంతో రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌వీఎన్‌ఎల్‌)కు అప్పగించారు. ఈ వ్యాగన్‌ వర్క్‌షాప్‌ వ్యయం రూ.328.81 కోట్లకు పెరుగుతుందని ఆ సంస్థ అంచనా వేసింది. ఇందులో సివిల్‌ ఇంజినీరింగ్‌ పనులకు రూ.137 కోట్లు, మెకానికల్‌కు రూ.126 కోట్లు, విద్యుత్‌ పనులకు రూ.22 కోట్లు, సిగ్నలింగ్, టెలికాం అవసరాలకు రూ.8 కోట్లు, ఇతరత్రా పనులకు రూ.36 కోట్లు అవసరమవుతుందని పేర్కొంది. దీనికి రైల్వేశాఖ కూడా ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో తాజా బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ పీరియాడికల్‌ ఓవర్‌ హాలింగ్‌ (పీవోహెచ్‌) వ్యాగన్‌ వర్క్‌షాపు పనులు ప్రారంభం కావడానికి మార్గం సుగమమైంది.

మరమ్మతులు, నిర్వహణ పనులు
ఈ వర్క్‌షాపులో 200 వరకు పాసింజరు, ఎక్స్‌ప్రెస్, గూడ్స్‌ రైళ్ల బోగీలు, ఆయిల్‌ ట్యాంకర్లకు మరమ్మతులు, నిర్వహణ పనులు చేయడానికి వీలవుతుంది. ఇన్నాళ్లూ నిధులు కేటాయించినా, శంకుస్థాపన చేయడానికి వీలుపడలేదు. శంకుస్థాపన జరగకుండా పనులు మొదలు పెట్టే అవకాశం లేదు. ఈ బడ్జెట్‌లో ఆశించిన స్థాయిలో రూ.150 కోట్లు కేటాయించడంతో త్వరలోనే ఈ వ్యాగన్‌ వర్క్‌షాపు పనులు మొదలు పెడతామని రైల్వే వర్గాలు ‘సాక్షి’కి చెప్పాయి. దీంతో వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి ఈ వ్యాగన్‌ వర్క్‌షాప్‌ను పూర్తి చేస్తామని చెబుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement