ప్రతీసారి జిల్లావాసులను ఊరిస్తూ ఉసూరుమనిపిస్తున్న రైల్వే బడ్జెట్‌కోసం ఈ సారి వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. రైల్వే బడ్జెట్‌కు ముందు జిల్లా ఎంపీలు భారీ ప్రతిపాదనలు పెట్టడం.. తీరా బడ్జెట్లో వాటికి ఆమోదం లభించకపోవడం ఏటా జరుగుతున్న తంతే. ఫలితంగా దశాబ్దాకాలంగా రైల్వేరంగం జిల్లాలో ఆశించినంతగా అభివృద్ధి జరగడం లేదు. యూపీఏ-2 ప్రభుత్వ చిట్టచివరి బడ్జెట్‌లోనైనా జిల్లాకు న్యాయం జరుగుతుందా? రైల్వేశాఖ మంత్రి మల్లికార్జున ఖర్గే ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో జిల్లా ఎంపీల ప్రతిపాదనలు కార్యరూపం దాలుస్తాయా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది.
సాక్షి, కరీంనగర్ : జిల్లాలోని ప్రధాన రైల్వేస్టేషన్లలో సౌకర్యాలపై అధికారులు శ్రద్ధ చూపడం లేదు. కరీంనగర్ రైల్వేస్టే షన్‌ను ఆదర్శ స్టేషన్‌గా ప్రకటించినా భారీ ఆదాయాలను సమకూరుస్తున్న స్టేషన్లలో కూడా ప్రయాణికులకు కనీస వసతులు కల్పించడం లేదు. రామగుండం రైల్వేస్టేషన్‌లో రెండో వైపు కూడా టికెట్ కౌంటర్ ఏర్పాటు చేయాల్సి ఉంది.
నాలుగు కొత్త రైలుమార్గాల కోసం జి ల్లా ప్రజలు,ప్రజాప్రతినిధులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నా మోక్షం లభించడం లేదు. కొత్తపల్లి నుంచి మనోహరాబాద్, కరీంనగర్ నుంచి హైదరాబాద్, కరీం నగర్ నుంచి హసన్‌పర్తి, రామగుండం నుంచి మణుగూరు లైన్ల కోసం ఏటా ప్రతిపాదనలు చేస్తూనే ఉన్నా రు. జిల్లానుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ముగ్గురు లోకసభ సభ్యులు పొన్నం ప్రభాకర్, జి.వివేక్, మధుయాష్కీలు ఇప్పటికే రైల్వే బోర్డుకు తమ ప్రతిపాదనలు అందించారు. బుధవారం లోకసభలో రైల్వేశాఖ మంత్రి ఖర్గే ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో తమ ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్ లభిస్తుందని వీరు విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు.
కొత్తపల్లి- మనోహరాబాద్ లైను ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు ఇక్కడనుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహించినప్పటి నుంచి ప్రతిపాదిస్తున్నా ఫలితం లేదు. దక్షిణ, ఉత్తర భారతాలను జిల్లా మీదుగా వెళ్తున్న రైలుమార్గం కలుపుతున్నా జిల్లాకు రాష్ట్ర రాజధానికి మాత్రం రైలు లింకు లేదు. ఈ లోటు తీర్చడం వల్ల ప్రయాణికులకు, వాణిజ్య రంగానికి మేలు కలగడమే కాకుండా రైల్వేకు కూడా ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ఈ రైలు మార్గాన్ని చేపడితే సిరిసిల్ల, సిద్దిపేట ప్రజలకు కూడా రైలు అందుబాటులోకి వస్తుంది. జిల్లా కేంద్రం నుంచి రాజధానికి ప్రయాణదూరం తగ్గుతుంది.
హైదరాబాద్ లైనుతోపాటు కరీంనగర్ నుంచి హసన్‌పర్తి వరకు కొత్త లై ను వేయాలని ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రతిపాదించారు. దీనివల్ల జిల్లా వాసులకు రైల్వే కనెక్టివిటీ మెరుగవుతుంది.
రామగుండం, మణుగూరు లైను కోసం పెద్దపల్లి ఎంపీ వివేక్ ప్రయత్నాలు చేస్తున్నారు. మణుగూరు రైలు మార్గానికి 1982లోనే రూ.650 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశారు. అప్పటి నుంచి ఈ లైను గురించి పట్టించుకున్నవారే లేరు. 2010లో ఈ ప్రతిపాదనను రైల్వేమంత్రి దృష్టికి వివేక్ తీసుకుపోగా సర్వే నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. నాలుగేళ్లుగా ఇదే తంతు సాగుతోంది.
పెద్దపల్లి-నిజామాబాద్ రైలు మార్గాన్ని త్వరితంగా పూర్తి చేయాలని ముగ్గురు ఎంపీలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. 1992లో అప్పటి ప్రధాని అయిన జిల్లావాసి పీవీ నర్సింహారావు చేతుల మీదుగా మొదలైన పెద్దపల్లి-నిజామాబాద్ రైలుమార్గం పనులు ఎడతెగకుండా సాగుతున్నాయి. మూడు దశల్లో పెద్దపల్లి నుంచి నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ వరకు పనులు పూర్తయ్యాయి.
గత బడ్జెట్‌లోనే పనులు పూర్తి చేస్తామని ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు. 1992లో రూ.400 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించగా ప్రతీ బడ్జెట్‌లో అరకొర నిధుల కేటాయింపుతో జాప్యం జరిగింది. మొత్తం 178 కిలోమీటర్ల ఈ మార్గం జిల్లాలో 122 కిలోమీటర్లు, నిజామాబాద్ జిల్లాలో 56 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు అంచనా వ్యయం రెట్టింపయింది. ఇప్పటికే రూ.560 కోట్లు ఖర్చు చేయగా మరో రూ.385 కోట్లు అవసరమని అంచనా వేశారు.
ఎంపీల ప్రతిపాదనలు ఇవీ.. పొన్నం ప్రభాకర్
కరీంనగర్ నుంచి మోర్తాడ్ వరకు రైలు మార్గం పూర్తయినందున కరీంనగర్, మెట్‌పల్లి మధ్య పుష్‌పుల్ రైలు నడపాలి. కరీంనగర్ నుంచి వరంగల్‌కు రైలు. కరీంనగర్ మండలం తీగలగుట్టపల్లి, హుజూరాబాద్ సమీపంలోని ఉప్పల్ వద్ద ఓవర్‌బ్రిడ్జీల నిర్మాణం. కరీంనగర్ - హసన్‌పర్తి కొత్త రైలుమార్గం కరీంనగర్, పెద్దపల్లి రైల్వేలైను విద్యుదీకరణ వేములవాడలో రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు.
వివేక్
మణుగూరు-రామగుండం కొత్తలైనుకు నిధులుపెద్దపల్లిలో ఏపీ ఎక్స్‌ప్రెస్ నిలుపుదల.
మధుయాష్కీ
పెద్దపల్లి-నిజామాబాద్ రైలుమార్గం పూర్తికి అవసరమైన నిధులు మంజూరు
ప్రతిపాదనలు పట్టాలెక్కేనా..!
Published Wed, Feb 12 2014 3:25 AM | Last Updated on Sat, Sep 2 2017 3:35 AM
Advertisement
Advertisement