కేంద్ర మంత్రి సుజానా చౌదరి, ఎంపీ కొనకళ్ల నారాయణ,ఎంపీ కేశినేని శ్రీనివాస్
సాక్షి, విజయవాడ : జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నేతల్లో అంతర్మథనం ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వ ఆఖరి బడ్జెట్‌లోనూ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు, రాజధాని అమరావతి నిర్మాణానికి కావాల్సిన నిధులు రాబట్టలేకపోవడం, విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ సాధించలేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం, టీడీపీ ఎంపీల వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. నిన్నమొన్నటి వరకు రాష్ట్రానికి కేంద్రంగొప్పగా చేస్తోందని, కేంద్రాన్ని ఒత్తిడి చేస్తే రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అంటూ కల్లబొల్లిమాటలతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ప్రజలను మభ్యపెడుతూ వచ్చారు. తాజాగా కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం చేయడంతో ప్రజల్లోకి ఏ విధంగా వెళ్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులకు అర్థం కావడం లేదు.
కేంద్రమంత్రి, ఎంపీల తీరుపై విమర్శలు
బీజేపీతో పూర్తిగా తెగదెంపుల దాకా రానీయకుండా జాగ్రత్తపడాలని పార్టీ ముఖ్యనేతల నుంచి సూచనలు రావడంతో జిల్లా ఎంపీలు కొనకళ్ల నారాయణ, కేశినేని శ్రీనివాస్ పార్లమెంట్‌లో నిరసన తెలిపేందుకే పరిమితమయ్యారు. ఎంపీ కేశినేని నాని కాంగ్రెస్‌ను తప్పుపట్టేందుకే ప్రాధాన్యత ఇచ్చి, కేంద్రాన్ని నిలదీయలేదు. తీవ్ర అన్యాయం జరుగుతన్న సమయంలో తన పదవికి రాజీనామా చేసి, ముందుండి పోరాడాల్సిన జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి సుజనాచౌదరి సహచర కేంద్రమంత్రులతో చర్చలు జరపడం, ప్రధాని ప్రసంగానికి అభినందలు తెలపడం వంటి చర్యలతో ప్రజాగ్రహానికి గురయ్యారని టీడీపీ నాయకులే అంగీకరిస్తున్నారు.
మిత్రపక్షం నుంచీ తప్పని విమర్శలు
కేంద్రంపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలు, వ్యాఖ్యలను జిల్లా బీజేపీ నేతలు అదేస్థాయిలో తిప్పికొడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ఓట్ల కోసం ప్రజల వద్దకు వెళ్లలేని దుస్థితి దాపురిస్తుందని కొందరు టీడీపీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. పేదలకు పక్కా ఇళ్లు, బీమా తదితర కేంద్ర ప్రభుత్వ కార్యాక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను పెట్టకపోవడాన్ని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రానికి ముఖ్యంగా విజ యవాడ అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులను సద్వి నియోగం చేయలేదంటూ ఆరోపిస్తున్నారు. బీజేపీ మంత్రి కామినేని శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వం విషయంలో మౌనంగా ఉన్నప్పటికీ టీడీపీ ప్రజాప్రతినిధులు, ఆపార్టీ నాయకుల అవినీతిని జిల్లా, సిటీ బీజేపీ అనుబంధ సంఘాల నాయకులు ఎండగుతున్నారు. జిల్లాలోని వామపక్షపార్టీలు కూడా తమనే తప్పుపట్టడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే జిల్లాలో అనేక నియోజకవర్గాలో టీడీపీ నేతల మధ్య సఖ్యత లోపించడంతో రెండు వర్గాలకు దూరంగా ఉంటున్న కార్యకర్తలు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల వద్దకు వెళ్లకపోవడమే మంచిదనే ఆలోచనలో ఉన్నారు.
హోదాపై వైఎస్సార్ సీపీ నేతలు ఆందోళనలు
రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా, రైల్వేజోన్, పోలవరానికి నిధులు వంటి అంశాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మొదటి నుంచీ పోరాడుతూ ప్రజల్లోకి చొచ్చుకెళ్తున్నారు. పార్టీ మచిలీపట్నం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి, విజయవాడ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లాది విష్ణు, ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జులు ఎప్పటికప్పుడు ప్రత్యేక హోదా, ఇతర అంశాలపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల తీరును ఎండగడుతున్నారు. రాజధాని రైతుల వద్ద బలవతంగా భూములు లాక్కోవడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాకు వచ్చి రైతులకు అండగా ధర్నా చేయడాన్ని జిల్లా వాసులు మరిచిపోలేదు. పంటలు ఎండిపోయినప్పుడు జగన్‌మోహన్ రెడ్డి స్వయంగా పర్యటించిన రైతులకు భరోసా ఇచ్చారు. టీడీపీ అధిష్టానం చేసిన తప్పులకు ప్రజల్లో వెల్లువెత్తుతున్న వ్యతిరేకతను ఏవిధంగా తట్టుకోవాలో తెలియక టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment