- 2007 ఏప్రిల్ నుంచి రుణాల వివరాలు సేకరణ
- వ్యవసాయ, బంగారం తాకట్టు, డ్వాక్రా రుణాలు
- మార్గదర్శకాలపైనే అనుమానాలు
గుడివాడ/ ముదదినేపల్లి రూరల్, న్యూస్‌లైన్ : రుణాల మాఫీనిమిత్తం అవసరమైన వివరాలు సేకరించేందుకు బ్యాంకులు రెండు,మూడురోజులు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. వివరాల జాబితాను సాధ్యమయినంత త్వరలో పంపించాలని ప్రధాన కార్యాలయాలు ఆదేశాలు జారీచేస్తున్నాయి. అయితే చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశాక రుణ మాఫీపై ఎటువంటి మార్గదర్శకాలు ఇస్తారనే అనుమానం బ్యాంకర్లను వెంటాడుతోంది.
అందుకే 2007 ఏప్రిల్ 1నుంచి బ్యాంకుల్లో ఉన్న వ్యవసాయ , డ్వాక్రా, బంగారు రుణాలు ఎన్ని ఉన్నాయో వివరాల కోసం ఇప్పటికే కొన్ని బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు వివరాలు సేకరిస్తున్నాయి. 2007నుంచి ఈ ఏడాది మార్చి31 వరకు ఉన్న రుణాల వివరాలు తీసుకుంటున్నారని బ్యాంకర్లు చెబుతున్నారు.
అన్ని రుణాల వివరాలు విడివిడిగా...
వ్యవసాయ రుణాలు, అందులో బంగారం తాకట్టు రుణాలు, డ్వాక్రా రుణాలు విడివిడిగా ఆరా తీస్తున్నారు. 2007 ఏప్రిల్1నుంచి 2013 సెప్టెంబర్31 వరకు ఉన్న రుణాలు, అలాగే 2013 అక్టోబర్1నుంచి 2014 మార్చి31 వరకు ఉన్న రుణాలు, అలాగే గడువు తీరిన రుణాలు విడివిడిగా వివరాలు నమోదు చేస్తున్నారని తెలుస్తుంది.
మార్గదర్శకాలుపైనే అనుమానాలు..
ఇదిలా ఉండగా రుణాల రద్దుపై ప్రభుత్వం నుంచి ఎటువంటి మార్గదర్శకాలు వస్తాయనే అనుమానంలో బ్యాంకర్లున్నారు. రెండేళ్ల కాలంగా తీసుకున్న రుణాలకు తిరిగి చెల్లింపులు లేవని చెబుతున్నారు. దీంతో బ్యాంకుల టర్నోవర్ పెద్ద ఎత్తునే నిలిచి పోయింది.
రుణ భారం తగ్గించేందుకే..
వ్యవసాయ రుణాల్లో బంగారంపై పొందిన రుణాలు 40శాతం వరకూ ఉన్నట్లు సమాచారం.ఈ రుణాలన్నీ రద్దు చేయడం ప్రభుత్వానికి తలకు మించిన ఆర్థిక భారమవుతుంది. దీనిని తగ్గించుకునేందుకు ఓటర్లలో ఎక్కువ భాగమున్న మహిళలను ఆకట్టుకునేందుకు వీరికిచ్చిన రుణాలనే రద్దు చేయాలని ప్రభుత్వ చర్యలు స్పష్టం చేస్తున్నాయి.
బ్యాంకుల్లో బంగారంపై రూ.50వేల వరకూ రుణాలు పొందిన మహిళల జాబితా రూ.50వేల నుంచి రూ.లక్ష వరకూ రుణాలు,రూ.లక్ష నుంచి రూ.1.5లక్షల వరకూ రుణాలు పొందిన వారి జాబితాలు వెంటనే పంపాలని బ్యాంకు యాజమాన్యాలు తమశాఖలను ఆదేశించాయి. ఇలాంటి చర్యల వల్ల బంగారం రుణాలపై 60శాతం వరకు ప్రభుత్వానికి భారం తగ్గుతుందని భావిస్తున్నారు.
ఒక్క రుణమే రద్దు!
రైతులు ఒకే భూమిని తనఖాగా ఉంచి అటు బ్యాంకులు ఇటు సొసైటీల నుంచి రుణాలు పొందడం సాధారణంగా మారింది. రుణాల రద్దు పకడ్బందీగా అమలు చేసేందుకు ఇలాంటి రైతుల వివరాలు ప్రభుత్వం సేకరిస్తోంది. రుణాల రద్దుకు రూపొందించే నిబంధనల మేరకు ఏైదె నా ఒక రుణాన్ని మాత్రమే రద్దు చేయాలనే లక్ష్యంతో ఇలాంటి వివరాలు సేకరిస్తున్నట్లు చెబుతున్నారు.
అనుబంధరంగాలకు హుళక్కేనా?
పంట రుణాలతో పాటు గొర్రెల,పశువుల పెంపకం,ట్రాక్టర్లు,ఆయిల్ ఇంజన్ల కొనుగోలువంటి వ్యవసాయానుబంధ రంగాలకు రైతులు రుణాలు పొందుతున్నారు.ఎన్నికల సమయంలో వ్యవసాయరుణాలు రద్దు చేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. అయితే ఏ రుణాలనేది స్పష్టం చేయలేదు.ఇదిఅవకాశంగా తీసుకుని అనుబంధరంగాల రుణాల రద్దుకు ప్రభుత్వం మొగ్గు చూపదని భావిస్తున్నారు. ఈకారణం వలనే ఈరుణాల వివరాల సేకరణ పై ప్రభుత్వం ఇప్పటి వరకూ ఆసక్తి చూపలేదంటున్నారు.