సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎంపీ అనంతవెంకటరామిరెడ్డి
అనంతపురం: కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ప్రజలంతా గగ్గోలు పెడుతుంటే వారి దృష్టి మళ్లించేందుకే టీడీపీ, బీజేపీ నేతలు తోడు దొంగల్లా పరస్పర విమర్శలతో కొత్త నాటకానికి తెర తీశారని మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో లాయర్లు చేస్తున్న ఆందోళనకు సంపూర్ణ మద్దతునిస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు అవినీతిని బీజేపీ ఎమ్మెల్సీ కొత్తగా చెప్పాల్సిందేమీ లేదని, రెండెకరాల నుంచి లక్షల కోట్లు ఎలా సంపాదించారో ప్రజలకు తెలుసన్నారు. తామెప్పుడూ ప్రజల పక్షాన ఉంటామని, అధికారం కోసం మీలా కేంద్రానికి దాసోహం కామని టీడీపీ నాయకులపై మండిపడ్డారు. నాలుగేళ్లుగా కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. నిధుల కేటాయింపు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, రైల్వేజోన్, రాజధాని నిర్మాణం, పోలవరం, దుగరాజపట్నం పోర్టు, కడప ఉక్కు పరిశ్రమ ఇలా అన్నింటా మోసపోతున్నామన్నారు. అసెంబ్లీలో తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పలుమార్లు ప్రశ్నించారని గుర్తు చేశారు. రాజకీయంగా విభేదాలున్నా ప్రత్యేకహోదా విషయంలో కలిసికట్టుగా ముందుకెళ్దామని చెబితే తమను హేళన చేశారన్నారు.
టీడీపీ హంగామాప్రచారానికే..
‘ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. అభివృద్ధి ఎలా చేయాలో తెలుసు. నిధులు ఎలా తెచ్చుకోవాలో తెలుసు’ అని చెప్పిన సీఎం చంద్రబాబుకు ఈ రోజు అసలు విషయం తెలుస్తోందా? అని మండిపడ్డారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామన్న సీఎం ఈ రోజు రాష్ట్రంలో ఏమి చేస్తున్నారో.. అభివృద్ధి ఎక్కడ చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. పార్లమెంట్ ఆవరణలో ప్లకార్డులు పట్టుకుని టీడీపీ ఎంపీలు చేసిన హంగామా కేవలం ప్రచారానికే అనేది ప్రజలకు అర్థమైందన్నారు. దమ్ముంటే రాజీనామాలు చేసి రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్న ఆందోళనలో పాల్గొనాలని సవాల్ విసిరారు. బీజేపీ ఎమ్మెల్సీ వీర్రాజు వైఎస్సార్‌సీపీ కోవర్టు అని టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ ఆయన మా పార్టీ కోవర్టయితే చంద్రబాబు బీజేపీ కోవర్టా? అని ఎద్దేవా చేశారు. బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఈనెల 8న వామపక్షాలు చేస్తున్న బంద్‌లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ మేయర్ రాగే పరుశురాం, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వైవీ శివారెడ్డి, నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఆలుమూరు శ్రీనివాసరెడ్డి, గోగుల పుల్లయ్య, బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment